ఆ గెటప్ లోకి తనను దింపకుండా ఈ ప్రేమను సక్సెస్ చెయ్ స్వామీ అని మొక్కుతున్నాడు.

 

    ఇందిరానగర్ కాలనీ, దాటి రోడ్డెక్కి శ్మశానంవైపు సాగిపోతున్నాడతను.

 

    చీకటి నల్లగా బిరుసెక్కుతోంది. చల్లగాలులు వంటిని పీక్కు తింటున్నాయి. శ్మశానంలోంచి కవురు వాసన ఆ ప్రాంతానంతా కమ్ముకుని శ్మశానం ఉనికిని తెలియజేస్తోంది. ఆకాశంలో అక్కడక్కడా నక్షత్రాలు తగరం కాగితపు ముక్కల్లా వున్నాయి.

 

    అతను ముందుకు నడుస్తున్న కొద్దీ ఇందిరానగర్ వెనక్కి జరుగుతోంది.

 

    ఈపాటికి జగ్గారావు తన అనుచరులతో శ్మశానం దగ్గరికి వచ్చేసి ఉంటాడని అనుకుంటూ జోరుగా అడుగులేస్తున్నాడు.

 

    అతను శ్మశానానికి మరీ దగ్గరయ్యాడు. రోడ్డుపక్కనున్న చెట్టుకింద నిలబడి వున్న జగ్గారావు అతన్ని చూడగానే గాల్లో చేయి వూపాడు.

 

    నరేష్ వాళ్ళను సమీపించాడు. జగ్గారావు కాకుండా మరో ముగ్గురున్నారు. వాళ్ళు కూడా కండలు తిరిగిన శరీరాలతో చందమామ పుస్తకాల్లోని రాక్షసుల్లా వున్నారు.

 

    "మరీ ఇంతలా వున్న వాళ్ళని తెచ్చావ్! ఆ అమ్మాయి నేను వీళ్ళనంతా చావగొట్టానంటే నమ్ముతుందా?" నరేష్ అడిగాడు.

 

    "అది నిజమే గురువా! అయితే మరీ బక్కగా వున్నవాళ్ళను తెస్తే ఇదేదో వీధినాటకమని ఆమె అనుకొనే ప్రమాదం కూడా వుందనిపించింది. దాంతో వీళ్ళను తీసుకొచ్చాను. వీళ్ళను కొట్టేటప్పుడు మరీ కష్టపడుతున్నట్టు ఫీలింగ్సు పెట్టు. నమ్మేస్తుంది" చెప్పాడు జగ్గారావు రెండు చేతులనూ పైకి లేపి ఒళ్ళు విరుచుకుంటూ.  

 

    "సరే సరే!"

 

    "మరి నువ్వెళ్ళి ఆ పొదలచాటున దాక్కో గురువా. మేం ఆమెను కిందికి లాగుతున్నప్పుడు వచ్చేయ్! కొట్టేప్పుడు కాస్తంత జాగ్రత్తగా కొట్టు. మరీ ఈడ్చికొట్టావంటే మరో అయిదు వందలు ఏక్స్ట్రాగా వసూలు చేయాల్సి వుంటుంది" జగ్గారావు హెచ్చరించాడు.

 

    "అదేం లేదులే చిన్నగానే కొడతాలే ఇప్పటికే వెయ్యి రూపాయలిచ్చాను. వచ్చిన జీతమంతా మీకే సమర్పించాను. ఇక అయిదు వందలు కాదుగదా అయిదు పైసలు కూడా నా దగ్గిర లేవు" చెప్పాడతను.

 

    "అవునూ, ఇప్పుడు నాకో డౌట్ వస్తోంది. చీకటైపోయింది కదా. ఆమె కారుని ఎలా గుర్తుపట్టడం?" అడిగాడు జగ్గారావు.

 

    "చాలా సులభం! రెండు హెడ్ లైట్స్ తోపాటు, చిన్నవి ఎల్లో లైట్స్ కూడా ఉంటాయి. నాలుగులైట్లు వుంటే చాలు ఆపెయ్! ఆగాక అందులో వున్నది రజనీ అయితే నాటకం ప్రారంభించు. రజనీని నీకు చూపించాను కదా, గుర్తుందా?"

 

    "ఆఁ..."

 

    "టైమ్ అయ్యింది. పొరబాటు లేకుండా చూడు. నేను వచ్చి మిమ్మల్ని నాలుగు తగిలించగానే మీరెళ్ళిపోవాలి."

 

    "అలానే గురువా!"

 

    నరేష్ ఇరవై అడుగులు నడిచి, రోడ్డు దిగువున ఉన్న ఓ పొద వెనుక మాటు వేశాడు.

 

    కళ్ళు చీకటికి అలవాటు పడడంతో వాళ్ళ నలుగురూ స్పష్టంగా కనిపిస్తున్నారు అతనికి.

 

    మరో అయిదు నిమిషాల వరకూ అలా బిగదీసుకు కూర్చుండిపోయాడు.

 

    రోడ్డంట కళ్ళార్పకుండా చూస్తున్న అతనికి దూరంగా లైట్లు కనిపించాయి. అది ఖచ్చితంగా రజనీ కారేనని అనుకున్నాడు.

 

    ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు.

 

    ఇప్పుడు రెండు లైట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కారు కాదేమోనన్న అనుమానం వచ్చింది.

 

    కళ్ళను మరింత విప్పదేశాడు.

 

    ఇప్పుడు హెడ్ లైట్ల మధ్యలో మరో రెండు పసుపు లైట్లు కనిపిస్తున్నాయి.

 

    నరేష్ కి చిన్నగా వణుకు ప్రారంభమయింది. అంత చలిలోనూ చెమట్లు పడుతున్నాయి. కర్చీఫ్ కోసం వెదుక్కోసాగాడు. ఏ జేబులోనూ కర్చీఫ్ లేకపోయేసరికి చిరాగ్గా అనిపించింది.

 

    కారు మరింత దగ్గరయింది.

 

    పొదలమాటున వున్న నరేష్ మెల్లగా కదిలి, మళ్ళీ సర్దుకున్నాడు.

 

    అంతలో ఆ ప్రాంతమంతా కుదిపేస్తున్నట్టు జగ్గారావు విజిల్ వేశాడు 'ప్రొసీడ్' అన్నట్లు, నరేష్ కూడా విజిల్ వేశాడు.

 

    'ఆపరేషన్ స్టార్టెడ్' అనుకున్నాడు. టెన్షన్ మరింత ఎక్కువయింది.

 

    జగ్గారావు సైగ చేయడంతో మిగతా ముగ్గురూ తమ పక్కనున్న రాళ్ళను రోడ్డుమీదకి దొర్లించారు. రోడ్డు దిగితే తప్ప కారు వెళ్ళదు. రోడ్డు కటువైపు ఇద్దరు, ఇటువైపు ఇద్దరూ నిలబడి వున్నారు.  

 

    చీకట్లో తార్రోడ్డుపై దొర్లుకుంటూ వస్తున్న గచ్చకాయ రాయికి తగులుకుని నిలబడిపోయినట్టు ఒక్క కుదుపుతో ఆగింది కారు.

 

    డ్రయివింగ్ సీట్లో వున్న రజని కంగారుగా అటూ, ఇటూ చూసింది కారు దగ్గరకే వస్తున్న ఆ నలుగుర్నీ చూసి ఆమె కెవ్వుమని అరిచింది.

 

    ముందు నిర్ణయం మేరకు మరో అయిదు నిమిషాలకి అక్కడికి వెళ్ళాల్సిన నరేష్ అనుకున్నదానికంటే ముందుగానే పైకి లేచాడు.

 

    రజని నిస్సహాయంగా వేసిన కేక విని ఆ క్షణంలో అది తన దర్శకత్వంలో ఆడుతున్న నాటకమని మరిచిపోయాడు. ఆమె ప్రమాదంలో ఉందని, తను వెళ్ళి వాళ్ళతో వీరోచితంగా పోరాడాలని మాత్రమే అనుకుంటున్న అతను ముందుకి కదిలాడు.

 

    అప్పటికే జగ్గారావు ఉత్తిత్తిగానే రజనీని నగలివ్వమని బెదిరిస్తున్నాడు. ఒకడు చాకు చూపిస్తూ ఉండడంతో ఆమె పూర్తిగా భయపడిపోయింది. కేకలు వేద్దామని ఉన్నా నోరు తడి ఆరిపోయి పిడచకట్టుకు పోయింది.

 

    ఆమె మెల్లగా నెక్లెస్ విప్పుతోంది.

 

    జగ్గారావు, అతని అనుచరులూ నరేష్ వస్తూ ఉండటాన్ని గమనించారు. అతన్ని ఎదుర్కోవడానికి అందరూ తలతిప్పి అతనివైపు చూశారు.

 

    వాళ్ళు తను కురుర్చుకొన్న కిరాయి గూండాలన్న విషయాన్ని మరిచిపోయిన అతను సీరియస్ గా కారువైపుకి నడిచాడు.

 

    రజని అతన్ని గుర్తించింది. అలజడితో, భయంతో వణికిపోతున్న ఆమెకి కొంత ధైర్యం చిక్కింది. అయినా వణుకు తగ్గలేదు. దీనంగా, నలుగురు రౌడీల మధ్య నిలబడిపోయిన రజనీని అలా చూస్తుంటే అతనికి కోపం ఆగలేదు. కుడిచేతి పిడికిలితో జగ్గారావు ముఖంమీద శక్తిమేరకు గుద్దాడు.