దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం! యువరక్తమే పరిష్కార మార్గం?

సరిగ్గా 31ఏళ్ళ క్రితం ... ఓ తెలుగుతేజం రాజకీయ సంచలనానికి నాందీప్రస్తావన పలికింది. అదీ వెండితెర వెలుగుగా కీర్తిపతాకాన్ని పొందినా ప్రజాసేవకోసం రాజకీయ తెరంగ్రేటం చేసింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ప్రపంచవ్యాప్త మన్ననలు అందుకున్న నందమూరి తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి 1982లో తెలుగుదేశంపార్టీని నెలకొల్పారు. ఆయన ఎంత సంచలనంగా నిర్ణయం తీసుకుని పార్టీ స్థాపించారో అంతే సంచలన మైన స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించి గద్దెనెక్కారు. ముందునుంచి నటనతో పాటు ప్రజాజీవితానికి దగ్గరగా పనిచేసిన అనుభవాన్నీ రంగరించి పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఒంటిచేత్తో శాసించారు. ఆనాటి రామారావు ఒక సంచలనానికి వేదిక. ఆయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ యావత్తు గెలిపించుకున్న ధృవతారగా కీర్తినందు కున్నారు. గద్దెనెక్కిన తొలినాళ్ళలోనే ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని పొందిన నాదెండ్ల భాస్కరరావును ప్రజాతీర్పుతో తిప్పికొట్టారు. కానీ, చివరకి తన సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో పరాభవానికి గురై తీవ్రవేదనతో కన్నుమూశారు. ఈ 31ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆ పార్టీ మాత్రం చిరస్థాయిగానే నిలిచిపోయింది. అయితే ఎన్టీఆర్ లా ఒంటిచేత్తో గెలిపించుకునే సత్తా ఉన్న నాయకుని కొరతతోనే సతమతమవుతోంది. 14ఏళ్ళ అధికారం, 17ఏళ్ళ ప్రతిపక్షహోదాతో ఇప్పుడు తామేస్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు పొలిట్ బ్యూరో సభ్యుల ముందు పార్టీ నిలిచింది.

 

నాటి చరిష్మాగానీ, ఆకట్టుకునే పథకాలు కానీ ఇప్పుడు ఆ పార్టీకి లేవు. అందుకే 2012 ఉపఎన్నికల్లో ఎంతో జూనియర్ అనుకున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి దెబ్బకు కంగుతింది. 18 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన ఈ ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటీ సాధించాలేకపోవటానికి సరైన కారణం వెదికేందుకు కసరత్తులు చేస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ బొమ్మనే పూర్తిగా చెరిపేసింది. అంతేకాకుండా ఆయన కుటుంబానికీ ఈ పార్టీ దూరమైంది. ఎన్టీఆర్ ఏ పార్టీనైతే విమర్శించారో ఆ పార్టీలోనే అంటే కాంగ్రెస్ లో దగ్గుబాటి పురందరేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఈమె ఎన్టీఆర్ కుమార్తె. ఆయన భార్య లక్ష్మీపార్వతి ఇప్పుడు జగన్ పంచన చేరింది. ఆమె ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు.

 

అలానే ఎన్టీఆర్ రూపురేఖలలో తీసిపోని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్, కుమారుడు హరికృష్ణ మరో కుమారుడు బాలకృష్ణ ఎవరూ కూడా పార్టీ తరపున ప్రచార బాధ్యతలు తీసుకోలేదు. బాబు రమ్మంటేనే ప్రచారానికి వస్తామని అంటున్నారు. ఇటీవల ఉపఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడులుకోవటమే కాకుండా కేవలం జగన్ పై దూషణలకె చంద్రబాబు పరిమితమయ్యారు. తమకున్న అజెండాను బయటపెట్టలేకపోయారు. ప్రత్యేకమైన హీమీలు ఇవ్వలేకపోయారు. స్థానికంగా ఉన్న సమస్యలు బయటపెట్టలేకపోయారు. స్థానికంగా ఉండే సీనియర్లకు పెద్దపీట వేసే ధోరణిని మరచిపోయారు. స్థానికంగా ఉండే స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు వంటివాటిని ఆకర్షించేందుకు కసరత్తులు చేయలేకపోయారు. తమకు మహిళలంటే ఉన్న గౌరవాన్ని చాతుకునేలా గతంలో ప్రసంగించిన చంద్రబాబు రాజకీయంగా ఎదిగి ఆ మహిళల గురించి మాట్లాడటమే మానేశారేమిటన్న ప్రశ్న చంద్రబాబు పర్యటించిన ప్రతీప్రాంతంలోనూ వినిపించింది.

 

ఇంకో విచిత్రమేమంటే రోడ్డుషో పేరిట చేసే ప్రసంగాల్లో సమగ్రతను కోల్పోయిన చంద్రబాబునే ఓటర్లు చూశారు. అప్పట్లో మాదిరిగా సమస్యలపై కూలంకుషంగా మాట్లాడే నేర్పున్న బాబును ఈసారి ఓటర్లు గమనించలేదు. అలానే ఎవరైనా పార్టీ మారితే సస్పెన్షన్, క్రమశిక్షణ తప్పదని హెచ్చరించే బాబు ఈ మధ్యనే బుజ్జగించటం మొదలుపెట్టారు. తనకు వయస్సు పెరుగుతోంది కాబట్టి బాబు సీరియస్ గా క్రమశిక్షణ వదిలేశారు. గతంలో ఈ క్రమశిక్షణకె జడిసి అభ్యర్థులూ, ప్రజలూ, ఉద్యోగులూ ఆయనకు సహకరించారు. అధికారం కోల్పోయాక ఆ గత అనుభవాన్ని మరిచిపోయిన చంద్రబాబు తన పార్టీ యువరక్తంతో నింపేందుకు ప్రయత్నిస్తేనే బాగుంటుంది. అలా అని తన కుమారుడు లోకేష్ ఒక్కరితోనే రాజకీయరంగ ప్రవేశం చేయించకుండా ఇంకా యువరక్తంతో పార్టీని నింపేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది. ఆసక్తి ఉన్న యువకులను చంద్రబాబు ముందుగా ఆహ్వానిస్తే రాజకీయాల్లో వారు రాణిస్తే ఆయన కూడా అధికారం పొందేందుకు అవకాశాలు ఉంటాయి కదా! మరి బాబేమిటో ఈ దిశగా ఆలోచించటం లేదంటున్నారు. ఉపఎన్నికల్లో దేశం ఓటమికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. ఏమైనా చరిష్మా ఉన్నవారికి దేశం స్వాగతం పలికితే బాగుంటుందని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu