పిల్లలపై పేరెంట్స్ ప్రభావం..
పిల్లలపై పేరెంట్స్ ప్రభావం..
విక్కీకి ఓ సబ్జెక్టులో ఫెయిలయ్యాడు. షాకైపోయింది రాధిక. ఎందుకంటే తన కొడుక్కి ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మరి వాడు ఫెయిలైపోవడం ఏమిటి? అర్థం కాక టీచర్ ని నిలదీసింది. ఈ మధ్య విక్కీ అస్సలు సరిగ్గా చదవట్లేదని, హోమ్ వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదని, ఇలా అయితే ఫైనల్ పరీక్షల్లో కూడా ఫెయిలవుతాడని టీచర్ అనేసరికి మళ్లీ షాకయ్యింది రాధిక. విక్కీ అలా ఎందుకైపోయాడో ఆమెకు అర్థమే కాలేదు. విక్కీని అడిగితే ఏడుస్తున్నాడు తప్ప మాట్లాడటం లేదు.
ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో ఉందా? ఉంటే ఆవేశపడకండి. మీ పాప/బాబుని తప్పు పట్టి తిట్టేయకండి. తను అలా అయిపోవడంలో మీ ప్రభావం ఏమైనా ఉందేమో పరిశీలించుకోండి అంటోంది ఓ ఆస్ట్రేలియన్ యూనివర్శిటీ. ఎందుకంటే తల్లిందండ్రులకు సంబంధించినంత వరకూ పిల్లలెప్పుడూ హుషారుగా ఉండాలి. సందడి చేయాలి. బాగా చదవాలి. అందరిలోనూ మంచి పేరు తేవాలి. అన్నీ మన కోరికలే. మన ఆశలే. మన అంచనాలే. మరి మన పిల్లలు మన నుంచి ఏం కోరుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచిస్తామా? పిల్లల అంచనాలకు తగ్గట్టు తల్లిదండ్రులు లేకపోతే వాళ్లు జీవితంలో ఎంత వెనకబడిపోతారో తెలుసా? తమకు తెలుసంటోంది ఓ ఆస్ట్రేలియన్ యూనివర్శిటీ. ఇటీవల వాళ్లు చేసిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
అస్తమానం పోట్లాడుకునే అమ్మానాన్నల పెంపకంలో పెరిగే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటున్నారు ఆ సర్వేకి అధ్యక్షత వహించిన చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ మారియా. తరచూ పోట్లాడుకునే తల్లిదండ్రులు ఉన్న వాతావరణంలో పెరిగే పిల్లలు కొందరు మొండిగా తయారవుతారట. మానసికంగా దెబ్బ తిని అన్నింట్లో వెనకబడిపోతారట. కొందరు మౌనంగా అయిపోతే ఇంకొందరు మరీ హుషారుగా తయారైపోయి తప్పుదార్లు తొక్కుతారట. వాళ్లలో కోపం, ద్వేషం, పగ వంటివి పెరిగిపోయి నేరాలకు పాల్పడతారట. చిన్న వయసులోనే నేరాలు చేసినవాళ్లు, ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లలో ఎక్కువమంది ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలే అంటున్నారు. కొన్ని వందల మంది బాల నేరస్థుల గాథలు పరిశీలించాక ఈ విషయం అర్థమయ్యింది. అది మాత్రమే కాక మానసిక ఒత్తిడి, మతిమరుపు, పరధ్యానం, ఆకలి తగ్గిపోవడం, నత్తి రావడం, పలు రకాల మానసిక వ్యాధులు కూడా పిల్లల్ని చుట్టుముడతాయని తేలింది.
చూశారు కదా! ఒకవేళ మీరు కనుక మీ పిల్లల ముందు పోట్లాడుకుంటున్నా, వాళ్ల ముందే తిట్టుకుని కొట్టుకుంటున్నా, నేను ఎక్కువ నువ్వు తక్కువ అంటూ ఒకరినొకరు అవమానించుకుంటున్నా, నువ్వలా నేనిలా అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నా వెంటనే అవన్నీ ఆపేయండి. పిల్లల జీవితాల కంటే మన అహం ఎక్కువ కాదు కదా!
- sameeranj