వంటచేసి నన్ను లేపి, భోజనానికి రమ్మన్నందుకు థ్యాంక్స్. ఆ తరువాతేం జరిగింది? నా బెడ్ మీద మరెవరూ పడుకోవడం నాకిష్టముండదని నీకు తెలుసు. నీవరకు నాకిష్టమే. మిగతా ఇద్దరమ్మాయిల్ని కూడా నా బెడ్ మీదకు చేర్చావు. అది మర్యాదేనా?

 

    హాల్లోకొస్తే ఒకరు సోఫాని, ఇద్దరు ఫ్లోర్ ని ఆక్రమించుకున్నారు. నేనెక్కడ పడుకోవాలి? ఇది ఆలోచించావా?

 

    పొరపాటన్నది అరబ్బీ-ఒంటె-డేరా పద్ధతిలో వుండకూడదు కదా!

 

    రాత్రంతా... అదిగో ఆ చిన్న చెయిర్ లో దిగబడిపోయాను.

 

    అయినా... వస్తే నువ్వు రావాలి. వీళ్ళంతా ఎవరు? వాళ్ళని వేరేచోట దింపి రావొచ్చుగా..." ఎంత దాచుకుందామన్నా అతని కంఠంలో మితిమీరిన అసహనం తొంగిచూసింది.

 

    శ్రీధర్ మాటలకు కొద్ది క్షణాలవరకు అపర్ణ ఏం మాట్లాడలేదు.

 

    "సారీ శ్రీ... మేం వస్తే నువ్వు సంతోషిస్తావని ఆశించాను" అంది అపర్ణ నెమ్మదిగా.

 

    "నువ్వు-నువ్వుగా-నీవే అయి- ఇదివరకటి అపర్ణే అయివస్తే, చాలా సంతోషించేవాడ్ని..." నిర్లిప్తంగా అన్నాడు శ్రీధర్.

 

    "మరిప్పుడెలా వచ్చాను?"

 

    "ఐదుగుర్ని వెంటేసుకుని రావడాన్ని-నువ్వుగానే వచ్చావని అనుకోలేను..."

 

    "సారీ అన్నానుగా...."

 

    "అయినా నువ్వు, నువ్వుగా రాలేదు."

 

    "అదెలా?" ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది అపర్ణ.

 

    "నేను ప్రేమించిన అపర్ణకు పిరుదులు దాటే అందమయిన జుత్తుండేది. ముక్కుకి తళుక్కున మెరిసే ముక్కెర వుండేది. ఎప్పుడు నన్ను కలవాలనుకున్నా ఒంటరిగానే వచ్చేది. మరిప్పుడు...?"

 

    "ఓహో...అదా...అడవిలా పెరిగే జుత్తును దువ్వుకోలేక, రోజూ జడేసుకోలేక, కట్ చేసుకున్నాను. ముక్కు పుడకెందుకో నాకు బాగాలేదని, నా అమెరికన్ ఫ్రెండ్స్ అంటే, కాస్మటిక్ సర్జరీతో ఆ హోల్ ని మూయించుకున్నాను. సరైన హోటల్ దొరకక, వార్ని పట్టుకొచ్చాను. ఇవి కూడా తప్పులేనా?" విస్మయంగా చూస్తూ అడిగింది అపర్ణ.

 

    రాత్రంతా మంచులో తడిసిన మల్లెపువ్వులా వున్న అపర్ణని చూస్తూ మరేం అనలేకపోయాడు శ్రీధర్.

 

    "తరువాత మాట్లాడుకుందాం. క్రింద రెస్టారెంట్ వుంది. వెళ్ళి టిఫెన్ చేద్దాం. బెడ్ రూమ్ లో వున్న నీ ఫ్రెండ్స్ ని పిలువు" అని చెప్పి బట్టలు వేసుకునే పనిలో నిమగ్నమయిపోయాడు శ్రీధర్.


                                                    *    *    *    *  


    మరో పది నిమిషాల్లో శ్రీధర్, అపర్ణ బృందంలోని ఐదుగురు గ్రౌండ్ ఫ్లోర్లో వున్న రెస్టారెంట్ కి చేరుకున్నారు.

 

    శ్రీధర్ కొంతమందితో అదే రెస్టారెంట్ కి రావడాన్ని దూరంనించే చూసిన ఒక వ్యక్తి ఆ మరుక్షణమే షాక్ కి లోనుగావడం జరిగింది.

 

    అతని దృష్టిలో పడకుండా అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా దారులు వెతుకుతున్న ఆ వ్యక్తికి వేరే దారి కనిపించక అమితమైన భావోద్వేగానికి లోనయిపోయింది. అది ఒకింత భయంగా కూడా మారింది.

 

    ఆవిడే... అపరిచితురాలు పూజ.

 

    ఆమెకి ఎదురుగా ఆమె ఫ్రెండొకరు వున్నారు. ఇద్దరూ ఇడ్లీకి ఆర్డరిచ్చి వున్నారు అప్పటికే. అపరిచితురాలికి ఎదురుగా కూర్చున్న ఆమె పేరు నిర్మల. సడన్ గా పూజ కళ్ళల్లో కనిపించిన ఆందోళనని ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు నిర్మలకు.

 

    అపరిచితురాలైన పూజ ఇంకా బెరుగ్గానే శ్రీధర్ బృందం వైపు చూస్తోంది.

 

    "ఏయ్... ఏమైంది నీకు? నీ కళ్ళేమిటలా చలిస్తున్నాయి? ఎనీథింగ్ రాంగ్ ఫిజికల్లీ...?!" నిర్మల అడిగింది రవ్వంత కంగారుకు లోనవుతూ.

 

    "ఏం...ఏం...లేదు..." అంది ఆమె తడబాటును కప్పిపుచ్చుకుంటూ.

 

    అంతలో రెండు ప్లేట్లు ఇడ్లీ తెచ్చి వాళ్ళ ముందు పెట్టి వెళ్ళాడు సర్వరు.

 

    అంత త్వరగా శ్రీధర్ కి అతి సమీపంగా రావల్సి వస్తుందని వూహించలేదు ఆమె.

 

    కొద్ది క్షణాలు తనలో రేగిన ఉద్రిక్తతని తగ్గించుకొనేందుకు కళ్ళు మూసుకుంది.

 

    నిర్మల స్పూన్ తో ఓ ఇడ్లీని ముక్కలుగా చేసి సాంబారున్న స్టీల్ గిన్నెలో వేస్తూ ఆశ్చర్యంగా చూస్తోంది పూజకేసి.

 

    ఒకే ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆమె చాలా విషయాలు ఆలోచించింది.

 

    తననెప్పుడూ శ్రీధర్ చూడలేదు.

 

    ఫోన్లో తప్ప విడిగా తనతో మాట్లాడలేదు. ప్రత్యక్షంగా తన కంఠాన్ని అతడు వినలేదు.

 

    అలాంటప్పుడు తనెందుకు అనవసరమయిన వుద్వేగానికి లోను కావాలి?

 

    ఆ ఆలోచనల చివర ఆమెకు స్వస్థత లభించినట్లయింది.

 

    "నాన్సీ ప్రైస్ నవల చదివావా నువ్వు?" అడిగింది నిర్మల.

 

    "నీకింకా నవలల పిచ్చి వదిలినట్టు లేదే?" నవ్వుతూ అంది పూజ.

 

    "నవలల్లో మంచి నవలలు- పిచ్చి నవలలుంటాయేమోగాని, నవలలు చదవటం మాత్రం పిచ్చికాదు. నీకు తెలుసా? చదివే అలవాటు లేని వాళ్ళ బుద్ధి అంతగా వికసించదు.

 

    జోసెఫ్ రుబెన్ డైరెక్షన్ లో నిర్మించిన స్లీపింగ్ విత్ ది ఎనిమీ పిక్చర్ లో నటించిన జూలియా రాబర్ట్స్ లుక్స్ నీ లుక్స్ ఒకేలా వుంటాయి. సస్పీషియస్ లుక్స్... అవతలి వారి అంతరంగాన్ని శోధించే చూపులు...

 

    ఇక్కడి కెవరన్నా నీకు బాగా నచ్చనివాళ్ళు గాని, బాగా నచ్చిన వాళ్ళుగాని వచ్చారా?" చిరునవ్వుతూ అడిగింది నిర్మల.

 

    ఆమెలోని పరిశీలనా శక్తికి ఒక్కక్షణం విస్మయానికి లోనయింది పూజ.

 

    "టిఫిన్ చేద్దామా?" అంది పూజ సడన్ గా.

 

    విషయం అర్థమయిన నిర్మల టిఫిన్ చేయటంలో నిమగ్నమయి పోయింది.

 

    పూజ టిఫిన్ చేస్తూనే మధ్యమధ్యలో నిర్మల పసిగట్టని రీతిలో నెల వంకల్లాంటి తన అందమైన కనురెప్పల్ని అలవోకగా తిప్పి టిఫిన్ కోసం ఆర్డరిస్తున్న శ్రీధర్నే చూస్తోంది.