ప్రపంచంలోనే ఏకైక రుక్మిణీ దేవి ఆలయం.. కృష్ణుడికి దూరంగానే రుక్మిణీ దేవి.. ఎక్కడంటే!

 

ప్రపంచంలోనే ఏకైక రుక్మిణీ దేవి ఆలయం.. కృష్ణుడికి దూరంగానే రుక్మిణీ దేవి..  ఎక్కడంటే!

భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ, గుజరాత్‌లోని ద్వారకలో ఆయన భార్య అయిన రుక్మిణి దేవికి ఒక ప్రత్యేకమైన ,  చారిత్రాత్మక ఆలయం ఉంది. ఈ ఆలయం అందం అద్బుతం.. అలాగే ఈ ఆలయం వెనుక  ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. ప్రపంచంలో రుక్మిణి దేవికి ఉన్న ఏకైక ఆలయం ఇదేనని, ఇక్కడ నేటికీ ఆయన భార్య శ్రీకృష్ణుడికి దూరంగా నిలబడి ఉంటుందని చెబుతారు. ఈ కారణాల వల్ల, శ్రీకృష్ణుడికి , రుక్మిణి దేవికి మధ్య ఎందుకంత దూరం ఉంది, దాని వెనుక కారణం ఏమిటి అని శ్రీకృష్ణ భక్తులు ఆలోచించక తప్పదు. ప్రపంచంలో శ్రీకృష్ణుడి భార్య నేటికీ ఆయనకు దూరంగా నిలబడి ఉన్న ఏకైక ఆలయం గురించి తెలుసుకుంటే..

ఆలయ చరిత్ర..

గుజరాత్ లోని ద్వారకలో ఉన్న  రుక్మిణి దేవాలయం చాలా పురాతనమైనది. ఇది సుమారు 5వ శతాబ్దం నాటిదని నమ్ముతారు. ఇది ప్రధాన ద్వారకాధీష ఆలయం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వారకాధీష్ ఆలయంలో కృష్ణుడిని పూజిస్తుండగా, ఈ ఆలయం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అవతారంగా భావించే రుక్మిణి దేవి పూజలు అందుకుంటోంది.

ఆలయ వాస్తుశిల్పం..

ఈ ఆలయం నాగరా శైలిలో నిర్మించబడింది, ఇది చూడటానికి చాలా వైభవంగా ఉంటుంది. దీని గోడలపై గజధార, నరధార వంటి ఏనుగుల ఆకృతులను అందంగా చెక్కారు. ఆలయం లోపల బంగారు ఆభరణాలతో అలంకరించబడిన రుక్మిణి అమ్మవారి అందమైన విగ్రహం ఉంటుంది, ఈ విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా సరే.. ఎంతో ప్రశాంతత కలుగుతుంది.

శ్రీకృష్ణుడికి దూరంగా రుక్మిణి ఆలయం..

రుక్మిణి ఆలయం ప్రధాన ఆలయానికి దూరంగా ఎందుకు ఉందని చాలామందికి సందేహం వస్తుంది. దీని వెనుక దుర్వాస మహర్షి శాపం కథ ఉంది. పురాణం ప్రకారం, ఒకప్పుడు దుర్వాస మహర్షి శ్రీకృష్ణుడు, రుక్మిణితో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో రుక్మిణికి తీవ్రమైన దాహం వేసింది. శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలితో భూగర్భం నుండి గంగాజలాన్ని తీసుకురాగా, రుక్మిణి తన దాహాన్ని తీర్చుకుంది. అయితే ఆ తొందరపాటులో ఆయన దుర్వాస మహర్షిని నీళ్ళు తాగుతారా అని అడగలేదట. దీనితో దుర్వాస  మహర్షికి కోపం వచ్చి, వారు విడివిడిగా జీవించాల్సి వస్తుందని శపించాడట. ఈ శాపం కారణంగా రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడికి దూరంగా నివసించింది. ఈ 12 సంవత్సరాలు తపస్సు చేసి చివరికి మహావిష్ణువు అనుగ్రహంతో శ్రీకృష్ణుడితో కలిసింది. రుక్మిణీ దేవి తపస్సు చేసిన ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ రుక్మిణీ దేవి పూజలు అందుకుంటోంది.   అందుకే ఈ రెండు ఆలయాలు నేటికీ వేర్వేరు ప్రదేశాలలో ఉన్నాయని చెబుతారు.

నీటిని దానం చేసే ఆచారం..

దుర్వాస మహర్షి ద్వారకలోని నీరు ఉప్పగా మారుతుందని కూడా శపించారట. అందువల్ల ఈ ఆలయంలో ఒక ప్రత్యేక ఆచారం ఉంది. ఇక్కడ నీటిని ప్రసాదంగా సమర్పిస్తారు. భక్తులు సందర్శకులకు త్రాగునీటిని దానం చేస్తారు. ఇక్కడ నీటిని దానం చేయడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయని, జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ప్రేమ, భక్తికి చిహ్నం..

రుక్మిణి విదర్భ రాజు భీష్మక కుమార్తె. ఆమె శ్రీకృష్ణుడిని గాఢంగా ప్రేమించి, అతన్నే తన భర్తగా భావించింది. ఆమె సోదరుడు బలవంతంగా ఆమెకు శిశుపాలుడితో వివాహం నిశ్చయించినప్పుడు, కృష్ణుడు రుక్మిణి విన్నపాన్ని మన్నించి వివాహం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడికి, రుక్మిణికి మధ్య ఉన్న ప్రేమను ఎంతో ఉన్నతమైనదిగా చెబుతారు.  

                                    *రూపశ్రీ.