LATEST NEWS
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది.  ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.       (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.       (Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి.  సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.   విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ  స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి.  అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో  విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి  అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు   పార్టీలోకి వచ్చి తన  నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  రాష్ట్ర రాజకీయాల్లో   బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది.   తనను తాను శివసేన వ్యవస్థాపకుడు  బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము.  ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   [Vijayasai Reddy Bal Thackeray  Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]
తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
వైసీపీ ఇండియా కూటమిలో చేరబోతోందా? 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. కాంగ్రెస్ అండ వినా గత్యంతరం లేదని భావిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారని వైసీపీ వర్గాలూ చెబుతుతున్నాయి.  అందులో భాగంగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..   జాతీయ స్థాయిలో కీలకంగా మారిన  ఇండియా కూటమితో   జతకట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకుంటూ, రాబోయే కాలంలో అనుసరించాల్సిన విధానాలపై అయన విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను పదును పెడుతున్న జగన్.. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు.  ఇండియా కూటమితో భాగం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీయేయేతర పార్టీలతో సయోధ్య ఏర్పడుతుందనీ, తద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన గళం వినిపించే అవకాశం లభిస్తుందని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.    గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో  సయోధ్యతో వ్యవహరించిన జగన్.. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత.. బీజేపీతో ఎంతగా కలిసి సాగాలన్నా ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఉన్న చెలిమి కారణంగా వీలు కావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూపు ఇండియా కూటమి వైపు మళ్లిందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరినట్లైతే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ సహయ సహకారాలు అందుతాయనీ, అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   రాష్ట్రంలో  ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఏకైక విపక్షంగా క్షేత్రస్థాయిలో చేపట్టే ఆందోళనలకు మద్దతు లభించాలంటే.. ఇండియా కూటమి అండ అవసరమన్న భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు.    [Jagan Join INDIA Alliance, 2029 AP Elections, YCP political strategy, AP politicalnews, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.  మహేంద్రగిరి వారాహి ప్రమోషన్స్ చాలా జోరుగా చేస్తున్నారు కదా? -అవునండి. ఈ మధ్యకాలంలో నా నుంచి వస్తున్న చాలా బిగ్ బడ్జెట్ సినిమా ఇది. నిర్మాతలు చాలా పెద్ద స్కేల్ లో తీశారు. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్‌గా చేస్తున్నారు. హిందీ, తమిళ్‌లో కూడా రిలీజ్ అవుతుంది. నార్త్ నుంచి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ కథ చెప్తున్నప్పుడు మీకు ఎక్కడ బాగా కనెక్ట్ అయింది? -కథ మొత్తం నాకు నచ్చింది. ఇంటర్వెల్ లో, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి హై ఇస్తాయి. సంతోష్ ఈ కథని సింగిల్ సిట్టింగ్‌లో చెప్పారు. నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ సంతోష్‌కి వేదాలు, పురాణాల పట్ల చాలా మంచి అవగాహన ఉంది. తనకి ఇది చాలా రైట్ సబ్జెక్టు. తను అనుకున్న కథని అంతే అద్భుతంగా తీశాడు. మేము అనుకున్నప్పుడు ఇంత బిగ్ స్కేల్‌లో తీస్తారని అనుకోలేదు. కాకపోతే VFX పరంగా, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా, నటీనటుల పరంగా అన్నీ కలిసి వచ్చాయి. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? - నేను యూట్యూబ్ లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇది డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. అలాగే మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.  సిద్దు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? -సిద్దు ఒక సీరియస్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. చూసిన వాళ్లందరూ కూడా అది చాలా అద్భుతంగా వచ్చింది అని చెప్పారు. అది సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఈ పాత్ర ఒప్పుకున్నందుకు సిద్దుకి థాంక్స్. మైథాలజీ ట్రెండ్ నడుస్తుంది కదా? ఆ ట్రెండ్‌లో ఈ సినిమా చేశారా? లేదండి. ‘కార్తికేయ’, ‘కాంతార’ నుంచి ఆ మైథాలజీ ట్రెండ్ మొదలైంది. అంతకు ముందు కూడా ఉంది. కాకపోతే ఈ చిత్రాలతో మళ్లీ వరుసగా అలాంటి సినిమాలు రావడం ప్రారంభమైంది. కానీ మేము ఈ కథని మూడేళ్ల క్రితమే ఫిక్స్ చేశాము. అప్పటికి సరైన నిర్మాతలు రాలేదు. ఒక సంవత్సరం తర్వాత మధు గారు, ఆ తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు. లక్ష్మణ్ గారు మా సినిమా ఫుటేజ్ చూసి ఆయనకు నచ్చి వచ్చారు. లక్ష్మణ్ గారు దిల్ రాజు గారితో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ట్రైలర్ చూస్తే ‘మురారి’ సినిమా ఛాయలు కనిపించాయి? -ట్రైలర్‌లో చూపించినట్టుగా 33 ఏళ్లు దాటితే ఆ వంశంలో వ్యక్తులు చనిపోతున్నారు అనేది ‘మురారి’ సినిమా పాయింట్‌ని గుర్తు చేసినప్పటికీ, ఇందులో కథ, స్క్రీన్‌ప్లే చాలా భిన్నంగా ఉంటాయి. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్.  అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి?  -అనుప్ రూబెన్స్ గారి రీ-రికార్డింగ్ హైలెట్ అవుతుంది. మ్యూజిక్ గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమాలో మ్యూజిక్ ఒక హైలెట్‌గా ఉంటుంది. వారాహి అమ్మవారు పవర్‌ఫుల్. పవన్ కళ్యాణ్ గారు వారాహి మాల వేసుకోవడం, ఆ యాత్ర చేయడంతో అది ఇంకా ప్రచారంలోకి వచ్చింది. అది మీకు ఈ టైటిల్ విషయంలో ఎలా హెల్ప్ అయింది? -కథ అనుకున్నప్పుడే మేము ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేశాం. పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది. కాబట్టి మా సినిమాకి కూడా అది కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం.   ఇందులో యాక్షన్ ఎలా వుంటుంది?  -ఇందులో ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అలాగే యాక్షన్ బ్లాక్స్ చాలా ఉంటాయి. యాక్షన్ చేయడం నాకు ఇష్టం. గతంలో కూడా చాలా యాక్షన్ సినిమాలు చేశాను. మంచి యాక్షన్ కథ వస్తే కచ్చితంగా చేస్తాను. విలన్ పాత్రలు కూడా చేస్తారని చెప్పారు?  -నేను ఎప్పటినుంచో విలన్ పాత్రలకు సిద్ధంగా ఉన్నాను. హీరో పాత్రలు చేయడంతో పాటు మంచి విలన్ క్యారెక్టర్లు, అలాగే బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.         [Sumanth Interview, Mahendragiri Varahi Movie, Mahesh Babu, Murari Movie, Pawan Kalyan, Siddhu Jonnalagadda, Telugu Film News, Telugu News]  
  ఇరుముడి సక్సెస్ రేంజ్ ని మాస్ మహారాజా రవితేజ తో పాటు మేకర్స్ ,అభిమానులు, ప్రేక్షకులు అసలు ఉహించి ఉండరు. తెలుగు సినిమాలో దాగి ఉన్న ఒక ఫార్మేట్ ని బతికించిన సంజీవిని అని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక్కో సినిమాకి  20 కోట్ల నుండి  25 కోట్ల వరకు పారితోషికం తీసుకునే రవితేజ, వరుస ప్లాపుల వల్ల తన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఇరుముడితో ఒక తెలివైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు .   తన రెగ్యులర్ రెమ్యునరేషన్‌  వదులుకుని లేదా చాలా తక్కువగా సుమారు 7 నుండి  8 కోట్లకి  అందుకొని నైజాం (తెలంగాణ) థియేట్రికల్ రైట్స్ మరియు లాభాల్లో వాటా రూపంలో డీల్ కుదుర్చుకున్నాడు. మరి నన్ను నమ్మి డీల్ కుదుర్చుకున్నావని అయ్యప్ప స్వామి అనుకున్నాడో ఏమో, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.కేవలం నైజాం ప్రాంతంలోనే ఫస్ట్ వీక్‌లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా, ఇప్పుడు ఆ కలెక్షన్స్ 81 కోట్ల గ్రాస్ కి చేరాయి. ఇంకా భారీ కలెక్షన్స్ లోనే రన్ అవుతుంది. దీంతో క్లోజింగ్ టైమ్ కి  రవితేజ  నైజాం రైట్స్ , ప్రాఫిట్ షేరింగ్ తో ఆయన  ఖాతాలో ఏకంగా 50 కోట్ల భారీ షేర్ లేదా లాభాల వాటా పడనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.        Also Read: ఇరుముడిని ఎన్టీఆర్ చేసి ఉంటే: పరిస్థితి ఇదేనా! వరల్డ్  వైడ్ గా 250 కోట్ల గ్రాస్ మార్కుకి చేరువ అవుతున్న ఇరుముడి  దాదాపు అన్నిఖర్చులు  పోను 70 కోట్ల దాకా లాభాల్లో ఉంది. దీంతో  చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' తర్వాత ఎక్కువ లాభాలు తీసుకొస్తున్న మూవీగా ఇరుముడి రికార్డులకి ఎక్కింది.      [Irumudi, Raviteja, Priya Bhavani Shankar, Nakshtra, Mass Maharaja Remuneration, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News, Mythri Movie Makers]  
తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర అసలు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రాబోతున్న రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. కార్తి లాంటి స్టార్ హీరో నటించిన భారీ బడ్జెట్ సీక్వెల్ సినిమా ‘సర్దార్ 2’ని దాటుకుని, సూరి-సుహాస్ నటించిన ‘మండాడి’ సినిమా బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. అసలు తమిళనాడు ఆడియన్స్ మైండ్‌సెట్ ఏంటి? ఈ సీక్వెల్ హడావుడిని తట్టుకుని ఒక కంటెంట్ డ్రివెన్ మూవీ ఎలా ముందంజలో నిలిచింది? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోందంటే.. క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో కార్తి, ఎస్‌.జె. సూర్య కాంబినేషన్‌లో వస్తున్న ‘సర్దార్ 2’పై తమిళనాడుతో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కానీ, ఈ సినిమా ఇనిషియల్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం... తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'మండాడి' చిత్రం ఏకంగా ₹94.56 లక్షల గ్రాస్ వసూలు చేసి టాప్‌లో నిలిచింది. భారీ సీక్వెల్ అయిన 'సర్దార్ 2' మాత్రం ₹78.89 లక్షలతో సరిపెట్టుకుంది. సీక్వెల్ క్రేజ్ ఉన్నప్పటికీ, హోమ్ గ్రౌండ్ తమిళనాడులో సర్దార్ 2 కంటే మండాడి సినిమానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ముందంజలో ఉంది. ఈ ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఒకటి మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. తమిళ ప్రేక్షకులు కేవలం సీక్వెల్ ట్యాగ్‌లు లేదా భారీ బడ్జెట్ హంగులు చూసి టికెట్లు బుక్ చేసుకోవడం లేదు. కథలో దమ్ము, కంటెంట్‌లో నిజాయితీ ఉన్న సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘మండాడి’ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అందుకే మాస్, క్లాస్ అనే తేడా లేకుండా జనాలు మండాడి టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇనిషియల్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘మండాడి’ హవా చుపిస్తున్నప్పటికీ, సెప్టెంబర్ 10న రాబోతున్న ఈ బాక్సాఫీస్ వార్‌లో తొలి రోజు ఏ సినిమా పైచేయి సాధిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.       [Sardar 2 vs Mandaadi, Sardar 2 Movie, Mandaadi Movie, Sardar 2 Bookings, Mandaadi Bookings, Suhas, Karthi, Telugu Film News, Telugu News]  
    అప్పుడే పుట్టిన పసిపిల్లాడి(పాప) బోసి నవ్వు చూస్తే జన్మ ధన్యమైందని ఎలా అనుకుంటామో, బడా హీరో సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షో కి వెళ్లి  హీరో డై హార్డ్ ఫ్యాన్ ఫేస్ చూస్తున్నా అదే ఫీలింగ్ ఉంటుందని సినీ ప్రియులు చెప్తుంటారు .ఇప్పుడు ఎన్టీఆర్ కి చెందిన  డై హార్డ్  ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'ఎన్టీఆర్' ఇరుముడి చేసి ఉంటే అనే చర్చ లేనవెత్తుతున్నారు.  ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఈ శక్తివంతమైన భక్తి కథాంశంలో నటించి ఉంటే తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులు ఏ విధంగా రూపాంతరం చెందేవో ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. 'ఇరుముడి' కథలో కథానాయకుడి పాత్ర ఎంతో వైవిధ్యమైనది. ప్రారంభంలో పక్కా నెగెటివ్ షేడ్స్ కలిగి, తీవ్రంగా మందుకి అలవాటుపడిన ఒక సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేన్ తన చిన్నారి కూతురి కోరిక కోసం అయ్యప్ప మాల ధరిస్తాడు. ఆ మాల ధారణ తర్వాత అతని ప్రవర్తనలో, మనస్తత్వంలో వచ్చిన ఆధ్యాత్మిక మార్పులు, దాని ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రైమ్ సస్పెన్స్ డ్రామాను ఛేదించే విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్టీఆర్ వంటి అద్భుతమైన నటుడు ఈ పాత్రలో ఉండి ఉంటే, ఆ భావోద్వేగాలు మరొక ఎత్తులో ఉండేవి. 'రాఖీ', 'జై లవకుశ' వంటి చిత్రాల్లో తండ్రిగా, అన్నగా ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించిన ఎన్టీఆర్, ఇరుముడి మాల ధరించి 'స్వామియే శరణం అయ్యప్ప' అని శరణుఘోష చేస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి సాధారణంగా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, ఆయనకున్న విపరీతమైన అభిమాన గణం ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే.ఇరుముడి  మొదటి రోజు రూ. 15 కోట్ల నుంచి  20 కోట్ల వరకు నెట్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావాన్ని చూపించింది. అదే ఎన్టీఆర్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో ఈ సినిమా వచ్చి ఉంటే, ఓపెనింగ్ డే కలెక్షన్లు సునాయాసంగా 80 కోట్ల నుండి 100 కోట్ల మార్కును దాటేసి ఉండేవి. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' మరియు 'దేవర' చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్ దృష్ట్యా, ఉత్తరాది రాష్ట్రాలలోనూ ఈ ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కథ అపారమైన విజయాన్ని సాధించేది. శబరిమల యాత్ర, అయ్యప్ప స్వామి భక్తి విశిష్టత దక్షిణాదికే కాకుండా దేశమంతటికీ బాగా కనెక్ట్ అయ్యే అంశం కావడం వల్ల పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద శతాధిక కోట్ల వర్షం కురిసేదని ఫ్యాన్స్ చెప్తున్నారు.      Also Read: ఫౌజీ సెట్స్‌లో విషపురుగు కాటు:  అసలు నిజం బయటపెట్టిన రాజేష్ శర్మ! నిజానికి ఒక హీరో సినిమా రిలీజై సూపర్ డూపర్ హిట్ కొట్టాక, మా హీరో ఈ సినిమాలో చేస్తే సూపర్ గా  ఉండేదని అనుకోవడం పరిపాటి. ఆ మాటకొస్తే ఇండియన్ చిత్ర సీమ మొత్తంపై అలాంటి మాటలు ఫ్యాన్స్  ఆనందం, హుషారు మధ్య ట్రావెల్ చేస్తుంటాయి. ఆ కోవలోనే ఎన్టీఆర్ ఇరుముడి చేసి ఉంటే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అని కొంత మంది  ఫ్యాన్స్  బావిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసి ఉన్నా కూడా సూపర్ గా ఉండేదనే మాటలు సైతం  కొంత మంది ఫ్యాన్స్ నుంచి వచ్చాయి. అంతే కానీ మాస్ మహారాజాని తక్కువ చెయ్యడం కాదు. జస్ట్ ఫ్యాన్స్ ఆరాటం అంతే. మాస్ మహారాజా తనదైన పెర్ ఫార్మ్ తో ఇరుముడిని బ్లాక్ బస్టర్ బాట పట్టించాడు    .           [ Ntr, irumudi, Raviteja, Shiva Nirvana, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News, Pan India,NTR Irumudi]    
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరితో కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'మండాడి' సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఇటీవల సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయింది. సెంట్రల్ బోర్డ్ ఈ చిత్రానికి UA16+ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఇక ఈ సినిమా నిడివిని క్రిస్పీగా, ఎక్కడా బోర్ కొట్టకుండా 2 గంటల 30 నిమిషాలు (150 నిమిషాలు) గా లాక్ చేశారు. నేటితరం ప్రేక్షకులకు పర్ఫెక్ట్ పేసింగ్‌తో ఉండేలా ఈ సినిమాను ఎడిట్ చేశారట. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సముద్రం, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఇది. సముద్రంలో తనదైన నైపుణ్యంతో చేపల వేట సాగించే ముత్తుకాళి పాత్రలో సూరీ నటించారు. కాళి కేవలం జాలరి మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలోనే తిరుగులేని బోట్ రేసర్. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తన ఊరిని, తన ప్రజలను వదిలేసి దూరంగా బతుకుతుంటాడు. అలాంటి సమయంలో తన సొంత ఊరి మత్స్యకారులకు తీవ్రమైన ఆపద ఎదురవుతుంది. తన వాళ్ల కోసం, తన గ్రామం కోసం కాళి మళ్లీ తిరిగొస్తాడు. తన సహచరులతో కలిసి సంప్రదాయ పడవ పందాల్లో దిగి తొడగొడతాడు. ఇందులో సట్టై పులి అనే పవర్‌ఫుల్ అండ్ కన్నింగ్ పాత్రలో సుహాస్ కనిపించబోతున్నాడు. కాళికి చిరకాల ప్రత్యర్థి అయిన సట్టై పులి.. ఎలాంటి కుట్రలు చేశాడు? కుతంత్రాలతో కాళిని ఎలా దెబ్బతీయాలని చూశాడు? సముద్రం అలలపై కాళికి, సట్టై పులికి మధ్య జరిగిన ఆ పడవ పందాల పోరు ఎంత ఉత్కంఠగా సాగింది అనేదే ఈ సినిమా మెయిన్ హైలైట్. డైరెక్టర్ వెట్రీమారన్ శిష్యుడైన మతిమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దాంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సముద్రంలో చిత్రీకరించిన బోట్ రేసింగ్ సీన్స్ హాలీవుడ్ లెవెల్‌లో ఉన్నాయని ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జీవీ ప్రకాశ్ కుమార్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రచ్చ లేపాడని టాక్. సుహాస్ మరోసారి తన పెర్ఫార్మెన్స్‌తో ఫిదా చేశారట. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్, సెకండాఫ్‌లో వచ్చే సూరి-సుహాస్ ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయమని అంటున్నారు. గ్రామీణ వాతావరణాన్ని నాచురల్‌గా చూపిస్తూనే.. ఎక్కడా కథనం స్లో అవ్వకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రా విజ్యువల్స్ ఈ సినిమాకు ప్రాణం పోసాయని తెలుస్తోంది. సూరీ, సుహాస్ ఇద్దరూ పోటాపోటీగా నటించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.       [Mandaadi First Review, Mandaadi Censor Talk, Mandaadi Review, Suhas, Soori, Mathimaran Pugazhendhi, Telugu Movie Review, Telugu Film News, Telugu News]  
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ ‘ఫౌజీ’ . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ జరుగుతున్నట్టుగా టాక్.  అయితే కొన్ని రోజుల క్రితం  షూటింగ్ సెట్‌లో ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ శర్మ ని విషపూరితమైన కీటకం కొట్టడంతో  తీవ్ర అస్వస్థతకి  గురయ్యారని హుటాహుటిన కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్పించారనే వార్తలు నెట్టింట హల్ చల్ చేసింది. ఈ ఘటనపై సినిమా వర్కర్ల సంఘం ఏఐసీడబ్ల్యూఏ (AICWA) కూడా స్పందిస్తూ సెట్‌లో సరైన భద్రత, వైద్య సదుపాయాలు లేవని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేయడంతో సినీ పరిశ్రమలో పెద్ద కలకలమే రేగింది.  అయితే ఈ ప్రచారం అంతటికీ చెక్ పెడుతూ స్వయంగా నటుడు రాజేష్ శర్మ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసలు నిజాన్ని వెల్లడి చేసాడు. ఆయన మాట్లాడుతు 'ప్రభాస్ సినిమా సెట్‌లో నన్ను విషకీటకం కుట్టిందనే వార్తలన్నీ పూర్తిగా అబద్దం. అవన్నీ ఒట్టి రూమర్లు మాత్రమే. ప్రభాస్ గానీ, ఆ సినిమా నిర్మాణ బృందం గానీ చాలా మంచివారు. సెట్‌లో నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. నా ఆరోగ్యం క్షీణించడానికి ఆ సినిమా యూనిట్‌కి  ఎలాంటి సంబంధం లేదు". నాకు చాలా కాలంగా కుడి కాలికీ ఒక తీవ్రమైన చర్మ సమస్య (స్కిన్ ఇన్ఫెక్షన్) ఉంది. హైదరాబాద్ షూటింగ్ ముగించుకుని కోల్‌కతా వెళ్లిన తర్వాత నా రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ / డయాబెటిస్) అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ చర్మ ఇన్ఫెక్షన్ ఒక్కసారిగా విషమించింది. స్టార్టింగ్ లో ఆ సమస్యని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి తీవ్రమై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అంతేతప్ప పురుగు కుట్టడం అనేది ఏమాత్రం నిజం కాదని స్పష్టత ఇచ్చారు.     Also Read: దారుణంగా పడిపోయిన టాక్సిక్ ఓటీటీ డీల్: అత్యాశ వల్ల ఎన్ని కోట్లు లాస్ అంటే! కోల్ కతా కి చెందిన రాజేష్ వెనక వందకి పైగా  హిందీ, బెంగాలీ చిత్రాలు ఉన్నాయి. ఎనీ క్యారక్టర్ తీసుకోండి ఓవర్ డోస్ లేకుండా పెర్ ఫార్మ్ చెయ్యడం రాజేష్ శర్మ స్పెషాలిటీ.     [ Fauji,  Prabhas, Rajesh Sharma, Health Rumors, Kolakata, Hanu Raghavapudi, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
Suriya delivered biggest blockbuster of his career with Karuppu. The movie was designed as Mookuthi Amman 2, sequel to Mookuthi Amman by RJ Balaji. But the director quit Mookuthi Amman franchise and sold the rights to Sundar C to develop the sequel. Now, this Nayanthara starrer is set to clash with Suriya's next film.  As per the reports, Suriya has completed shoot of his next film as a cop, in the direction of Jithu Madhavan. After Aavesham, the director is coming up with this film and it has huge anticipation. Nazriya Nazim and Naslen are cast in the film, which further increased expectations.  Suriya is producing the film on his Zhagaram productions and he locked Diwali release for the film, say reports. On the other hand, Sundar C and producer Ishari Ganesh have watched Mookuthi Amman 2, loved it and are super confident about the movie becoming a huge blockbuster for Diwali time, it seems.  Well, Ramayana Part-1 is set to release for the same date or time. Already, Dhanush's OM makers wanted to see if they can postpone their movie from 16th October to avoid clash with Rajinikanth's Jailer 2 but they did not want to lose to Ramayana. We have to wait and see how other two biggies will withhold and carry forward.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బాక్సాఫీస్ దగ్గర మళ్లీ డబుల్ ధమాకా క్రియేట్ చేయడానికి తమిళ హీరో కార్తీ 'సర్దార్ 2' తో వచ్చేస్తున్నారు. 2022లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సర్దార్' సినిమాకి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతున్న ఈ మూవీ సెన్సార్ పనులను ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా మొత్తం రన్ టైమ్ 2 గంటల 59 నిమిషాలు (179 నిమిషాలు). నిడివి కాస్త భారీగానే అనిపించినా, ప్రతీ నిమిషం ఊపిరిసలపని హై యాక్షన్ సీన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని సెన్సార్ టాక్ వెల్లడిస్తోంది. కథ ఏంటంటే.. భారత ప్రధాని అత్యవసరంగా ఒక సీక్రెట్ మిషన్‌ను ఆదేశిస్తారు. దేశ భద్రతను దెబ్బతీయడానికి 'బ్లాక్ డాగర్' అనే డేంజరస్ పాత్రలో ఎస్‌జే సూర్య ఒక ముఠాతో కలిసి భారీ కుట్ర పన్నుతాడు. ఈ కుట్రను భగ్నం చేయడానికి జపాన్ భాష తెలిసిన ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ అవసరమవుతాడు. దాంతో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్, సీక్రెట్ ఏజెంట్ విజయ్ (కార్తీ) రంగంలోకి దిగుతాడు. ఒకపక్క నేటి సమాజంలో తీవ్రమైన ముప్పుగా మారిన ప్లాస్టిక్ వాడకం అండ్ దాని వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్ చుట్టూ ఈ కథ నడుస్తూనే.. దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ తో సాగుతుంది. నటన విషయానికి వస్తే కార్తీ తండ్రి, కొడుకులుగా డబుల్ రోల్‌లో జీవించేశారు. విలన్‌గా ఎస్‌జే సూర్య పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందట. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ల గ్లామర్ అండ్ యాక్షన్ ఓ రేంజ్ లో అలరిస్తాయని తెలుస్తోంది. అలాగే సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ కానుంది. సెన్సార్ నుంచి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 10న థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.       [Sardar 2 Review, Karthi Sardar 2, SJ Suryah Sardar 2, Sardar 2 Story, Sardar 2 Censor, PS Mithran, Telugu Cinema Review, Telugu Film News, Telugu News]  
  అత్యాశ అనే వర్డ్ తప్పని చెప్పలేం. కానీ అత్యాశతో వెయిట్ చేసి అనుకున్నది కుదరక అసలుకే మోసం వస్తే మాత్రం అత్యాశనే మౌనంగా సరైన సమాధానం చెప్తుంది. ఇప్పుడు యష్ వన్ మాన్ షో  టాక్సిక్ మేకర్స్ ది అదే పరిస్థితి.    థియేట్రికల్ రిలీజ్ కి  ముందు, ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి 'టాక్సిక్' ఆల్ లాంగ్వేజ్ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం 150 కోట్ల వరకు  ఆఫర్లు వచ్చాయి. అయితే, థియేట్రికల్ బిజినెస్ ద్వారా  450 కోట్ల మైలురాయిని సులభంగా అందుకుంటుందని, ఆ విజయం ఆధారంగా డిజిటల్ హక్కుల ధరను . 200 కోట్లకు పైగా పెంచవచ్చని మేకర్స్ భావించారు. యశ్ కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని నమ్మి, 150 కోట్ల ప్రారంభ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఉదయం మొదటి ఆట నుంచే నాకు ఎదురే లేదు అన్నట్టుగా డిజాస్టర్ టాక్ వీరవిహారం చేస్తూ వచ్చింది.  ఈ డిజాస్టర్ ఫలితం ప్రభావం ప్రత్యక్షంగా ఓటీటీ రైట్స్ పై పడి గతంలో 150 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడిన సంస్థలు ఇప్పుడు తమ ఆఫర్లను పూర్తిగా తగ్గించేశాయి. ప్రస్తుతం జీ5 (Zee5) సంస్థ మాత్రమే ఈ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుండగా, వారు కోట్ చేసిన మొత్తం కేవలం  30 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే, విడుదలకు ముందు చేతివరకు వచ్చి చేజారిన రూ. 150 కోట్లతో పోలిస్తే, మేకర్స్ దాదాపు  120 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.     Also Read: చిరు డాటర్ సుస్మితకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు    పైగా, ఈ చిత్రంలో బోల్డ్ మరియు అడల్ట్ ఓరియంటెడ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో శాటిలైట్ హక్కుల ద్వారా కూడా పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం కనిపిచడం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి మెరుగైన ఆఫర్లను పొందడానికి, మేకర్స్ డిజిటల్ స్ట్రీమింగ్ వెర్షన్ కోసం సరికొత్త కట్ (Fresh Edit) తయారు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రణాళికల అంచనాలు తప్పి, భారీ రేటు ఆశించడంతో ఒక అగ్ర హీరో సినిమా ఓటీటీ మార్కెట్‌లో ఇన్ని కోట్ల నష్టాన్ని ఎదుర్కొవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇక టాక్సిక్  12 రోజుల రన్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 337.80 కోట్ల గ్రాస్ మాత్రమే నమోదు చేయగలిగింది.ఇంక వస్తాయనే నమ్మకం లేదు. ఇటీవల ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలీజ్ చేయగా కనీసం ఫోన్ ఖర్చులకి కూడా రాలేదని టాక్.         [Toxic, Ott Deal. yash, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
    మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటుంది.  మన శంకర వరప్రసాద్ గారుతో ఇప్పటి వరకు వచ్చిన చిరంజీవి  ఎంటైర్ కెరీర్ సినిమాల మొత్తంలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిపింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ తో తెరకెక్కించిన 'జగమే సంగీతం'తో కూడా హిట్ అందుకుంది. రీసెంట్ గా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్మితకి  కీలకమైన బాధ్యతలని అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం) ట్రస్ట్ బోర్డుకి సుస్మిత ని ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి చిరంజీవి నుంచి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రంతో  కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నిర్మాతగా ఎదగడం, ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకి ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించబడం విశిష్టమనే చెప్పాలి. సుస్మిత తల్లి చిరు వైఫ్ తెలంగాణలోని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ట్రస్ట్ బోర్డ్ నెంబర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. Also Read: ఈ రోజు అనస్వర రాజన్ బర్త్ డే:  కాకా కూతురి లుక్ రిలీజ్.. మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్       [Sushmitha Konidela, Durga Devi Temple. Chiranjeevi, Ap Cm, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా గొప్ప బంధానికి దారి తీస్తుంది.  జీవితాంతం ఒకరికి ఒగరుగా ఉండటం కోసం వివాహం చేసుకుంటారు.  కానీ  కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది.  చట్టబద్దంగా విడాకులు తీసుకుని విడిపోతుంటారు.  విడాకులు పొందిన తర్వాత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన నిర్ణయం. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, ఏర్పడిన మానసిక పరిపక్వత ఈ కొత్త ప్రయాణానికి పునాదిగా నిలుస్తాయి. అయితే కొందరు తొందరపడి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు.  కానీ ఇలా చేసే తొందరపాటు పని రెండవ వివాహం తర్వాత కూడా జీవితాన్ని విచ్చిన్నం చేస్తుంది.  రెండవ సారి వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు ఆలోచించడం,   కీలకమైన జాగ్రత్తలు పాటించడం , కొన్ని విషయాలలో ముందే స్పష్టత తెచ్చుకోవడం చాలా ముఖ్యం.  దీని వల్ల భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది. మళ్లీ పెళ్లి చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఏ ఏ విషయాల్లో స్పష్టత అవసరమో తెలుసుకుంటే.. గతం నుండి బయటపడటం.. విడాకుల తర్వాత మరో పెళ్లికి సిద్ధపడే ముందు, పాత బంధం కలిగించిన బాధలు, కోపాలు, అసంతృప్తుల నుంచి పూర్తిగా కోలుకోవాలి. మానసిక ప్రశాంతత లభించినప్పుడే కొత్త వ్యక్తికి మన జీవితంలో సరైన స్థానం ఇవ్వగలుగుతాం. పాత గాయాలు మానకుండా ఇంకొకరితో ప్రయాణం మొదలుపెడితే, చిన్న చిన్న విషయాలకే పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చి కొత్త బంధంలో అపార్థాలకు దారితీస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దని గ్రహించడం.. ఒంటరితనాన్ని జయించడానికో లేదా సమాజం ఏమనుకుంటుందో అనే భయంతోనో మరో పెళ్లి చేసుకోకూడదు.  జీవితంలో నిజంగా ఒక తోడు కావాలని, కొత్త జీవితాన్ని పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనిపించినప్పుడు మాత్రమే ముందడుగు వేయాలి. సమయం తీసుకుని ఆలోచించడం ఎంతైనా మంచిది. స్వయం పరిశీలన చేసుకోవడం.. గత బంధంలో లోపాలు ఎక్కడ జరిగాయి, మీ వైపు నుంచి ఏవైనా పొరపాట్లు ఉన్నాయా అనే అంశాలపై నిజాయితీగా ఆలోచించుకోవాలి. గత తప్పులను గుర్తించడం వల్ల వాటిని రాబోయే కొత్త బంధంలో మళ్లీ చేయకుండా జాగ్రత్తపడవచ్చు. కొత్త భాగస్వామి విషయంలో ఉండాల్సిన స్పష్టత..  పారదర్శకత , నిజాయితీ.. గత విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలను కొత్త భాగస్వామికి స్పష్టంగా చెప్పాలి. ఏ విషయాలనూ దాచకూడదు. చట్టపరంగా విడాకుల ప్రక్రియ పూర్తి అయిందో లేదో తెలియజేయడం చాలా ముఖ్యం.  గత జీవితం గురించి  ఎంత స్పష్టంగా ఉంటే, కొత్త బంధంలో నమ్మకం అంత త్వరగా బలపడుతుంది. ఆర్థిక విషయాలపై స్పష్టత.. ఆర్థిక సమస్యలు చాలా సంబంధాలలో విభేదాలకు కారణమవుతాయి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అప్పులు, సంపాదన, అలాగే గత భాగస్వామికి ఇస్తున్న లేదా పొందుతున్న భరణం వంటి విషయాలను కొత్త భాగస్వామితో వివరంగా చర్చించాలి. ఇద్దరి ఆర్థిక బాధ్యతలను ఎలా పంచుకుంటారో ముందే ఒక అవగాహనకు రావడం మంచిది. పిల్లల బాధ్యతలు , పెంపకం.. ఒకవేళ మొదటి పెళ్లి ద్వారా పిల్లలు ఉంటే, వారి విషయంలో పూర్తి స్పష్టత ఉండాలి. పిల్లల పెంపకం, వారి చదువు, కస్టడీ హక్కులు,  సమయం కేటాయించడం వంటి విషయాలపై కొత్త భాగస్వామి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. కొత్త భాగస్వామి మీ పిల్లలను ఎలా స్వీకరిస్తారు, వారి పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చాలా కీలకం. అలాగే, రాబోయే రోజుల్లో కొత్తగా పిల్లలను కనాలా వద్దా అనే అంశంపై కూడా ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. వ్యక్తిగత హద్దులు, ఆశించడాలు.. ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత ప్రాధాన్యతలు, సరిహద్దులు ఉంటాయి. కెరీర్, కుటుంబ సభ్యులతో సంబంధాలు, లైఫ్ స్టైల్, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలలో పరస్పరం ఏమేమి ఆశిస్తున్నారో స్పష్టంగా మాట్లాడుకోవాలి. మీ ఆలోచనలు, వారి ఆశయాలు సరిపోలుతున్నాయో లేదో గమనించాలి. సహనం ,  ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్.. మళ్లీ పెళ్లి చేసుకున్న కొత్తలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. చిన్న చిన్న విషయాలకు పాత భాగస్వామితో కొత్త వారిని పోల్చడం తప్పు. ప్రతి వ్యక్తి భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారని గుర్తుంచుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు దాచకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. విడాకులు జీవితానికి ముగింపు కాదు, అది ఒక కొత్త ఆలోచనకు, మార్పుకు ఆరంభం. ఆచితూచి అడుగులు వేస్తూ, పూర్తి మానసిక పరిపక్వతతో, స్పష్టమైన ఆలోచనలతో ముందడుగు వేస్తే రెండో పెళ్లి జీవితం మరింత సంతోషకరంగా, అర్ధవంతంగా మారుతుంది.                                     *రూపశ్రీ.  
  నేటి ఆధునిక కాలంలో యుక్తవయస్సు లేదా కౌమారదశ (Adolescence) లోకి అడుగుపెడుతున్న టీనేజర్ల మానసిక ఆరోగ్యం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకరమైన విషయంగా మారింది. అయితే, మానసిక సమస్యలు లేదా ప్రవర్తనా వైపరీత్యాలు కేవలం ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికో లేదా ఆర్థిక స్థాయికో పరిమితం కాలేదని, విభిన్న సామాజిక ఆర్థిక నేపథ్యాల (Socioeconomic Backgrounds) నుంచి వచ్చే టీనేజర్లలో ఇవి అత్యంత సాధారణంగా కనిపిస్తున్నాయని ఒక నూతన విస్తృత అధ్యయనం సంచలన నిజాలను బయటపెట్టింది. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి సామాజిక వర్గంలోని కౌమారదశ పిల్లలు తమ వయస్సుకు తగిన మానసిక ఒత్తిళ్లు, ఆందోళన (Anxiety), డిప్రెషన్ (Depression) మరియు ఇతర ప్రవర్తనా రుగ్మతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా తక్కువ సామాజిక ఆర్థిక స్థాయి లేదా పేదరికంలో పెరిగే పిల్లలు ఆర్థిక ఇబ్బందులు, సరైన వనరులు లేకపోవడం మరియు కుటుంబ ఒత్తిళ్ల వల్ల ఎక్కువ మానసిక సమస్యలకు గురవుతారని సమాజంలో బలమైన నమ్మకం ఉండేది. కానీ, తాజా పరిశోధనల ప్రకారం ఉన్నత సామాజిక ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన టీనేజర్లు సైతం సమాన స్థాయిలో లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని స్పష్టమైంది. పేదరికంలో ఉన్న పిల్లలకు వనరుల కొరత మరియు భద్రతా లేమి ప్రధాన సమస్యలుగా మారితే, ఉన్నత వర్గాల పిల్లలకు తల్లిదండ్రుల నుండి వచ్చే విపరీతమైన విద్యా ప్రతిభ ఒత్తిడి (Academic Pressure), సామాజిక గుర్తింపు పోటీ మరియు విలాసవంతమైన జీవనశైలి తెచ్చిపెట్టే ఒంటరితనం మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయి. టీనేజర్లలో కనిపించే ఈ మానసిక సమస్యలకు కేవలం ఆర్థిక అంశాలే కాకుండా, డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వాడకం, కుటుంబ సంబంధాలలో క్షీణత, నాణ్యమైన నిద్ర లేకపోవడం మరియు తోటివారి ఒత్తిడి (Peer Pressure) ప్రధాన హేతువులుగా మారుతున్నాయి. నిరంతరం స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గడపడం వల్ల ప్రతీ సామాజిక వర్గానికి చెందిన టీనేజర్లు తమ జీవితాలను ఇతరులతో పోల్చుకుంటూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇది వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచి, డిప్రెషన్ మరియు మానసిక రుగ్మతలకు బీజం వేస్తోంది. అంతేకాకుండా, బడి మరియు కళాశాల వాతావరణంలో పోటీ తత్వాన్ని తట్టుకోలేకపోవడం కూడా వీరి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ భయానక పరిస్థితి నుంచి కౌమారదశ పిల్లలను కాపాడుకోవడానికి సమాజం మరియు తల్లిదండ్రులు తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని మానసిక వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పిల్లల ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా, వారు చెప్పే మాటలను వినడం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు వారి ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గమనించడం అత్యంత ముఖ్యం. పాఠశాలల్లో నాణ్యమైన కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయులకు టీనేజర్ల మానసిక ఆరోగ్య సం సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం ద్వారా మానసిక రుగ్మతలను ప్రారంభంలోనే నివారించవచ్చు. ప్రతి ఇంట్లోనూ సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు డిజిటల్ డిటాక్స్ అలవాటు చేయడం వల్ల టీనేజర్లు మానసికంగా దృఢంగా తయారవుతారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.         Adolescent mental health study facts, causes of teen depression and anxiety.
  సిగరెట్ లేదా బీడీ కాల్చడం వల్ల కలిగే అనర్థాల గురించి నిరంతరం వింటూనే ఉంటాం. అయితే, మీరు పొగతాగకపోయినా సరే, పక్కన ఎవరైనా పొగ తాగుతుంటే ఆ పొగను పీల్చడం (Passive Smoking , Second hand Smoke) అంతకంటే తీవ్రమైన ప్రాణాంతక ముప్పుగా మారుతోందని ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య పత్రిక  లాన్సెట్  (The Lancet) ప్రచురించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. 1990 సంవత్సరం నుండి ఇప్పటివరకు భారతదేశంలో పరోక్ష ధూమపానం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిపోవడం ఆరోగ్య నిపుణులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ధూమపానం చేసేవారు విడుదల చేసే విషపూరితమైన పొగను తెలియకుండానే పీల్చడం వల్ల ఎందరో అమాయకులు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులు అకాల మరణాల బారిన పడుతుండటం కలవరపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం, ఒక్క 2023 సంవత్సరంలోనే భారతదేశంలో పరోక్ష పొగతాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య సమస్యలతో ఏకంగా 3,25,600 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, భారతదేశంలో ఇదే సంవత్సరంలో సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల 9.28 మిలియన్ల డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ (DALYs) నష్టం వాటిల్లింది. అంటే అనారోగ్యం, వైకల్యం లేదా అకాల మరణం కారణంగా ప్రజలు తమ జీవితంలో ఇన్ని మిలియన్ల ఆరోగ్యకరమైన సంవత్సరాలను కోల్పోయారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 2023 నాటికి ఏకంగా 2.71 బిలియన్ల మంది ప్రజలు పరోక్ష ధూమపానానికి గురవుతున్నారు. దీని ఫలితంగా ప్రపంచ స్థాయిలో ఏడాదికి 1.66 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతుండగా, 44.8 మిలియన్ల డాలీస్ నష్టం జరుగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే చైనా, భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల్లోనే అత్యధికంగా ప్రపంచ పరోక్ష ధూమపాన బాధితుల్లో సగం మంది ఉన్నారు. చైనాలో అత్యధికంగా 664 మిలియన్ల మంది ప్రజలు ఈ ప్రమాదకర పొగకు గురవుతుండడం గమనార్హం. పరోక్షంగా పీల్చే పొగ శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల ప్రధానంగా ఇస్కీమిక్ గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), రొమ్ము క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా మరియు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయని లాన్సెట్ అధ్యయనం తేల్చింది. ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులు తాగే పొగను పీల్చడం వల్ల చిన్న పిల్లల ఊపిరితిత్తుల ఎదుగుదల దెబ్బతిని, వారిలో తీవ్రమైన నిమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. మహిళలు కూడా ఈ పొగ బారిన పడి తీవ్ర గుండె సంబంధిత మరియు క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ భయానక పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి ప్రజల్లో తీవ్రమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారు తమ ఇల్లు, ఆఫీస్ మరియు బహిరంగ ప్రదేశాల్లో కాకుండా కేవలం నిర్దేశించిన ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లో మాత్రమే స్మోకింగ్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు ఉన్న ఇళ్లల్లో పొగతాగడం పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వాలు కూడా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు, పరోక్ష ధూమపానం తెచ్చే ముప్పుపై చైతన్యాన్ని విస్తృతంగా తీసుకెళ్లినప్పుడే లక్షలాది అమాయకుల ప్రాణాలను కాపాడుకోగలమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.       How secondhand smoke affects women and children, Lancet report on passive smoking deaths in India.
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా నీరసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా దీని ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడుతుంటారు, కానీ ఇవి ప్రతిసారీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఔషధాల ప్రమేయం లేకుండా, ఇంట్లోనే  రెండు  ప్రభావవంతమైన పద్ధతుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు రికమెండ్ చేస్తున్న ఈ చిట్కాలు ఏమిటో తెలుసుకుంటే.. హెర్బల్ స్టీమ్.. సాధారణ నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాసనాళాలు కాసేపు రిలాక్స్ అవుతాయి కానీ.. గట్టిగా ఉన్న కఫం కరగదు. నీటిలో కొన్ని రకాల సహజ మూలికలను చేర్చి ఆవిరి పట్టినప్పుడు, ఆ ఆవిరి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి కఫాన్ని సులభంగా కరిగిస్తుంది. కావాల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు.. 10 నుండి 12 తులసి ఆకులు..  10 నుండి 12 హిమాలయన్ పింక్ సాల్ట్..  1 టీస్పూన్ తురిమిన అల్లం..  అర అంగుళం నీరు.. ఆవిరి రావడానికి సరిపడా ఇందులోని పదార్థాల ప్రత్యేకత..  పుదీనాలో ఉండే మెంతోల్ శ్వాసనాళాలను తెరిచి కఫాన్ని పలుచన చేస్తుంది.  తులసిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నశింపజేసి, వాపును తగ్గిస్తాయి.  హిమాలయన్ ఉప్పు కఫాన్ని కరిగించడానికి తోడ్పడతుంది.   అల్లం గొంతు మంటను తగ్గించి శ్వాసకోశాల్లోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తయారీ , ఉపయోగించే విధానం.. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, ఆ వేడి నీటిలో పుదీనా, తులసి ఆకులు, హిమాలయన్ సాల్ట్ , తురిమిన అల్లం వేయాలి. వెంటనే పాత్రపై ఒక టవల్ మూసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఆ మూలికలలోని ఆరోమాటిక్ ఆయిల్స్ నీటిలోకి విడుదలవుతాయి. ఆ తర్వాత పాత్ర మూత తీసి, ముఖాన్ని   తగినంత దూరంలో ఉంచి, తలను టవల్‌తో లేదా దుప్పటితో  కప్పుకోవాలి. ముక్కు , నోటి ద్వారా లోతుగా శ్వాస తీసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫం త్వరగా కరిగిపోతుంది. డీప్ ఎక్స్‌పాన్షన్ బ్రీతింగ్ వ్యాయామం.. ఆవిరి పద్ధతితో పాటు డీప్  ఎక్స్‌పాన్షన్ ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని కలిపి చేసినప్పుడు ఫలితం మరింత వేగంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో చిక్కుకున్న కఫాన్ని పైకి నెట్టి, సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. చేసే విధానం.. మొదట ఒక కుర్చీలో నిటారుగా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాసను ఎంత వీలైతే అంత లోతుగా లోపలికి తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత, దానిని 3 నుండి 4 సెకన్ల పాటు ఊపిరితిత్తుల్లోనే పట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి, నాళాలకు అతుక్కుపోయిన కఫం వదులవుతుంది. తరువాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా చేసి, నోటి ద్వారా గాలిని బలంగా బయటకు వదలాలి. ఈ పద్ధతిని వరుసగా 5 నుండి 7 సార్లు పునరావృతం చేయాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. ముగింపు.. జలుబు, దగ్గు లేదా మొండి కఫంతో బాధపడుతున్నప్పుడు ఈ రెండు సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే ఊపిరితిత్తులు శుభ్రపడి, హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.                           *రూపశ్రీ.    
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అలాంటి వారికి శొంఠి పొడి (ఎండు అల్లం పొడి) ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో చెబుతారు. అయితే శొంఠిని సరైన మోతాదులో, సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా అల్లంతో పోలిస్తే ఎండు అల్లం లేదా శొంఠికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు శొంఠి ఎలా సహాయపడుతుంది? మజ్జిగలో పావు టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? పిల్లల నుంచి పెద్దల వరకు శొంఠిని ఎలా ఉపయోగించాలి? ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది? ఈ విషయాలపై ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. శొంఠి పొడి వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకునే సరైన విధానం, మోతాదు వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు శొంఠిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా ఇంటి చిట్కా లేదా ఆయుర్వేద పదార్థాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)