పాపమోచని ఏకాదశి.. తెలిసి లేదా తెలియక చేసిన పాపాలు తొలగాలంటే ఇలా చేయండి..!
పాపమోచని ఏకాదశి.. తెలిసి లేదా తెలియక చేసిన పాపాలు తొలగాలంటే ఇలా చేయండి..!
సనాతన ధర్మంలో ఎన్నో పండుగలు, వ్రతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని తిథులు చాలా ప్రత్యేకం. అలాంటి ప్రత్యేక తిథులలో ఏకాదశి తిథి ప్రముఖమైనది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. దీని ప్రకారం ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశులకు కూడా వివిధ పేర్లు ఉంటాయి. ఏడాది మొత్తం వచ్చే ఏకాదశులలో ఉపవాసం ఉండి, విష్ణువును పూజించాలి. ఇలా 24 ఏకాదశులు పాటిస్తే దాన్ని ఏకాదశి వ్రతం అని అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు. ప్రస్తుతం పాల్గుణ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి మార్చి 15వ తేదీ వచ్చింది. ఈ ఏకాదశిని పాపమోచని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. తెలిసి లేదా తెలియక చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం కావాలన్నా, ఆర్థిక సమస్యలు, మానసిక బాధలు తొలగిపోవాలన్నా పాపమోచని ఏకాదశి రోజు కొన్ని పరిహారాలు పాటించాలి. అలాగే ఏకాదశి ఉపవాసం, విష్ణుమూర్తి ఆరాధన కూడా చేసుకోవాలి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
తిలకం..
తులసికి, ఏకాదశి తిథికి చాలా గొప్ప సంబంధం ఉంటుంది. ఏకాదశి రోజు తులసిని ఆరాధిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తాయని చెబుతారు. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసిన తర్వాత.. తులసికి నమస్కరించి తులసి కుండీలో ఉన్న మట్టిని కొద్దిగా తీసుకుని దాన్ని నుదుటన తిలకంలా ధరించాలట. ఇలా చేస్తే తెలివితేటలు పెరగడం, అప్పులు తొందరగా తీరిపోవడం వంటివి జరుగుతాయని చెబుతారు.
నెయ్యి దీపం..
ఏకాదశి రోజు సా.యంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దీపం దగ్గర చిటికెడు పసుపు ఉంచి, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ.. తులసి చుట్టూ 11 లేదా 21 ప్రదక్షిణ చేయాలి. ఈ పరిహారం ఇంట్లో పేదరికాన్ని దూరం చేస్తుంది.
తులసి పూజ..
ఏకాదశి రోజు తులసి ఆకులకు విష్ణుమూర్తికి సమర్పించడం చాలా మంచిది. అయితే ఏకాదశి రోజు తులసి ఆకులను కోయకూడదు. విష్ణుపూజ కోసం తులసి ఆకులు కావాలంటే ముందురోజే సేకరించి భద్రపరుచుకోవాలి.
జాగ్రత్తలు..
ఏకాదశి రోజున తులసి మాత కూడా విష్ణువు కోసం నీరు లేకుండా ఉపవాసం ఉంటుందట, కాబట్టి ఈ రోజున తులసికి నీటిని సమర్పించకూడదని చెబుతారు.
ఏకాదశి రోజు ఇంట్లో వెల్లుల్లి లేదా ఉల్లిపాయలను ఉపయోగించకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు, ఎవరితో కోపంగా మాట్లాడకూడదు. అబద్దాలు చెప్పకూడదు.
అప్పుల బాధ నుండి బయటపడటానికి, ఏకాదశి రోజున పేదవారికి పసుపు పండ్లు లేదా ధాన్యాలు దానం చేయడం మంచిది.
*రూపశ్రీ.