TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీరు స్మోకింగ్ చేయకపోయినా క్యాన్సర్ వస్తుందా? నిపుణులు ఏం చెప్తున్నారంటే!

Published on: Tue Sep 8, 2026 11:24AM

 

సిగరెట్ లేదా బీడీ కాల్చడం వల్ల కలిగే అనర్థాల గురించి నిరంతరం వింటూనే ఉంటాం. అయితే, మీరు పొగతాగకపోయినా సరే, పక్కన ఎవరైనా పొగ తాగుతుంటే ఆ పొగను పీల్చడం (Passive Smoking , Second hand Smoke) అంతకంటే తీవ్రమైన ప్రాణాంతక ముప్పుగా మారుతోందని ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య పత్రిక  లాన్సెట్  (The Lancet) ప్రచురించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. 1990 సంవత్సరం నుండి ఇప్పటివరకు భారతదేశంలో పరోక్ష ధూమపానం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిపోవడం ఆరోగ్య నిపుణులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ధూమపానం చేసేవారు విడుదల చేసే విషపూరితమైన పొగను తెలియకుండానే పీల్చడం వల్ల ఎందరో అమాయకులు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులు అకాల మరణాల బారిన పడుతుండటం కలవరపెడుతోంది.

తాజా గణాంకాల ప్రకారం, ఒక్క 2023 సంవత్సరంలోనే భారతదేశంలో పరోక్ష పొగతాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య సమస్యలతో ఏకంగా 3,25,600 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, భారతదేశంలో ఇదే సంవత్సరంలో సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల 9.28 మిలియన్ల డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ (DALYs) నష్టం వాటిల్లింది. అంటే అనారోగ్యం, వైకల్యం లేదా అకాల మరణం కారణంగా ప్రజలు తమ జీవితంలో ఇన్ని మిలియన్ల ఆరోగ్యకరమైన సంవత్సరాలను కోల్పోయారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 2023 నాటికి ఏకంగా 2.71 బిలియన్ల మంది ప్రజలు పరోక్ష ధూమపానానికి గురవుతున్నారు. దీని ఫలితంగా ప్రపంచ స్థాయిలో ఏడాదికి 1.66 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతుండగా, 44.8 మిలియన్ల డాలీస్ నష్టం జరుగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే చైనా, భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల్లోనే అత్యధికంగా ప్రపంచ పరోక్ష ధూమపాన బాధితుల్లో సగం మంది ఉన్నారు. చైనాలో అత్యధికంగా 664 మిలియన్ల మంది ప్రజలు ఈ ప్రమాదకర పొగకు గురవుతుండడం గమనార్హం.

పరోక్షంగా పీల్చే పొగ శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల ప్రధానంగా ఇస్కీమిక్ గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), రొమ్ము క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా మరియు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయని లాన్సెట్ అధ్యయనం తేల్చింది. ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులు తాగే పొగను పీల్చడం వల్ల చిన్న పిల్లల ఊపిరితిత్తుల ఎదుగుదల దెబ్బతిని, వారిలో తీవ్రమైన నిమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. మహిళలు కూడా ఈ పొగ బారిన పడి తీవ్ర గుండె సంబంధిత మరియు క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారు.

ఈ భయానక పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి ప్రజల్లో తీవ్రమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారు తమ ఇల్లు, ఆఫీస్ మరియు బహిరంగ ప్రదేశాల్లో కాకుండా కేవలం నిర్దేశించిన ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లో మాత్రమే స్మోకింగ్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు ఉన్న ఇళ్లల్లో పొగతాగడం పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వాలు కూడా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు, పరోక్ష ధూమపానం తెచ్చే ముప్పుపై చైతన్యాన్ని విస్తృతంగా తీసుకెళ్లినప్పుడే లక్షలాది అమాయకుల ప్రాణాలను కాపాడుకోగలమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

 

 

How secondhand smoke affects women and children, Lancet report on passive smoking deaths in India.