టైటిల్ డైలమాలో ప్రభాస్?
on Mar 4, 2020
ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ జోడీగా తొలిసారి పూజా హెగ్డే నటిస్తోన్న ఈ మూవీ సెట్స్‌పై ఉంది. లవ్ స్టోరీగా తయారవుతోన్న ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టాలా అని మేకర్స్ మల్లగుల్లాలు పడుతున్నారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషలకూ పనికి వస్తుందనే ఉద్దేశంతో మొదట 'జాన్' అనే టైటిల్ అనుకున్నారు. కానీ దిల్ రాజు తన సినిమా కథకు 'జాను' అనేది యాప్ట్‌గా ఉంటుందని, ఆ టైటిల్ పెట్టుకుంటానని అడిగేసరికి ప్రభాస్ బృందం సరేనంది. అందువల్ల దానికి దగ్గరగా ఉన్న 'జాన్' టైటిల్‌ను పక్కన పెట్టేసింది. అది గతం.
ఇప్పుడు రెండు టైటిల్స్ మధ్య చిక్కుకొని, ఏది పెట్టాలా అని ప్రభాస్, రాధాకృష్ణ డైలమాలో పడ్డారు. ఆ రెండు టైటిల్స్.. 'ఓ డియర్', 'రాధే శ్యామ్'. సినిమాలో ప్రభాస్ పేరు శ్యామ్ కాగా, పూజా పేరు రాధ అనీ, అందుకే 'రాధే శ్యామ్' టైటిల్‌ను నిర్మాతలు రిజిస్టర్ చేయించారనీ వినిపిస్తోంది. అయితే కథానుసారం 'ఓ డియర్' అనేది కూడా బాగా సూటవుతుందని డైరెక్టర్ భావిస్తున్నాడు. మొత్తానికి ఈ రెండు టైటిల్స్‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడం, మలయాళం భాషల్లో రిజిస్టర్ చేయించారు నిర్మాతలు.
హిందీలో ఇప్పటికే ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ చేస్తోన్న సినిమాకు 'రాధే' అనే టైటిల్ పెట్టారు. ఈ వేసవిలోనే ఆ సినిమా విడుదలవుతోంది. అందువల్ల 'రాధే శ్యామ్' కంటే 'ఓ డియర్' అయితే బాగుంటుందనీ, ఆ టైటిల్లో పాన్ ఇండియా సౌండ్ వినిపిస్తోందనీ డైరెక్టర్ నమ్ముతున్నాడు. ఈ నేపథ్యంలో ఏ టైటిల్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అతి త్వరలోనే నిర్మాతలు టైటిల్ ప్రకటించనున్నారు.