వెబ్ సిరీస్ లో కాజల్?
on Aug 3, 2019
రోజు రోజుకూ వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగుతోంది. దాంతో టాప్ స్టార్స్ కూడా వాటిలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మాధవన్ వంటి స్టార్స్ ఆల్రెడీ వెబ్ సిరీస్ ల్లో నటించారు. అక్షయ్ కుమార్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. దక్షిణాదిలో, ముఖ్యంగా టాప్ స్టార్స్ ఎవరూ వీటిపై ఆసక్తి చూపలేదు. 'గ్యాంగ్ స్టార్స్'లో జగపతిబాబు, నవదీప్, పోసాని తదితరులు, 'హై ప్రీస్టెస్'లో అమల అక్కినేని, 'మిస్సెస్ సుబ్బలక్ష్మి'లో లక్ష్మీ మంచు చేశారు. మరికొందరు వెబ్ సిరీస్ లు చేశారు కానీ కాస్తో కూస్తో పేరున్న నటీనటులు వీరే. అయితే ఇప్పుడు టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్ చేయబోతున్నారని తమిళ సినిమా ఇండస్ట్రీ టాక్. తమిళ డబ్బింగ్ సినిమాలు 'సరోజ', అజిత్ 'గ్యాంబ్లర్', సూర్య 'రాక్షసుడు', కార్తీ 'బిరియాని'తో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన దర్శకుడు వెంకట్ ప్రభు ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. అందులో నటించడానికి కాజల్ అగర్వాల్ అంగీకరించారట. రెగ్యులర్ గా వెంకట్ ప్రభు సినిమాల్లో కనిపించే వైభవ్ ఇందులో హీరో అట. ఈయన దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడే.