Facebook Twitter
అనిత పార్ట్ - 6


 

 

 

అనిత పార్ట్ - 5


    అనిత సాదించవలసిన పనులు చాలా వున్నాయి. అందులో యేది ముందో యేది వెనుకో ఆలోచించుకుంటొంది.

    ముందుగా జానకిని కలుసుకుంది.

    జానకి ఆప్యాయంగా అనితను కౌగలించుకుని" బాగున్నావా? రాణి కూడా వచ్చిందా?" అంది.

    "ఆ! నాతోకూడా తీసుకువచ్చాను."

    "ఎవ్వరూ ఏమీ అనలేదూ?"

    "అనకుండా ఎందుకుంటారు?

    "ఎలా తట్టుకున్నావ్ మరి! అనలా ఇంట్లోకి ఎలా అడుగు పెట్టగాలిగావ్? రాజారావు అన్నయ్య........"

    "మీ రాజారావు అన్నయ్య నన్ను సకల మర్యాదలతో ఆహ్వానించాడు. ఆయన తన బంధువులను ఆదరించి తీరుతాడట!"

    తనలో తను చిలిపిగా నవ్వుకుంది అనిత.

    "నమ్మలేక పోతున్నాను రాణి సంగతి తెలిశాక నిన్ను యింట్లో ఉండనిచ్చాడా అన్నయ్య"

    "నన్ను ఒకరు ఉండనిచ్చేదేమిటి? ఆ ఇంటి కోడల్ని!"

    గర్వగా అంది అనిత.

    "నీ మాట యథార్ధం కావాలి అనితా! అప్పుడు నా కంటే ఎవరూ ఎక్కువ సంతోషించరు."

    ముఖం సంతోషంతో వెలిగి పోతుండగా అంది జానకి.

    "నాసంగతి వదిలెయ్యి. నీ  సంగతి ఆలోచించు, అందుకే వచ్చాను. నేనొక ప్రణాళిక ఆలోచించాను."

    జానకి ముఖంలో వికాశం ఎగిరిపోయింది.

    "మనిద్దరం క్లాస్ మేట్స్ కావటం నా అదృష్టం. అనితా! నీకు నా మీద గల ప్రేమకు ఎంతో పొంగిపోతున్నాను. కానీ, ఏ ప్రణాళికలూ నా అదృష్టాన్ని మార్చలేవు"

    "అదిగో! ఆ ఏడుపు ముఖమే నా కిష్టంలేదు భగవంతుడు మనకు జీవితాన్నిచ్చింది నవ్వుతూ త్రుళ్ళుతూ మార్చ లేవు"

    "అదిగో! ఆ ఏడుపు ముఖమే నా కిష్టంలేదు భగవంతుడు మనకు జీవితాన్నిచ్చింది నవ్వుతూ త్రుళ్ళుతూ గడవటానికి..."

    "అందరికీ ఆ అదృష్టం పట్టదు అనితా!"

    "ప్రయత్నం చెయ్యకుండా నిరాశపడితే ఎలా?"

    "ఏం చెయ్యమంటావ్?"

    "మా ఇంటికి___అదే. మా మేనత్తగారింటికి, రమణరావు ఎప్పుడు వస్తాడో తెలుసుకుని నీకు చెపుతాను. అప్పుడు నువ్వూ సరిగ్గా అక్కడకు రావాలి."

    "రాలేను. అలాచేస్తే సుశీలకి, రాజారావు అన్నయ్యకీ కష్టం కలుగుతుంది."

    "సుశీలకి కష్టం కలగకుండా నేను వివరిస్తాను. రాజారావు బావా కెందుకు కష్టం కలుగుతుందీ?"

    జానకి మాట్లాడకుండా పెదవి వంటితో కొరుక్కుంటూ కన్నీళ్లాపుకుంటూ కూర్చుంది.

    అనిత అసహనంగా "బావకు విషయం తెలుసా?" అంది.

    "తెలిసే ఉంటుంది,"

    "తెలిసే నిన్ను అసహ్యించుకుంటున్నాడా?"

    "సంఘంలో పరువు ప్రతిష్ఠలు ముఖ్యం కాదు మరి? నేను అల్లరి పాలయినదానిని....."

    "అలా మాట్లాడకు. నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు నిరపరాధివని  తెలిసే సంఘంలో ప్రతిష్ఠకోసం చెల్లెలిలా అభిమానించే నిన్ను దూరంగా ఉంచాలనుకుంటున్నాడా రాజారావు? అతని మార్చాలని ప్రయత్నించావా నువ్వు"

    "లేదు. అన్నయ్య మనసు కష్టపెట్టలేను."

    "కష్టపెడుతున్నానేమో ననే భ్రమతో నిన్ను సరిగా అర్థం చేసుకునే అవకాశం బావ కియ్యటంలేదు నువ్వు. కష్ట పెట్టుకుంటే పెట్టుకోనీ! కొన్ని విషయాలు అతనికి తెలిసిరావాలి...."

    జానకి గాభరా పడింది.

    "వద్దు! వద్దు! సుశీల మనసు వింటోన్న తులశమ్మ కలగించుకొంది.

    "ఒకసారి తనను తను రక్షించుకోవాలని ప్రయత్నించి ఇంత ఊబిలోకి దిగింది. ఇంకా ఎందుకమ్మా, ఈ ప్రయత్నాలు? మరే రంగులు పులుముతారో? పోనిలే! అన్యాయాలూ, అపనిందలూ సహించటం మా కలవాటైపోయింది,"

    "సహిస్తున్న కొద్దీ అక్రమాలు ఎక్కువవుతాయి గాని తగ్గవు. ఇంకా ఇరవై కూడా నిండని జానకి జీవితం ఇలా నాశనం కావలిసిందేనా? ఏం జానకీ! నువ్వు నా మాట వింటావా లేదా? నేను వెళ్ళిపోనా?"

    "వింటాను, కానీ నా కారంణగా సుశీలకు, రాజారావు అన్నయ్యకు ఏ ఇబ్బందీ రానీయకూడదు."

    "అలాగే! కానీ బావకు నీస్థితి అర్థమయ్యేలా నువ్వు వివరించి చెప్పు, మరీ అంత మూర్ఖుడు కానే కాడు."

    "మా  అన్నయ్య మూర్ఖుడు కానే కాడు."

    రోషంగా అంది జానకి....

    పకపక నవ్వింది అనిత...

    "ఇంత అభిమానం గుండెల్లో దాచుకుని ప్రయోజనం లేదు. కార్యాచరణలో చూపించు, సుశీలను కాపాడాలని లేదా నీకు?"

    చివరి మాటతో జానకి ఆలోచనలో పడింది. "సరే! నువ్వెలా చెపితే అలా వింటాను."

    అనిత ఉత్సాహంతో తులశమ్మదగ్గిర సెలవు తీసుకుని లేచింది.

    స్కూటర్ మీద ఇంటికి వెళుతున్నాడు రాజారావు.
   
    "బావా!" అని పిలిచింది.

    రాజారావు ఆగిపోయాడు

    "ఎక్కడ్నుంచి వస్తున్నావ్?"

    "జానకి దగ్గిర నుంచి!"

    "జానకి!! నీకు తెలుసా?"

    "తెలుసు. మే మిద్దరం మెడ్రాస్ లో బి. యస్ సి. చదువుకున్నాం...."


    "మీరు మెడ్రాస్ లో స్నేహితులయితే అయ్యారు. ఇక్కడ మాత్రం నువ్వా ఇంటికి రాకపోకలు చెయ్యడానికి వీల్లేదు."

    "ఎందుకు బావా?"

    అమాయకంగా అడిగింది.

    "నీకు తెలిసే ఉండాలి...."

    "నాకు తెలిసినంతవరకూ జానకి దగ్గిర కెళ్లటం ఏ విధంగానూ లజ్జ పడవలసిన కార్యం కాదు,"

    "ఇది మెడ్రాస్ కాదు. ఇక్కడ నీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. నేను నొక్కి చెపుతున్నాను. నా కుంటుంబంలో వ్యక్తులెవరూ నా మాట కాదనడానికి వీల్లేదు,"

    "హమ్మయ్య! అయితే బ్రతికి పోయాను. నేను బంధువుని మాత్రమే! కుటుంబంలోని వ్యక్తిని కాను. భార్య, చెల్లెళ్లు, తమ్ముళ్లు, తల్లి, తండ్రి-వీళ్ళే కుటుంబంలోఅ వ్యక్తులు."

    గుర్రుమన్నాడు రాజారావు.

    "నువ్వు నా యింట్లో ఉంటున్నంతవరకూ  మా మర్యాదకాపాడాలి."

    "తప్పకుండా  కాపాడతాను. ఆ ప్రయంత్నంలోనే రాణిని కూడా తీసుకొచ్చాను."

    రాజారావు ముఖం ఎఱ్ఱగా కందిపోయింది రోషంతో,

    నవ్వు నాపుకోవటానికి ప్రయత్నిస్తూ పైట చెంగు నోటి కడ్డం పెట్టుకుంది అనిత.

    అది చూసిన రాజారావుకు మరింత మండింది.

    "నీ కసలు లజ్జ అంటే ఏమిటో తెలుసా?"

    "తెలియదు, లజ్జపడవలసిన పనులునే నెప్పుడూ చెయ్యలేదు. నీకు తెలుసా? చెప్పవూ?"

    "నువ్వు...నువ్వు..."

    కోపంతో పిడికిలిబిగించి మాట పూర్తీ చేయలేకపోతున్నాడు రాజారావు.

    "నీ మరదల్ని..."

    వమ్రతతో అందించింది అనిత.

    కాల్చేసేలా ఒక్కసారి అనితను చూసి తల విసురుగా తిప్పుకొని స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారావు.

    "అబ్బా!" అని క్రింద కూలబడింది అనిత...

    రాజారావు స్కూటర్ దిగి గాభరాగా "ఏం జరిగింది?" అన్నాడు.

    "క్రింద పడిపోయాను. కాలు నరం పట్టేసింది. అడుగుతీసి అడుగు వెయ్యలేక పోతున్నాను."

    "ఏదీ, చూడనీ..."

    కాలు మీద చెయ్యివెయ్యబోయాడు రాజారావు.

    "అబ్బా!" అని కెవ్వున కేకవేసింది అనిత.

    బాధతో విలవిలలాడుతున్న అనిత ముఖం చూస్తోంటే జాలితో నిండిపోయింది రాజారావు మనసు.

    "జాగ్రత్తగా స్కూటర్ మీద కూర్చోగలవా? ఇంటికెళ్ళి డాక్టర్ని పిలిపిస్తాను"

    "ఎందుకు బావా! నీ కనవసరపు శ్రమ!"

    "ఇందులో శ్రమ ఏముంది? లే!"

    "వద్దులే! నువ్వెళ్ళు___నా పాట్లు నేను పడతాను. లేనలే కుండా ఉన్నాను."

    జాలిగా రాజారావును చూస్తూ అంది అనిత...

    రాజారావు అనితను లేవదీసి స్కూటర్ మీదకూర్చో బెట్టాడు.

    ఓపిక లేనిదానిలా రాజారావుమీద వరిగి కూర్చుంది అనిత.

    స్కూటర్ మీద  యింటికొచ్చిన అనితా రాజారావులను చూసి శారదమ్మ, సుశీల ఆశ్చర్యపోయారు.

    ఆ ఆశ్చర్యాన్ని గమనించిన రాజారావు సిగ్గుపడుతూ, సంజాయిషీ ఇచ్చుకొంటున్నట్లు "అనితకు పెద్ద దెబ్బ తగిలిందమ్మా! నడవలేక పోతోంది అందుకే..."  అని ఏదో చెప్పబోతుండగానే అనిత చెంగున గెంతి "అన్నీ  పట్టిది అత్తయ్యా! కొద్దిగా కాలు జారింది అంతే! నేను వద్దు మోఱ్రో అంటున్నా బావే నన్ను  లేవదీసి స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు. పాపం! నన్ను తన స్కూటర్ మీద తీసుకురావాలని సరదా పడ్డాడు కాబోలు!" అంది.

    రాజారావు విస్తుపోయి చూశాడు.

    "నువ్వు ఎంతకైనా తగినదానివి!" అన్నాడు కసిగా-

    "అయ్యో బావా! పాపం, నీకు నన్ను గురించి ఏమీ తెలియదు కదా!"

    రాజారావు మీద జాలి ప్రకటించింది కొంటె నవ్వుతో అనిత.