ఒక ఇంటివాడవుతున్న విక్రమ్ కుమార్..!
on Jun 6, 2016
తెలుగులో ఇష్క్, మనం సినిమాలు తీశాడు విక్రమ్ కె కుమార్. లేటెస్ట్ గా సూర్య 24 సినిమాతో, తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడుగా మారిపోయాడు. ఇన్నాళ్లూ సింగిల్ గా ఉన్న ఈ డైరెక్టర్ ఎట్టకేలకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. శ్రీనిథి అనే అమ్మాయితో విక్రమ్ కు నిన్న ఎంగేజ్ మెంట్ జరిగింది. ఎఆర్ రెహమాన్ దగ్గర సౌండ్ ఇంజనీర్ గా చేస్తున్న శ్రీనిధితో విక్రమ్ కు 24 సినిమా మొదలైన సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
పెద్దల అంగీకారమైన తర్వాత, నిన్న చాలా సింపుల్ గా సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండబోతోందట. విక్రమ్ మొదటి సినిమా టాలీవుడ్ లోనే చేశాడు. ఇష్టం అన్న పేరుతో చేసిన ఆ సినిమా అతనికి పెద్ద బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత మాధవన్ తో తీసిన 13బి అనే సినిమా విక్రమ్ కు సరైన బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరసగా మంచి సినిమాలు తీస్తూ పెద్ద డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు విక్రమ్. త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న విక్రమ్ కు ఇండస్ట్రీలోని సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు.