వైసీపీలో రాజ్యసభ బెర్తుల కోసం గట్టి పోటీ.. రెడ్లలో అవకాశం ఎవరికి?

ఏపీలో అధికార వైసీపీలో రాజ్యసభ స్ధానాల కోసం గట్టిపోటీ నెలకొంది. ఏప్రిల్ లో ఖాళీ అయ్యే నాలుగు స్ధానాలను వైసీపీ గెల్చుకునే అవకాశం ఉండటంతో వీటిని ఎవరికివ్వాలనే విషయంలో సీఎం జగన్ తేల్చుకోలేకపోతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కొందరు, సామాజిక వర్గాల వారీగా మరికొందరు ఆశావహుల జాబితాలో ఉన్నారు వీరిని కాదని రోజుకొకరు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటూ కొత్తగా ఈ జాబితాలో చేరుతున్నారు. దీంతో పార్టీ మూలస్తంభాలైన రెడ్లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున 50 మంది రెడ్డి సామాజికవర్గం నేతలు గెలిచారు. వీరిలో దాదాపు సగం మంది పార్టీలో సీనియర్లు కావడమో లేకపోతే సీఎం జగన్ కు దగ్గరి బంధువులో, అధికారంలోకి రాముందు పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న వారో ఉన్నారు. వీరంతా కేబినెట్ బెర్తులు ఆశించారు. అయితే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాల్సి రావడంతో వీరిలో చాలామంది నిరాశకు గురయ్యారు. అదే సమయంలో ఎంపీ సీట్లకు సర్దుబాట్లలో భాగంగా బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి వారికి టికెట్లు దక్కలేదు. దీంతో వారంతా జగన్ మీద భారం వేసి పార్టీ చెప్పినట్లు నడుచుకుంటున్నారు.

వాస్తవానికి గత ఎన్నికల సమయంలో టికెట్లు రాకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే చాలు తమ పంట పండినట్లే అని భావించిన వారంతా నామినేటెడ్ పదవులు కూడా పూర్తి స్దాయిలో భర్తీ కాకపోవడంతో అసంతృప్తిలో మునిగిపోయారు. వీరిని బుజ్జగించేందుకు సీఎం జగన్ పలుమార్లు క్యాంప్ ఆఫీసుకు వారిని పిలిపించుకుని మాట్లాడారు. అయితే మంత్రి పదవి రాకపోయినా త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్ధానాలు ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు. అయితే ఈసారి ఏప్రిల్ లో ఖాళీ అయ్యే నాలుగు స్ధానాల్లో ఓసీ, బీసీ, ఎస్సీ లకు మూడు సీట్లు కేటాయించాలని జగన్ భావిస్తున్నారు. మరొకటి పరిస్ధితిని బట్టి అవకాశం కల్పించనున్నారు. దీంతో ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా పోటీ మొదలైంది. బీసీ, ఎస్సీల పరిస్దితి ఎలా ఉన్నా పార్టీకి అందరి కంటే ఎక్కువగా అండగా నిలిచిన రెడ్లు మాత్రం ఓసీ కోటాలో తమకు అవకాశం కల్పించాల్సిందేనని జగన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రెడ్లలో ఎవరికివ్వాలనే అంశంలో జగన్ కు పెను సవాలే ఎదురవుతోంది.

రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రధానంగా ముగ్గురు రేసులో ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపిగా పనిచేసి ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డి కోసం తన సీటును త్యాగం చేసిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం రేసులో అందరి కంటే ముందున్నారు. జగన్ హామీతో ఎంపీ సీటు త్యాగం చేసిన వైవీకి కీలకమైన టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. తనకు ఎంపీ పదవి కూడా కావాలని సుబ్బారెడ్డి కోరుతున్నారు. మరోవైపు 2014లో నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి తన బావ మోదుగుల వేణుగోపాలరెడ్డి చేతిలో ఓడిపోయిన పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి .. ఈసారి జగన్ హామీ మేరకు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో రెడ్ల జాబితాలో ఆయనకు అవకాశం దక్కుతుందో తేదో చూడాలి. అటు ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేటకు బదులుగా గుంటూరు నుంచి బరిలోకి దిగి నాలుగు వేల ఓట్ల స్వల్ప తేడాతో గల్లా జయదేవ్ చేతిలో ఓటమిపాలైన మోదుగుల వేణుగోపాల రెడ్డి కూడా ఓసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మిగిలిన వారు కూడా తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నా వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.