సోమవతి అమావాస్య.. ఇదెందుకు అంత ప్రత్యేకమో తెలుసా!
సోమవతి అమావాస్య.. ఇదెందుకు అంత ప్రత్యేకమో తెలుసా!
హిందూమతంలో ప్రతి తిథికి దాని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి అపారమైన ఆధ్యాత్మిక, సాంప్రదాయ ప్రాముఖ్యత ఉంది. ఒక సంవత్సరంలో మొత్తం 12 అమావాస్యలు ఉంటాయి, వాటిలో సోమవారం వచ్చే అమావాస్య తిథిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. సోమవారం శివారాధనకు చాలా శ్రేష్టం. అలాగే, పితృదేవతలను పూజించడానికి, ప్రార్థనలు చేయడానికి, గంగానదిలో స్నానం చేయడానికి , దానాలు చేయడానికి అమావాస్య తిథి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం సోమవతి అమావాస్య మరింత ప్రత్యేకమైనదని చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
సోమవతి అమావాస్య..
హిందూమతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సం శుభపరిణామాలు ఏర్పడటంతో, ఇది మరింత ఫలవంతమైనదని పండితులు చెబుతున్నారు. ఈసారి మూడు సంవత్సరాల తర్వాత సోమవతి అమావాస్య నాడు అధిక మాస సంగమం ఏర్పడనుంది, దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అధిక మాసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అధిక మాసంలో వచ్చే అమావాస్య నాడు చేసే దానాలు, స్నానాలు , పూజల ఫలాలు అనేక రెట్లు అధికమవుతాయి. అంతేకాకుండా, సోమవతి అమావాస్య నాడు మిథున సంక్రాంతి సంగమం కూడా ఏర్పడుతుంది. ఈ రోజున, సూర్యుడు తన రాశిని మార్చుకుని మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇంకా జూన్ 15వ తేదీన సర్వార్థ సిద్ధి యోగం , అమృత సిద్ధి యోగం కలయిక జరుగుతుంది, ఇది శాస్త్రాలలో చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగ సమయంలో చేసే ఏ పని అయినా ప్రత్యేక ఫలితాలు ఇస్తుంది.
సోమవతి అమావాస్య తిథి..
జూన్ 14, 2026న మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమై, జూన్ 15న ఉదయం 8:23 గంటలకు ముగుస్తుంది. అందువల్ల, స్నానం చేయడానికి, దానాలు చేయడానికి మరియు పూజలు చేయడానికి శుభ సమయం జూన్ 15న ఉదయం 3:33 నుండి 4:55 గంటల వరకు ఉంటుంది.
సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి?
అన్నిటికంటే ముందుగా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేసి, ఉపవాసం ఉండి దానం చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి. నది అందుబాటులో లేనివారు ఇంట్లోనే గంగను ఆవాహన చేసి స్నానం చేయాలి.
తరువాత ఒక రాగి పాత్రలో నీరు, కొన్ని చుక్కల గంగాజలం, ఎర్రటి పువ్వులు, అక్షతలు , వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించిన తరువాత, నల్ల నువ్వులను నీటిలో వేసి పితృదేవతలకు సమర్పించాలి.
సోమవతి అమావాస్య రోజున కులదైవాన్ని, విష్ణుమూర్తిని, శివుడిని పూజించాలి. శివునికి పాలు, గంగాజలం, తేనెతో అభిషేకం చేసి, విష్ణుమూర్తిని పూజిస్తూ మంత్రాలు జపించాలి.
అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం ఆనవాయితీ. రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి, పాలు పోసి సమర్పించాలి.
అమావాస్య తిథి నాడు పూజ అనంతరం శక్తి మేరకు పేదలకు, అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సోమవతి అమావాస్య నాడు ఎంతో పుణ్యం లభిస్తుంది.
*రూపశ్రీ.