సిల్లీ ఫెలో - 88

 

 

సిల్లీఫెలో - 88

- మల్లిక్

 

"సార్! మీరా విషయానికి అంత పబ్లిషిటీ ఇవ్వకండి సార్. అనవసరంగా లేనిపోని గోల. అంతా ఆపాత న్యూస్ పేపర్ పట్టుకుని మినిస్టర్ మిన్నారావుని హైరానా పెడతారు..."

"పెడ్తే పెట్టారులేవయ్యా లింగాల టింగిగాడు. ఆ మాత్రం అందరికీ ఉపయోగపడితే మంచిదేకదా! అసలు నాకు ప్రమోషన్ కి వేకెన్సీ వచ్చినప్పుడు నేను పాత పేపర్ని పట్టుకుని మళ్ళీ వాడి దగ్గరకెళ్తా..."

బుచ్చిబాబు ఈ న్యూస్ పేపరు ప్రహసనం ఎక్కడికి దారితీస్తుందోనని చాలా భయపడ్డాడు.

"ఇంతకీ మీరు ఎందుకు పిలిచారు సార్?" టాపిక్ మార్చేస్తూ అడిగాడు బుచ్చిబాబు.

ఏకాంబరం డ్రాలోంచి ఓ సీల్డు కవరు తీసాడు.

"ఇది అగర్ వాల్ అండ్ కంపనీకి తీస్కెళ్ళి అగర్ వాల్ కి ఇచ్చెయ్" బుచ్చిబాబు చేతికి కవర్ అందించాడు.

"అంతేనా సార్!" అడిగాడు బుచ్చిబాబు.

ఆ కవర్ ఓపెన్ చేసి చదివిన తరువాత ఏమయినా మెస్సేజ్ ఇస్తే నాకు చెప్పు. లేదా తిన్నగా ఆఫీసుకొచ్చేయ్"

"అలాగే సార్"

బుచ్చిబాబు వెనక్కి తిరిగాడు.

"ఇదిగో మాట"

బుచ్చిబాబు మళ్ళీ వెనక్కి తిరిగి ఏకాంబరం వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

"నువ్వేమీ కంగారుగా ఆఫీసుకి పరుగెత్తుకు రానక్కర్లా. ఆఫీసు ఎప్పుడూ ఉండేదే... ఎక్కడికీ పారిపోదు. హాయిగా కాళ్ళీడ్చుకుంటూ మెల్లగా రా" నవ్వుతూ అన్నాడు ఏకాంబరం.

బుచ్చిబాబు బాధగా మొహం పెట్టాడు.

"సార్! నేనెప్పుడైనా అలా చేశానా సార్" అన్నాడు.

ఏకాంబరం పకపకా నవ్వాడు.

"ఎప్పుడు చేయలేదనే ఇప్పుడు చేయమంటున్నా"

బుచ్చిబాబు తెల్లమొహం వేస్కుని చూసాడు.

"నేనేం వ్యంగ్యంగా అనడం లేదయ్యా బాబూ... నిజంగానే అంటున్నా! పాపం! నా ట్రాన్స్ ఫర్ చేయించి పెట్టావ్. నీకు ఆ మాత్రం కన్సెషన్ ఇవ్వకపోతే నన్ను అందరూ లత్తోరికిత్తు అనరూ?"

"లత్తోరికిత్కా? అదేంటి సార్?" నోరు తెరిచాడు బుచ్చిబాబు.

"అది కిల్లారికిత్తి కంటే నీచమైన తిట్టులే.. సరే నువ్వింకా వెళ్ళు!"

బుచ్చిబాబు వెనక్కి తిరిగి చూసాడు.

"ఏమయ్యోయ్! ఆఫీసుకు తిరిగొచ్చేటప్పుడు నీ పర్సనల్ పనులు ఏమయినా ఉంటే చూస్కుని మెల్లగా రా... మరేం పర్లేదు"

వెనుక నుండి అరిచాడు మేనేజర్ ఏకాంబరం.

"సిల్లీఫెలో"

మనసులో అనుకుని క్యాబిన్ లోంచి బయటికెళ్ళిపోయాడు బుచ్చిబాబు.


*            *                   *

అగర్ వాల్ బుచ్చిబాబు ఇచ్చిన కవర్ చింపి అందులోంచి మ్యాటర్ని చదివాడు.

"మీడీ ఏక్యాంబర్యం ఉత్తరం సదివిన్యాం.... మేము ఆలోచిస్తున్యాం!" అన్నాడు అగర్ వాల్ బుచ్చిబాబు మొహంలోకి చూస్తూ.

బుచ్చిబాబూ అలాగే అన్నట్టు తల ఊపి అక్కడే నిల్చున్నాడు.

"మేం ఆలోచిస్తున్యాం అని సెప్పిన్యాం! మనమెందున ఇక్కడ నింసున్యాం?" అడిగాడు అగర్ వాల్.

"మనం నిల్చోలేదు సార్! మీరు కూర్చున్నారు... నేను నిల్చున్నాను"

"అదే.. అదే ఎంద్కు నిల్చున్యాం?"

"మీరేమయినా చెప్తారని మ్యావ్"

"క్యా?" నొసలు చిట్లించాడు అగర్ వాల్.

బుచ్చిబాబు నాలుక కొరుక్కున్నాడు.