వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేతగా విజయమ్మ ఎన్నిక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ విజయలక్ష్మిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం భేటీ అయిన ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభ స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదిహేడు మంది ఎమ్మెల్యేలున్న తమ పార్టీకి శాసనసభ ఆవరణలో కార్యాలయాన్ని కేటాయించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరనున్నారు.


 

గతంలో ప్రజారాజ్యం పార్టీకి కేటాయించిన కార్యాలయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన విషయం తెలిసిందే. ఇలా ఉండగా పశు సంవర్ధక శాఖ మంత్రి పి విశ్వరూప్ కుమారుడు కృష్ణ బుధవారం చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. ఇది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి విశ్వరూప్ కుమారుడు మొదటి నుంచి జగన్ పట్ల అభిమానంతో ఉంటున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu