98శాతం ముస్లిం జనాభా ఉన్న దేశంలో దుర్గాదేవి ఆలయం.. 300ఏళ్లుగా వెలుగుతున్న జ్వాల!

 

98శాతం ముస్లిం జనాభా ఉన్న దేశంలో దుర్గాదేవి ఆలయం.. 300ఏళ్లుగా వెలుగుతున్న జ్వాల!

భారతదేశాన్ని దైవ భూమి అని  పిలుస్తారు.  ఇక్కడ దేవాలయాలు,  సంప్రదాయాలు, పూజలు.. అన్నీ ఆ భగవంతుడు మనిషి చుట్టూనే ఉన్నాడనే భ్రమను కలిగిస్తాయి.  అయితే భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎందరో దేవతలు వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నారు. హిందూ మతం అన్నా, సనాతన ధర్మం అన్నా మండిపడే ముస్లిం దేశాలలో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అజర్బైజాన్ లో ఉన్న దేవాలయం అలాంటిదే.. 98శాతం ముస్లిం జనాభా ఉండే అజర్బైజాన్ దేవాలయంలో 300 సవంత్సరాలుగా ఒక జ్వాల వెలుగుతూనే ఉంది.  ఎంతో ఆశ్చర్యానికి గురిచేసే ఈ దేవాలయం గురించి తెలుసుకుంటే..

అజర్‌బైజాన్‌లోని ఒక దేవాలయం అక్కడ వెలిగే  జ్వాల కారణంగా , విశిష్టమైన చరిత్ర కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దుర్గాదేవితో దానికున్న అనుబంధం , అగ్ని ఆరాధన కారణంగా దీనిని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ముస్లింలు అధిక సంఖ్యలో అంటే సుమారు 98శాతం  ఉన్న దేశం అయినప్పటికీ, ఈ పురాతన పుణ్యక్షేత్రం సందర్శకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. దీనిని అగ్ని దేవాలయం అని పిలుస్తారు, దీని అసలు పేరు బాకులోని అతిష్‌గా. ఇక్కడ సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతున్న జ్వాల  ప్రధాన ఆకర్షణగా ఉంది.

ఎక్కడుందంటే..

ఈ దేవాలయం అజర్‌బైజాన్ రాజధాని అయిన బాకు సమీపంలోని సురఖాని ప్రాంతంలో ఉంది. ఇది సుమారు 300 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. చరిత్రకారుల ప్రకారం, ప్రాచీన కాలంలో భారతదేశం నుండి వర్తకులు , ఋషులు ఈ దేవాలయాన్ని సందర్శించారని అంటున్నారు. ఈ దేవాలయ నిర్మాణంలో వారు ప్రధాన పాత్ర పోషించారు. దేవాలయ గోడలపై సంస్కృతం , ఇతర భారతీయ భాషలలో వ్రాసిన శాసనాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయట, ఇది భారతీయ సంస్కృతి  లోతైన ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దేవాలయం  వాస్తుశిల్పం హిందూ దేవాలయాలను కూడా పోలి ఉంటుందట.

ఎప్పుడూ వెలిగే జ్వాల..

ఈ ఆలయంలో ఉండే చాలా  విశేషమైన లక్షణం ఎప్పుడూ వెలుగుతూ ఉండే జ్వాల. గతంలో, భూగర్భంలో ఉన్న సహజ వాయువు కారణంగా అగ్ని సహజంగానే మండుతూ ఉండేది. అందుకే దీనికి 'అగ్ని దేవాలయం' అని పేరు వచ్చిందట. ఈ అగ్ని 1969 వరకు సహజంగానే మండుతూ ఉండేదని చెబుతారు. ఆ తర్వాత, గ్యాస్ పీడనం తగ్గడం ప్రారంభమైంది. అప్పటి నుండి, ఒక గ్యాస్ పైప్‌లైన్ సహాయంతో జ్వాలను నిరంతరం మండుతూ ఉండేలా చేస్తున్నారు. ఈ రహస్యమే ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతుందట.

ఈ ఆలయం ఇప్పుడు ఎలా ఉందంటే..

అతిష్‌గా ఆలయం ఇప్పుడు ఒక మ్యూజియంగా , చారిత్రక స్మారక చిహ్నంగా భద్రపరచబడిందట. ఇక్కడ ఇప్పుడు రోజూ పూజలు జరగవట, కానీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. ఆలయ సముదాయంలోని 26 గదులు వివిధ మత సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయట. ఇక్కడి శాసనాలలో గణేశుడు , అగ్నిదేవుని ప్రస్తావన కూడా ఉందట. ఈ కారణంగానే ఈ ప్రదేశం హిందూ , జొరాస్ట్రియన్ సంప్రదాయాల సమ్మేళనానికి ప్రతీకగా పరిగణించబడుతుందని చెబుతున్నారు.

పర్యాటకులు..

ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చే పర్యాటకులు దీనిపై చాలా ఆసక్తిని కనబరుస్తారట. ఎప్పుడూ వెలుగుతూ ఉండే జ్వాల ఈ ఆలయాన్ని చూసేందుకు పర్యాటకులను ఆకర్షిస్తోందని చెబుతున్నారు.

                                   *రూపశ్రీ.