TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియా కూటమిలోకి జగన్?

Published on: Mon Sep 7, 2026 3:29PM

వైసీపీ ఇండియా కూటమిలో చేరబోతోందా? 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. కాంగ్రెస్ అండ వినా గత్యంతరం లేదని భావిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారని వైసీపీ వర్గాలూ చెబుతుతున్నాయి.  అందులో భాగంగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..   జాతీయ స్థాయిలో కీలకంగా మారిన  ఇండియా కూటమితో   జతకట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకుంటూ, రాబోయే కాలంలో అనుసరించాల్సిన విధానాలపై అయన విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను పదును పెడుతున్న జగన్.. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు.  ఇండియా కూటమితో భాగం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీయేయేతర పార్టీలతో సయోధ్య ఏర్పడుతుందనీ, తద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన గళం వినిపించే అవకాశం లభిస్తుందని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.  

 గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో  సయోధ్యతో వ్యవహరించిన జగన్.. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత.. బీజేపీతో ఎంతగా కలిసి సాగాలన్నా ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఉన్న చెలిమి కారణంగా వీలు కావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూపు ఇండియా కూటమి వైపు మళ్లిందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరినట్లైతే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ సహయ సహకారాలు అందుతాయనీ, అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

రాష్ట్రంలో  ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఏకైక విపక్షంగా క్షేత్రస్థాయిలో చేపట్టే ఆందోళనలకు మద్దతు లభించాలంటే.. ఇండియా కూటమి అండ అవసరమన్న భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు.  

 [Jagan Join INDIA Alliance, 2029 AP Elections, YCP political strategy, AP politicalnews, AP Politics, Telugu One]