Facebook Twitter
లెన్స్

లెన్స్

- డా.సి. భవానీదేవి

కంటికి కంటికి మద్య
గాయానికి నెత్తురుకురుకూ మద్య
ప్రతి  నిముషాన్నీవార్త గా కోసే
ఈ లెన్స్ కత్తి ఎక్కడిది ?

అద్భుతం, అవసాన కాలం ఏదైనా
బందిపోటులా  గుండెల్లో
గుచ్చుకుంటుంది
కనురెప్పలు మూసేలోపు
కనబోయే కలల్నీ కూడా
గాలం వేసి ప్రసారిస్తుంది

తెరచాటు దృశ్యాల కోసం
ఇన్నిన్ని వేట కుక్కలు పొంచి చూస్తుంటే
ఎక్కడని దాక్కోగలం ?

ఒంటి స్తంభం మేడలు
కీకారణ్యాలు కూడా
నాసా కంట్లో లైవ్ టెలికాస్టే !
ప్రతిక్షణాన్నీ మింగే బైట్స్!
ప్రతిసందర్భమూ డిజిటల్ పోజే
ప్రతి జీవితం ఓ అల్బమే !
ప్రేమ మరణం
అన్నీ సామాజికం జాతీయం
ఇంక గుండెలు పిండే నీ ఏడుపుకూడా
కెమేరా కోసమే!

నువ్వు చావాలనుకుంటే
మరణ వాగ్మూలం కూడా
ముందుగానే చదువుకోవాలకుంటుంది

ఆచ్చాదన లేని దృశ్యశకలాలు
క్లోజప్స్లో బట్టబయలు
ఎఫ్.టి.వి నయం కదూ!

నీ బతుకు, నవ్వు,దుఃఖం నీవైతేగా
ఆ కన్ను కాసేపు మూసేయ్ మిత్రమా!
హాయిగా అమాయకంగా బతికేద్దాం!