Facebook Twitter
వెర్రి తలలు వేస్తున్న అమెరికన్ల స్త్రీ పురుష సంబంధాలు

 వెర్రి తలలు వేస్తున్న అమెరికన్ల స్త్రీ పురుష సంబంధాలు


                                                                                                                                -కనకదుర్గ

అమెరికాలో ఏది చేస్తే ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా అవి చేయడం గొప్పగా, అభివృద్ది చెందుతున్ననట్టుగా భావిస్తారు.  ప్రపంచీకరణ తర్వాత ఈ తత్వం మరీ ఎక్కువయ్యింది.  ఇది బట్టలు వేసుకోవడంలో, మ్యుజిక్ వినడంలో, సినిమాలు మన భాషల్లోకి అనువదించి చాలా మంది ప్రేక్షకులు చూసేలా చేయడంలో, అక్కడ దొరికే ప్రతి ఒక్క కాస్మటిక్స్, ఎలక్ట్రానిక్స్, మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్ ల్లాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టి మన తిండి చేసుకుని బిజినెస్ చేసుకునేవారికి జీవనం కష్టమయినా సరే, అదేం పెద్ద విషయాలు కాదన్నట్టు, చిన్న చిన్న దుకాణాల్లో రక రకాల వ్యాపారాలు చేసుకునేవారి పాలిట మాల్స్ వచ్చి ఒక్క మాల్ కి వెళితే అన్ని అక్కడే దొరుకుతాయి ఎన్నో చోట్ల తిరగకుండా,  ఇక్కడ కంపెనీలు ఆసియాలో పెట్టుకుని చీప్ లేబర్ కోసం అక్కడ పనులు ఎక్కువ చేస్తూ అమెరికాలో కొంతమందితో పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నారు, లాభాలు సంపాదిస్తున్నారు.  ఇలాంటి పనుల వల్ల మన జీవిత విధానంలో మార్పులు వచ్చినా ఇదంతా మన మంచికే అనుకుంటూ ముందుకు సాగుతున్నారు ఎంతో మంది ఆసియా దేశస్థులు. 
ఒకప్పుడు పెళ్ళి చేసుకుని భర్తతో కాపురం చేస్తూ అతనితోనే పిల్లల్ని కని ఎంతో గౌరవంగా బ్రతకడం అనుకునేవారు.  స్త్రీలకీ శీలం అనీ, దాన్ని భద్రంగా పెళ్ళయ్యేవరకు దాచుకోవాలని లేకపోతే కుటుంబ, గౌరవ మర్యాదలకే ముప్పు వచ్చినట్టు భావిస్తారు ఎన్నో దేశాల ఆచార వ్యవహారాల్లో.  రేప్ జరిగిన అమ్మాయి తప్పు లేకున్నా ఆ అమ్మాయి జీవితం నరకప్రాయం చేస్తారు, పెళ్ళికి ముందు ప్రేమలో పడి గర్భం ధరిస్తే త్వరగా పెళ్ళి చేసి ఆ విషయం బయట పడకుండా జాగ్రత్త పడతారు, లేదా మోసం చేసి అతడు పారిపోతే ఎవరికి తెలియకుండా ఆ గర్భం తీయించి ఏమీ జరగనట్టు వేరే సంబంధం చూసి పెళ్ళి చేస్తారు. 
అవునూ అమెరికాలో వెర్రి తలలేస్తున్న సంబంధాల గురించి రాస్తూ ఇవన్నీ ఏమిటీ అనుకుంటున్నారా?  అంటే అక్కడ ఏది మారితే వాటి ప్రభావం ఇతర దేశాలపై వుంటుంది అని చెప్పడానికే ఇదంతా చెప్పాను.   ఒకోసారి టీనేజ్ అమ్మాయిలు డేటింగ్ చేస్తూ గర్భనిరోధక పద్ధతులేవి పాటించకుంటే గర్భం ధరిస్తే కొంతమంది వుంచుకుని ఇద్దరు కలిసి చదువుకుంటూ, పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ బిడ్డని కని పెంచుకుంటారు, సెటిల్ అయ్యాక పెళ్ళి చేసుకుంటారు.  కానీ అందరి విషయంలో ఇలా జరగదు.  భాయ్ ఫ్రెండ్ తనకేమి సంబంధం లేదని వదిలేసి వెళ్ళిపోతే, తనకు అప్పుడే తల్లి కావడం, తన స్వాతంత్ర్యం వదులుకోవడం ఇష్టం లేకుంటే కొంతమంది అబార్షన్ చేయించుకుంటే కొంతమంది బిడ్డని కని అడాప్షన్ కోసం పెడతారు.  పిల్లలు లేని వారు ముందుకు వచ్చి ఆ అమ్మాయి డెలివరీ అయ్యేదాక అన్నీ ఖర్చులు భరించి కాన్పు అయ్యాక బిడ్డను వారికి అప్పజెప్పి వెళ్ళిపోయి తమ బ్రతుకు బ్రతుకుతారు.  ఇది ఇక్కడ చాలా మామూలు విషయం.  ఒకోసారి పిల్లలు పెద్దయి తమ కన్న తల్లి ఎవరో తెల్సుకోవడానికి పెంచిన తల్లి తండ్రులదగ్గర సమాచారం తీసుకుని వెళ్ళి కలుస్తారు.   పిల్లలు పుట్టక పోతే టెస్ట్ ట్యూబ్ బేబీ నుండి అదీ కూడా సాధ్యం కాకపోతే కొత్తగా అద్దె తల్లి, సర్రొగేట్ (Surrogate) మదరింగ్ అని ఒక కొత్త పద్ధతిని కనుకున్నారు.   ఒకపుడు "అంగడిలో దొరకనికిది అమ్మ ఒకటే," అనుకునే వారు.  కానీ ఇపుడు మార్కెట్లో తల్లులు కూడా దొరుకుతారని రుజువు చేసారు.  ఒక సారి ఒక తల్లి తన కూతురు తల్లి కాలేక పోతున్నానని బాధ పడ్తుంటే తనకి పెద్ద వయసు అయిపోలేదు కాబట్టి తను పిల్లని కని కూతురికి ఇచ్చింది.  అంతే ఎంతోమంది తల్లులు కాలేని డబ్బున్న వారికి ఒక దారి దొరికింది.  డబ్బు ఆశ చూపించి మంచి ఆరోగ్యవంతులైన యువతులను ఎన్నుకుని వారి గర్భకోశాన్ని అద్దెకు తీసుకుని దానికి రుసుము చెల్లించి తల్లి తండ్రులు కావాలనుకుంటున్న భార్యా భర్తల్లో భర్త వీర్యాన్ని ఆమె గర్భకోశంలోకి ఇంజెక్ట్ చేసి గర్భం తెప్పించి, ఒకోసారి అండం, వీర్యాన్ని కలిపి అద్దెకు తీసుకున్న గర్భకోశంలో ప్రవేశపెట్టి, కానుపు అయ్యేదాక ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని పాపో, బాబో పుట్టగానే తీసుకెళ్తారు, అప్పుడప్పుడు తల్లి వచ్చి చూసుకోవచ్చు అని చెబుతారు.  అది కేవలం ఒక బిజినెస్ గా తీసుకునే వారు పెద్దగా పట్టించుకోరు, వారి చదువు, ఉద్యోగంలో పడి పోతారు.  ఇది మన దేశానికి ప్రాకడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.  కొన్ని సినిమాల్లో ఇందులో పెద్ద తప్పేమి లేదని కూడా చూపించడంతో, పేద స్త్రీలు, పిల్లలను బాగా చదివించుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, శరీరంలో భాగాలు అమ్ముకుని కొంతమంది అప్పులు తీర్చుకోవడం, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం ఎలా చేస్తున్నారో అలాగే మాతృత్వాన్ని అదీ ఇద్దరి మనుషులు పిల్లల కోసం సంసారం చేసి కని ప్రేమతో పెంచుకునే ప్రకృతి స్త్రీలకి ప్రసాదించిన వరం.  కేవలం తన ఇష్టంతో, తన కోసం తనకిష్టమయిన జీవితభాగస్వామితో కలిసి కని తన రక్తాన్ని చనుబాలుగా చేసి తాగించి ఎంతో ముద్దు మురిపాలతో పెంచుకునే మాతృత్వాన్ని ఒక వ్యాపారంగా మార్చేసారు.  ఇప్పుడు కుటుంబ గౌరవం, పరువు మర్యాదలు గుర్తు రావటం లేదా?  తమకు తగినట్టు ఆచారాలను మార్చుకోవడం ఈ పురుషాధిక్య సమాజానికి అలవాటే కదా!
ఇపుడు అమెరికాలో స్త్రీ పురుషులు ఒంటరిగానే వుంటూ కేవలం పిల్లలను కనడం కోసం వెబ్ సైట్స్ ద్వారా ఒక పార్ట్ నర్ ని ఎన్నుకుని అన్ని చెక్స్ చేయించుకుని అంటే వారి ఆరోగ్య వివరాలు, వారికెలాంటి నేర చరిత్ర లేదని తెలుసుకున్నతర్వాతే కేవలం ఒక పాపో, బాబునో కని వారి పెంపకంలో ఇద్దరూ ఎలా పాలు పంచుకుంటారో అనే విషయాల గురించి ఒప్పందం చేసుకుని పెంచుకుంటున్నారు.  వీరిద్దరి మధ్య ఎలాంటి ఇతర ప్రేమా ఆప్యాయతలు లాంటివి వుండవు.  కానీ బిడ్ద కారణంగా కలిసి వుంటారు.  ఒకవేళ కొన్నాళ్ళయ్యాక తల్లికి మళ్ళీ ఇంకో బిడ్డ కావాలంటే, అతను తనకి ఒక్క బిడ్డే చాలనుకుంటే అ తల్లి మళ్ళీ ఆన్ లైన్ లో ఇంకో క్యాండిడేట్ ని వెతుక్కుంటుంది.  స్త్రీకి పిల్లలు కావాలా, వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా వుంది.  సమాజం కోసం ప్రతి స్త్రీ పిల్లల్ని కనాలనే రూల్ ఏమీ లేదు.  అది ఆమె నిర్ణయం, తన భాగస్వామిని ఎన్నుకునే హక్కు, ఆర్ధిక స్వాతంత్ర్యం, సమాజంలో తను ఎలా బ్రతకాలనుకుంటుందో అవి అన్ని ఆమె నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇలా, ఒకో బిడ్డకి, ఒకో తండ్రిని మార్కెట్లో వెతుక్కోవడం మరీ విడ్డూరం అవుతుంది. 
పిల్లల్ని పెంచడం ఆర్ధికంగా ఒక్కరే పెంచడం కష్టమవుతుందని, ఇద్దరుంటే బిడ్డ పెంపకపు బాధ్యతలు సమంగా పంచుకుంటామని అగ్రిమెంట్ చేసుకుని పెంచుకోవడం సులువవుతుందని బిడ్డల పెంపకం కోసం ఇద్దరిని కలపడానికి  కొన్ని సంస్థలు, వెబ్ సైట్స్ మొదలయ్యాయి.  మాడర్న్- ఫ్యామిలీ రెండు పదాలు కలిపి మాడామిలీ (Modamily) అని అంటున్నారు ఇలాంటి కుటుంబాలని.  ఏమిటో చదివేస్తే ఉన్న మతి పోయినట్టు రాను రాను అభివృద్ది పేరుతో సంబందాలతో ఆటలాడుకుంటున్నారు. ఏది మంచి మార్పు, ఏది మనుషులను దిగజారుస్తుందో తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు మనుషులు.  మనకి ఏది మంచిది, ఏది కాదు అని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుందా లేదా ఆలోచించండి.