సిల్లీ ఫెలో - 18

 

 

సిల్లీఫెలో - 18

- మల్లిక్

 

"అదిగో అదే మినిష్టర్ మిన్నారావ్ గారిల్లు!" ఫర్లాంగు దూరంలో వున్న తెల్లని బంగళాని చూపించాడు వెంకట్రావ్ బుచ్చిబాబుకి.

"అమ్మో... ఎంత పెద్ద బంగళానో?" అన్నాడు బుచ్చిబాబు.

"మరేమనుకున్నావ్... మినిష్టరా మజాకా?'

"ఇదేదో సినిమా టైటిల్ లా బానేవుందే సిల్లీగా"

"నీకు ప్రతీదీ సిల్లీగానే వుంటుంది. ఒకప్పుడు మిన్నారావ్ ఏంటో తెలుసా?" అడిగాడు వెంకట్రావు.

"పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయి వుంటాడు. లేకపోతే ఇంత పెద్ద బంగళా ఎలా వుంటుంది.

"కాదు..." తల అడ్డంగా ఊపాడు వెంకట్రావు.

"కొంపదీసి స్మగ్లరా ఏంటి?" అడిగాడు బుచ్చిబాబు.

"కాదు.. కాదు... కాదు...! అయినా నువ్వు ఊహించలేవు. అందుకే చెప్పేస్తున్నా... రిక్షావోడు"

"ఆ సినిమా నిర్మాతా?" ఆశ్చర్యంగా అడిగాడు బుచ్చిబాబు.

"నీ బొంద... ఆ సినిమా ఇప్పటిదే కదా? అయినా నేను చెప్తున్నది సినిమా టైటిల్ కాదు... మిన్నారావ్ ఒకప్పుడు రిక్షా తొక్కేవాడు."

బుచ్చిబాబు వెంకట్రావ్ వంక ఆశ్చర్యంగా చూసాడు. రెండు క్షణాల తరువాత అన్నాడు "సిల్లీగా మాట్లాడకు"

"ఇంకేం! ఆ విషయం చెప్పి పరిచయం చేస్కుంటే నా పని క్షణాల్లో జరిగిపోతుందేమో?" సంబరపడిపోతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఆ ప్రసక్తి చెపితే నీ పని పడ్తాడు. వెంటనే మనిద్దర్నీ పనాళ్ళతో మెడపట్టి గెంటిస్తాడు" సీరియస్ గా చూస్తూ అన్నాడు వెంకట్రావ్.

"అసలు రిక్షా తొక్కేవాడు మినిష్టర్ ఎలాగయ్యాడో?" ఆశ్చర్యపోతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఆ విషయాలు తర్వాత చెప్తా. ఇల్లొచ్చేసింది అన్నాడు వెంకట్రావ్.

ఇద్దరూ గేటు దగ్గర కెళ్ళారు.

"ఎవరు కావాలి?" అడిగాడు గూర్ఖా.

"మినిష్టర్ మిన్నారావ్ గార్ని కలవాలి" చెప్పాడు వెంకట్రావ్.

"ఆయన లేరు .... బయటికెళ్ళిండ్రు"

"ఎక్కడికి వెళ్ళాడు?"

"ఏమో... తెల్వది!"

"ఎప్పుడొస్తారు?"

"గదీ భీ తెల్వది!" నిర్వికారంగా చెప్పాడు గుర్ఖావాడు.

ఏ భావమూలేని వాడి మొహాన్ని చూస్తే వెంకట్రావ్ కి మండింది.