కరుంగళి మాల అంటే ఏంటి? దాన్ని ఎలా ధరించాలి? దాని ప్రయోజనాలు ఏమిటి!

 

కరుంగళి మాల అంటే ఏంటి? దాన్ని ఎలా ధరించాలి? దాని ప్రయోజనాలు ఏమిటి!


భారతీయులకు రుద్రాక్ష మాల అంటే ఎంతో భక్తి.  చాలామందికి  రుద్రాక్ష మాల, తులసి మాల మాత్రమే తెలుసు. కానీ కరుంగళి మాల అని ఒకటి ఉంది.  ఆధ్యాత్మికతలో భాగంగా చాలామంది కరుంగళి మాల ధరిస్తుంటారు.  ముఖ్యంగా ఎంతో మంది సెలబ్రిటీలు తమ మెడలో కరుంగళి మాలతో దర్శనమిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో కరుంగళి మాలకు చాలా ప్రాధాన్యత ఉంది. కరుంగళి మాలను నల్ల ఎబోని చెట్టు బెరడుతో తయారు చేస్తారు. ఈ చెట్టు బెరడు నల్లగా ఉండటం వల్ల దీన్ని బ్లాక్  వుడ్ అని కూడా పిలుస్తారు. కొందరు దీన్ని నల్ల చందనం అని కూడా అంటారు.  బ్లాక్ వుడ్ చెట్టుతో తయారు చేసే కరుంగళి మాలను ధరిస్తే శని, కుజ గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుందని, ధ్యానం చేయాలని అనుకునేవారికి చాలా బాగా సహకరిస్తుందని అంటారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాల కోసం కరుంగళి మాలను ధరిస్తారు, దీని  గురించి వివరంగా తెలుసుకుంటే..

కరుంగళి మాల ప్రయోజనాలు..

ఆరోగ్యం..

ఆయుర్వేదంలో బ్లాక్ వుడ్  వాత, పిత్త దోషాలను తొలగిస్తుందని చెబుతారు. మెడలో కరుంగళి మాలను ధరించడం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు, నిద్రలేమి , ఆందోళనతో బాధపడేవారు దీనిని ధరించాలని సలహా ఇస్తారు. దీని శక్తి ఆరాను శుద్ధి చేసి, అలసట , నీరసాన్ని తగ్గిస్తుంది.

మంగళ దోషం..

మంగళ దోషం ఉన్నవారు తరచుగా కోపం, కలహాలు , ప్రమాదాలు జరుగుతాయేమో అనే భయం వంటివి అనుభవిస్తూ ఉంటారు. కరుంగలి స్వభావరీత్యా చల్లదనాన్ని ఇస్తుంది, ఇది కుజుడి ఉగ్రతను శాంతపరిచి, ఓర్పును , సమతుల్యతను అందిస్తుంది. హనుమంతుడు , భైరవ ఆరాధన చేసే భక్తులు ఈ జపమాలతో జపం చేయడం శుభప్రదంగా భావిస్తారు, ఎందుకంటే ఈ ఇద్దరు దేవతలకు కుజుడితో సంబంధం ఉంటుంది.

ఆధ్యాత్మిక పురోగతి..

కరుంగళి చెట్టును 'తపస్వి చెట్టు' అని కూడా అంటారట. ప్రాచీన కాలంలో, ఋషులు , సాధువులు దీని పూసలను ఉపయోగించి జపించేవారట. ఇది మూలాధార చక్రాన్ని ఉత్తేజపరిచి, కుండలినిని మేల్కొలపడానికి సహాయపడుతుందని నమ్ముతారు. శనిని కర్మ దేవుడిగా భావిస్తారు, కాబట్టి ఈ జపమాల  వ్యక్తిని క్రమశిక్షణ గలవాడిగా , శ్రద్ధగలవాడిగా కూడా చేస్తుంది.

శనిదోషం..

జ్యోతిష్య శాస్త్రంలో, కరుంగళి  చెక్కను శని గ్రహంతో అనుబంధిస్తారు. ఏలినాటి శని,  శని దోషాలు,  శని మహాదశను అనుభవిస్తున్న వారికి ఈ జపమాల ఒక కవచంలా పనిచేస్తుందని చెబుతారు. దీని నల్లని రంగు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఈ జపమాలను ప్రతిరోజూ ధరించడం లేదా  జపించడం వల్ల దిష్టి, చేతబడి , మానసిక ఒత్తిడి ప్రభావాలు తగ్గుతాయి. అనేక తాంత్రిక సాధనలలో కూడా రక్షణ కోసం కరుంగళి జపమాలను ఉపయోగిస్తారు.

దృష్టి, ఏకాగ్రత..

కరుంగళి చెక్క సహజంగా చాలా దట్టంగా , బరువుగా ఉంటుంది. దీనితో మంత్రాలు జపిస్తున్నప్పుడు, మనస్సు అదుపులో ఉంటుంది. మాల  బరువు , స్పర్శ మనస్సును వర్తమానంపై కేంద్రీకృతం చేస్తాయి. అందువల్ల, విపస్సన , మంత్ర ధ్యానం చేసేవారు దీనిని ఇష్టపడతారు. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి , నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడతాయి.

ఎలా ధరించాలి?

శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత, పచ్చి పాలు , గంగాజలంతో జపమాల శుద్ధచేయాలి. 'ఓం శం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని ఒకసారి జపించి, దానిని ధరించాలి. ఈ జపమాల  ధరించినప్పుడు మాంసం , మద్యపానానికి దూరంగా ఉండాలి.

                           *రూపశ్రీ.