Facebook Twitter
సహనం ప్రధానం

 

సహనం ప్రధానం

 



ఆయన ఒక సాధువు. రోజూ ఆయన వద్దకు ఎక్కడెక్కడినుంచో జనం వచ్చి వేల్తున్దేవారు. ఎవరికి వారు తమ సమస్యలు చెప్పుకుని వాటికి పరిష్కారం అడిగేవారు. మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పేవారు. వారు చెప్పేదంతా విని ఆ సాధువు చిన్న నవ్వు నవ్వి ""నేనేమైనా మంత్రాలు మాయలు తెలిసిన వాడినా మీ సమస్యలను పరిష్కరించడానికి?" అన్నట్టుగా వారి వంక చూసేవారు. ఒకరోజు ఓ ప్రభుత్వ అధికారి ఆయన వద్దకు వచ్చి నమస్కరించి తమ కార్యాలయంలో ఉన్న సమస్యలు ఏకరవు పెట్టాడు. ఒకటా రెండా స్వామీ ఎన్నని చెప్పను? లోలోపల రాజకీయాలు, అసూయలు, ద్వేషాలు, కుతంత్రాలు, కుమ్ములాటలు ఇలా రోజూ అనేకానేక సమస్యలతో నలిగిపోతున్నాను. మీరే నాకు వీటన్నింటి నుంచి విడివడే ఓ దారి చూపాలి స్వామీ" అని మొరపెట్టుకున్నాడు.

అప్పుడు ఆయన ఎప్పటిలాగే తన సహజ ధోరణిలో ఓ నవ్వు నవ్వి "నా దగ్గర ఒక గాడిద ఉంది" అన్నారు.

"ఏమిటీ.....మీ వద్ద గాడిద ఉందా?" అధికారి ప్రశ్న.

"అవును....రోజూ నేను ఆ గాడిద వీపు మీద బోలెడంత బరువు పెట్టి సంతకు పంపుతాను" నారు సాధువు.

"అవును స్వామీ....గాడిదకూ, నా సమస్యలకూ సంబంధం ఏమిటి?" అని మళ్ళీ ప్రశ్నించాడు అధికారి.

"ఆగు..కాస్తంత నన్ను చెప్పనివ్వు....నే చెప్పేది విను. ఇక్కడున్న ఆశ్రమానికి చుట్టుపక్కలంతా మట్టి రోడ్లే. ఎప్పుడైనా వర్షం వచ్చిందంటే చాలు ఈ దారులన్నీబురద మయమే. అప్పుడు దాని పాట్లే పాట్లు. అప్పుడు కొంచం దూరం వెళ్ళిన గాడిద మధ్యలో ఆగిపోయి నన్ను చూసి చస్తున్నా ఈ బురదలో నడవలేక...." అన్నట్టుగా చూస్తుంది.

"అవును నిజమే కదండీ....దాని బాధ దానిది...."

"ఆరంభంలో నా గాడిద గోల గోల చేసేది. ఒకటే గొణుగుడు. వీపు మీదేమో మోయలేనంత బరువు ...నడిచే దారేమో బురదమయం...చాలా కష్టంగా ఉంది...కాళ్ళన్నీ బురదై అడుగు ముందుకు పడటం లేదని మొత్తుకునేది. అంతేకాదు నా అందమంతా దెబ్బతింటోంది అని బాధ పడేది. కానీ ఇలా ఎంత అరిచి గీపెట్టినా లేదా మొరాయించినా బురదేమీ అప్పటికప్పుడు ఎండిపోదుగా...నా పని నాదే కదా....పరిస్థితి మారిపోదుగా...అని మెల్లగా నడిచి వెళ్లి సంతలో బరువు దించుకుని వెనుతిరిగేది....అదిగో ఇప్పుడు కూడా అలా సంతకు వెళ్లి వచ్చే ఆ చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటోంది చూడు ఆ గాడిద....బహుసా నీకు  ఈ పాటికే నేనెందుకు గాడిద విషయం చెప్పానో అర్ధమై ఉండాలి " అన్నారు సాధువు.

మన మనసు ఆ గాడిద లాగానే. జ్ఞానం కోసం వెతకడంలో అప్రమత్తంగా ఉంటే ఏ బురదా మన ప్రయాణానికి అడ్డుగోడ కాబోదు.

- యామిజాల జగదీశ్