Home » ఈపేజీ మీకోసం » గాలివాన కథFacebook Twitter Google
గాలివాన కథ

    గాలివాన కథ
                             

- పాలగుమ్మి పద్మరాజు


    
తెలుగు కథకు అంతర్జాతీయఖ్యాతి కల్పించిన రచయిత పాలగుమ్మి పద్మరాజు. తొలిసారిగా, చివరిసారిగా తెలుగు కథ గొప్పతనాన్ని ప్రపంచ యవనికపై నిలిపిన కథ ఆయన రాసిన 'గాలివాన'. పాలగుమ్మి పద్మరాజు 'పడవప్రయాణం' లాంటి అద్భుతమైన కథలు రాసినా... ఈ కథకు వచ్చిన గుర్తింపే ముఖ్యమైంది. కథలో భిన్న పార్శ్వాలను, వైవిధ్యాన్ని, పాత్రలో వచ్చిన సమున్నతమైన మార్పును పద్మరాజు అప్రతిహతంగా చిత్రించారు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ తెలుగులో పది గొప్పకథలు చెప్పాలంటే దానిలో 'గాలివాన' కథ తప్పక ఉంటుంది.
       కథ మొత్తం ప్రధానపాత్ర రావుగారి ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ప్రయాణంలో అతని అనుభవాలు, వాటి తాలూకు అనుభూతులే ఈ కథ. మబ్బు మసగమసగ్గా అల్లుకుంటుండగా రావుగారు రైలు ఎక్కుతాడు. అప్పటికే రైలులో నలుగురు ప్రయాణికులు ఉంటారు. యువ దంపతులు, వారి చేష్టలు, అపరాధక పరిశోథన నవల చదివే పెద్దమనిషి, మరో ముసలాయన. వాళ్ల గురించి రావుగారే తనదైన అభిప్రాయాలతో, ఊహలతో ఆలోచించుకుంటుంటాడు.
      అసలు రావుగారు వేదాంతి. 'వేదాంతం జీవితంతోటి, జీవన విధానంతోటి వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యలతో అనుబంధించి వుంటుందని ఆయన వాదము'. 'ఆస్తిక సమాజము' అనే సంస్థ ఆహ్వానం మీద 'సామ్యవాదమూ రసామోదము' అనే అంశపై మాట్లాడటానికి వెళ్తూ రైలు ఎక్కుతాడు. రావుగారు పిల్లలను కూడా ఒక విధమైన క్రమశిక్షణలో పెంచాడు. జీవితాన్ని కొన్ని నియమాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకుని, అలానే పాటిస్తుంటాడు.
       గాలివాన బాగా పెరుగుతుంది. ఒక ముష్టి ఆమె తడిసిన బట్టలతో నీళ్లు కారుకుంటూ రైలు పెట్టెలోకి ఎక్కుతుంది. అందరిదగ్గరా బతిమాలుకుంటూ డబ్బులు అడుక్కుంటుంది. అందరూ వారికి తోచింది ఇస్తారు. కానీ రావుగారు మాత్రం ఏమీ ఇవ్వడు. అసలు అడుక్కోవడం తప్పని అతని అభిప్రాయం. అంతలో రావుగారు దిగవలసిన స్టేజీ వస్తుంది. గాలివాన ఉధృతం అవుతుంది. ఆమె వస్తువులు అందించడంతో రావుగారు రైలు దిగుతాడు. స్టేషన్ లో ఉన్న మాస్టరూ, బంట్రోతు కూడా వెళ్లిపోతారు, రావుగారు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ విశ్రాంతి గదిలో కూర్చొంటాడు.
    టి.సి. దించేయడంతో ముస్టి ఆమె కూడా ఆ గదిలోపలికి వస్తుంది. దాంతో రావుగారికి కొంత ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి తలుపులు తెరుచుకోకుండా భీరువా, కుర్చీ అడ్డుపెడ్తారు. రావుగారు పొడిగుడ్డ ఇస్తాడు. తన దగ్గరున్న బిస్కెట్లు కూడా ఆమెకు పెడ్తాడు. మాటల మధ్యలో ఆమె భర్త తాగుబోతని, ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకుంటాడు. 'నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వం ఆమెకు లేదని, లోతైన ఇష్టాయిష్టాలు కల మనిషి కాదని, జరుగుతన్న క్షణంతోనే ఆమెకు సజీవ సంబంధమని' తెలుసుకుంటాడు.
      అంతలో పెద్ద చప్పుడుతో గది తలుపులు తెరుచుకుంటాయి. సామాను చెల్లాచెదురై పోతుంది. రావుగారు భయంతో ఒక్కగెంతుగెంతి ఆమెను పట్టుకుంటాడు. ఆమె తన చేతుల్ని ఆయన చుట్టూ చుడుతుంది. ఆయనకు ప్రాణావసరమైన వెచ్చదనాన్ని ఇస్తుంది. అప్పుడు రావుగారి 'హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమై పోతాయి'. ఇద్దరూ నిద్రపోతారు. రావుగారు తెల్లారి లేచే సరిగి ఆమె కనిపించదు. కానీ గోడకింద పడి చనిపోయి ఉంటుంది. రావుగారు చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. ఆమె చేతిలో డబ్బు, తన పర్సు ఉంటాయి. ఆమె దొంగ అని అందరూ అనుకోవడం ఇష్టంలేక ఆమె చేతిలో ఉన్న టిక్కెట్లు అమ్మిన డబ్బును డ్రాయర్లో వేస్తాడు. తన చిహ్నంగా ఆమె చేతిలోనే పర్సును వదిలేసి తన పేరున్న కార్డును మాత్రం తీసుకొని బరువెక్కిన హృదయంతో వెళ్లిపోతాడు.
         అనంతమైన తాత్విక భావనతో నిండిన వర్ణనలు, మనిషి జీవితాన్ని తర్కించే వ్యాఖ్యలు, రావుగారిలో వచ్చిన సజీవమార్పు, గాలివానతో బద్దలైపోయిన ఆయన ఆలోచనలు, సమాజంలో కింది స్థాయిలో ఉండేవారి క్షణిక భావోద్వేగాలు, భావాలు... ఇలా కథంతా ఒక విధమైన ఆలోచనా స్రవంతిలా సాగుతుంది. వ్యవహారిక భాష, చిన్నచిన్న వాక్యాలు మనల్ని సన్నివేశం, సంఘటనలలో లీనం చేసి ప్రత్యక్షానుభూతిని కలిగిస్తాయి. రావుగారి ఆలోచనల ద్వారా మిగిలిన పాత్ర గుణగణాలను చెప్పడం కథలోని ఔచిత్యం. 'గాలివాన' పేరును రావుగారి ఆలోచనల్లో వచ్చిన మార్పుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. కథ పెద్దదైనా పాఠకుడిని పద్మరాజు శైలి ఆకట్టుకుంటుంది. పాత్రలు, భావాలను, ప్రవర్తనా తీరను నిక్కచ్చిగా చెప్పాడు రచయిత. కథ చివర కరుణ రసాన్ని కురిపించనా, రావుగారిలో వచ్చిన మార్పు మనలో అట్లానే నిలిచిపోతుంది.
    'క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ కూడా మానవాతీత మయిన కొన్నిశక్తులు విజృంభించినప్పుడు అర్దరహితమై పోతాయని ఆయనకు జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది'.
    'ఆయన హృదయం తుపానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగి పొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది.'
    ఇలాంటి హృదయ లోతుల్ని పట్టి ఇచ్చే వాక్యాలు కథలో ఎన్నో మనకు కనిపిస్తాయి. అందుకే ఈ కథ మనల్ని మేల్కొలిపే 'గాలివాన' లాంటిదే...
                              
                    

డా.ఎ. రవీంద్రబాబు
జీవితంలో ఏ పోటీ అయినా పరుగు పందెంలా సాగాలి!
Apr 16, 2019
ఆనందీ గోపాల్  జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన  మొట్టమొదటి భారతీయ మహిళావైద్యురాలు..
Mar 30, 2019
మన భారతదేశంలో  శాస్త్రీయ నృత్యాలు... ఎనిమిది రకాలు... అవేమిటంటే.....
Mar 22, 2019
ఫిబ్రవరి 21 వ తేదీ ప్రపంచ మాత్రుభాషాదినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని, భాషా సాంస్క్రుతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు అవగాహన పొందేందుకు ఈరోజును ప్రపంచ మాత్రుభాషా దినోత్సవంగా.....
Feb 20, 2019
బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా మా ఇంటికి రావమ్మ మురియెంగా...
Oct 15, 2018
మునిగిన జలమును నీవు కరిగి  పవిత్రముగ జేసి నీ గుర్తుగా...
Sep 19, 2018
ఒక చిన్న కథ. ఓ వ్యాపారవేత్త పనిమీద బయల్దేరతాడు...
Sep 5, 2018
తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ లేదు. కాలం ఎంత మారినా కూడా...
Sep 3, 2018
తన శివతాండవ కావ్యాన్ని సంగీత సాహిత్య నాట్య త్రివేణీసంగమంగా మలచేందుకు మా అయ్యగారికి స్ఫూర్తినిచ్చినది చిదంబరంలోని
Feb 12, 2018
01 - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషలని ద్రవిడ భాషలంటారు కదా!
Dec 16, 2017
TeluguOne For Your Business
About TeluguOne