గర్వం వెనుకే నాశనం... జగన్ వైఖరిపై విమర్శలు

 

గర్వం వెనుకే నాశనం కూడా ఉంటుందనే సామెత ఉంది. అంటే గర్వం తలకెక్కితే నాశనం కూడా దానంతట అదే వస్తుందని దాని అర్ధం. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ప్రస్తుతం అలాగే ఉందనే టాక్ వినిపిస్తోంది. జగన్ తీరును గమనిస్తే గర్వాన్ని తలకెక్కించుకున్నట్లే కనిపిస్తోందంటున్నారు. కేవలం తన ఒక్కడి వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందని... ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా... తన వల్లే గెలిచారని... ప్రజలు కేవలం తనను చూసే ఓట్లేశారనే భావన జగన్ లో కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుందని అంటున్నారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడే తీరును గమనిస్తే ఇతరులకు ఇది స్పష్టంగా కనిపిస్తుందని మాట్లాడుకుంటున్నారు.

ప్రభుత్వ ప్రకటనల్లోనూ... సంక్షేమ పథకాల్లోనూ... కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటో మాత్రమే వాడాలని... ఆయా శాఖల మంత్రుల ఫొటోలను వినియోగించొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం వెనుక జగన్ ఉద్దేశం ఇదేనని అంటున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటోతోపాటు... ఆయా శాఖల మంత్రుల ఫొటోలను పెట్టడం ఆనవాయితీ. అయితే, జగన్ మాత్రం అందుకు భిన్నంగా తన ఫొటో ఒక్కటి మాత్రమే ఉండాలని ఆదేశించడం వెనుక ... అంతా తానే అన్నట్లుగా వైఖరి ఉందని భావిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి రావడానికి ముమ్మాటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణం. వైసీపీ గెలుపులో ప్రధాన వాటా కచ్చితంగా జగన్ దే అయినప్పటికీ... ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచినవాళ్ల పాత్ర అస్సలు లేదనడం పొరపాటే అవుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నట్లుగా దమ్మున్న లీడర్లు వంద మంది గెలిస్తేనే ... జగన్ అయినా... చంద్రబాబు అయినా ముఖ్యమంత్రి కాగలుగుతారు. ఇది మర్చిపోయి మొత్తం అంతా తానే... వందకి వంద శాతం తనకే దక్కాలనుకోవడం సరికాదని అంటున్నారు. ఇలాగైతే ముందుముందు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల ఉనికే ప్రశ్నార్ధకమవుతుందని, చివరికి అది ఎన్నికల్లో గెలుపోటములపై  తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. 

నేనే గెలిపించాను... నేనే కనిపించాలనే ధోరణి అస్సలు మంచిది కాదని... కనీసం మంత్రులకైనా పాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించాలనే మాట వినిపిస్తోంది. అయితే, సుప్రీం గైడ్ లైన్స్ పేరుతో మంత్రులకు ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నారని, కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారు. 2015లో ప్రభుత్వ ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు మాత్రమే ఉండాలని సుప్రీం ఆదేశాలిచ్చినా... ఆ ఉత్తర్వుల్ని సవరిస్తూ 2016లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రుల ఫొటోలకు కూడా అనుమతించిందని అధికారులు గుర్తుచేస్తున్నారు. కానీ, జగన్ సర్కారు మాత్రం... సుప్రీం ఉత్తర్వుల పేరుతో ప్రభుత్వ యాడ్స్ లో మంత్రుల ఫొటోలు లేకుండా చేస్తోందని, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ యాడ్స్ లో కూడా మంత్రుల ఫొటోలను ముద్రిస్తున్నారని... ఇక చంద్రబాబు కూడా తన హయాంలో మంత్రుల ఫొటోలకు స్థానం కల్పించారని... కానీ జగన్ అందుకు భిన్నంగా... తన సహచర మంత్రుల ఫొటోలను పక్కనబెట్టడం మంచిది కాదని, ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని అంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా... కనీసం మంత్రులకైనా పాలనలో భాగస్వామ్యం కల్పించాలని సూచిస్తున్నారు.