TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఊపిరితిత్తులు సైనస్‌లలో  కఫం పేరుకుపోయిందా  సహజ పద్ధతులలో ఇలా తొలగించుకోండి.. !

Published on: Mon Sep 7, 2026 7:01PM

వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా నీరసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా దీని ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడుతుంటారు, కానీ ఇవి ప్రతిసారీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఔషధాల ప్రమేయం లేకుండా, ఇంట్లోనే  రెండు  ప్రభావవంతమైన పద్ధతుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు రికమెండ్ చేస్తున్న ఈ చిట్కాలు ఏమిటో తెలుసుకుంటే..

హెర్బల్ స్టీమ్..

సాధారణ నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాసనాళాలు కాసేపు రిలాక్స్ అవుతాయి కానీ.. గట్టిగా ఉన్న కఫం కరగదు. నీటిలో కొన్ని రకాల సహజ మూలికలను చేర్చి ఆవిరి పట్టినప్పుడు, ఆ ఆవిరి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి కఫాన్ని సులభంగా కరిగిస్తుంది.

కావాల్సిన పదార్థాలు..

పుదీనా ఆకులు.. 10 నుండి 12

తులసి ఆకులు..  10 నుండి 12

హిమాలయన్ పింక్ సాల్ట్..  1 టీస్పూన్

తురిమిన అల్లం..  అర అంగుళం

నీరు.. ఆవిరి రావడానికి సరిపడా

ఇందులోని పదార్థాల ప్రత్యేకత..

 పుదీనాలో ఉండే మెంతోల్ శ్వాసనాళాలను తెరిచి కఫాన్ని పలుచన చేస్తుంది. 

తులసిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నశింపజేసి, వాపును తగ్గిస్తాయి. 

హిమాలయన్ ఉప్పు కఫాన్ని కరిగించడానికి తోడ్పడతుంది.  

అల్లం గొంతు మంటను తగ్గించి శ్వాసకోశాల్లోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

తయారీ , ఉపయోగించే విధానం..

ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, ఆ వేడి నీటిలో పుదీనా, తులసి ఆకులు, హిమాలయన్ సాల్ట్ , తురిమిన అల్లం వేయాలి. వెంటనే పాత్రపై ఒక టవల్ మూసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఆ మూలికలలోని ఆరోమాటిక్ ఆయిల్స్ నీటిలోకి విడుదలవుతాయి.

ఆ తర్వాత పాత్ర మూత తీసి, ముఖాన్ని   తగినంత దూరంలో ఉంచి, తలను టవల్‌తో లేదా దుప్పటితో  కప్పుకోవాలి. ముక్కు , నోటి ద్వారా లోతుగా శ్వాస తీసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చాలి.

రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫం త్వరగా కరిగిపోతుంది.

డీప్ ఎక్స్‌పాన్షన్ బ్రీతింగ్ వ్యాయామం..

ఆవిరి పద్ధతితో పాటు డీప్  ఎక్స్‌పాన్షన్ ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని కలిపి చేసినప్పుడు ఫలితం మరింత వేగంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో చిక్కుకున్న కఫాన్ని పైకి నెట్టి, సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది.

చేసే విధానం..

మొదట ఒక కుర్చీలో నిటారుగా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాసను ఎంత వీలైతే అంత లోతుగా లోపలికి తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత, దానిని 3 నుండి 4 సెకన్ల పాటు ఊపిరితిత్తుల్లోనే పట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి, నాళాలకు అతుక్కుపోయిన కఫం వదులవుతుంది.

తరువాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా చేసి, నోటి ద్వారా గాలిని బలంగా బయటకు వదలాలి. ఈ పద్ధతిని వరుసగా 5 నుండి 7 సార్లు పునరావృతం చేయాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది.

ముగింపు..

జలుబు, దగ్గు లేదా మొండి కఫంతో బాధపడుతున్నప్పుడు ఈ రెండు సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే ఊపిరితిత్తులు శుభ్రపడి, హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.

                          *రూపశ్రీ.