రెహమాన్ కు సంజాయిషీ నోటీసు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికల విజయానంతరం అత్యుత్సాహంతో రివాల్వర్ పేల్చిన రహమాన్ ను ఆ పార్టీ సంజాయిషీ కోరనున్నది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ అయిన రహమాన్ 15వ తేదీన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయోత్సవంలో తన లైసెన్స్ రివాల్వర్ తో అయిదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఆయనకు బెయిల్ దక్కిందిగానీ పార్టీ మాత్రం సంజాయిషీ కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న జిల్లా కన్వీనర్ల సమావేశంలో రెహమాన్ ను సంజాయిషీ కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విజయోత్సవాన్ని బీహార్ విజయోత్సవాలతో పోల్చడం, బీహార్ తరహా రాజకీయాలకు ఇది నాంది అని పలు పక్షాలనేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే రెహమాన్ పిస్టల్ మిస్ ఫైర్ అయిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. విజయోత్సవ గందరగోళంలో తన వద్దనున్న తుపాకీ పేలవచ్చని భావించిన రెహమాన్ పిస్టల్ ను చేయితో పైకెత్తి పట్టుకున్నారని, దీంతో తోపులాటలో తుపాకీ పేలిందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కేసు, సంజాయిషీ ఎల ఉన్నా రాష్ట్రరాజకీయాల్లో కొత్త సంస్కృతి ప్రారంభమైందని చెప్పవచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu