Facebook Twitter
నా కళ్ళు

నా కళ్ళు

శ్రీమతి శారద అశోకవర్ధన్

వెలుగు తప్ప వేరేదీ చూడనని భీష్మించుకున్న నా కళ్ళు
    అన్నార్తుల ఆకలి మంటలు చూడలేక
    ఆర్తితో అలమటించే నా కళ్ళు
    అబలల మానభంగాలను చూసి
    భరించలేక బావురుమనే నా కళ్ళు
    అంధుల చీకటి బ్రతుకుల నాదుకోలేక
    విలపించే నా కళ్ళు
    దుర్మార్గుల దురంతాలకు
    దుఃఖించే నా కళ్ళు
    కట్నాల కోసం కట్టుకున్న ఇల్లాలిని
    కాల్చి చంపే కిరాతకుల గాంచి
    కన్నీరు కార్చే నా కళ్ళు
    కడుపునిండా తిండిలేక చెత్తకుండీలోని
    ఎంగిలాకుల మెతుకుల నేరుకుని కడుపు నింపుకునే
    కటిక దరిద్రులు చూసి కుమిలిపోయే నా కళ్ళు
    స్వార్ధపరులు అమాయకులను అందంగా మోసం చేస్తుంటే
    కాంచలేక కృంగిపోయే నా కళ్ళు
    నా దేశపు గత వైభవాలను నెమరు వేసుకుని
    తళతళలాడలేక పోతున్నాయి.
    తృప్తిని వెదజల్లి మెరవలేకపోతున్నాయి.
    కలవారి వాకిట్లో రంగు రంగుల రంగవల్లులూ
    అందమైన పూలకుండీల సోయగాల హరివిల్లులూ
    చూసిన నా కళ్ళు
    పూరి గుడిసెల ముందు మురికి కాలువల నిండా
    చుక్కల్లా కొలువు తీర్చిన ఈగల గుంపులను
    తలచుకుని గుండెలవిసేలా విలపించాయి
    కన్నీరు కార్చాయి నా కళ్ళు!
    కూటికీ నీటికీ కుమ్ములాడుకునే జనాన్ని చూసి
    రేపనేది ఎలా వుంటుందో ఊహకందక
    బిక్కు బిక్కుమంటూ బిత్తర చూపులు చూశాయి
    గతుక్కుమన్నాయి నా కళ్లు!
    ఐకమత్యం తరిగిపోయి  అరాచకం పెరిగిపోయి
    కులంపేర మతం పేర మానవత్వానికి
    సమాధులు కడుతూ వుంటే  మానవుడు
    అభిమానం ఆదర్శం అన్నీ తుడిచిపెట్టి
    అన్నదమ్ములు స్వార్ధంతో కుస్తీలు పడుతూవుంటే
    చూడలేక ఆశ్చర్యంతో గుడ్లప్పగించాయి నా కళ్ళు!
    కలత నిండిన నా కళ్ళు క్రాంతి కోసం కాంతి కోసం
    కలువరేకుల్లా విచ్చుకుని కాచుకు కూచున్నాయి
    కన్నీరు పన్నీరై నిలిచే రోజు కోసం
    కోట్ల ఆశలు నింపుకున్నాయి నా కళ్ళు
    కలువరేకులై వేచి వున్నాయి