బీజేపీతో దోస్తీ కోసమేనా జగన్ ఢిల్లీ పర్యటన..?

తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాంయిపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలువరించాలని కోరుతూ జగన్ అండ్ కో ఢిల్లీ బాట పట్టారు. దీనికి ఆయన "సేవ్ డెమోక్రసి" అని పేరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ లెవల్ లీడర్లను కలుస్తూ చంద్రబాబు నాయుడి మీద కంప్లైంట్ చేస్తున్నారు. అయితే పైకి సేవ్ డెమోక్రసి అయినా లోపల మాత్రం జగన్ ఉద్దేశ్యం వేరే ఉంది. చంద్రబాబును ఎన్డీఏ నుంచి దూరం చేసి తాను ఆ లోటు పూడ్చాలని భావిస్తున్నారు జగన్. దానితో పాటు చంద్రబాబు స్పీడును తట్టుకోవడం తన వల్ల కాదని జగన్ గ్రహించారు. అందుకే ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకుని ఆయన సపోర్ట్‌తో బాబును ఢీకొట్టాలని యువనేత ప్లాన్.

 

ఏపీలో 2014 నాటి బీజేపీ-టీడీపీ బంధం రోజు రోజుకి చెడిపోతోంది. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ సహా పలు అంశాల్లో బీజేపీ వైఖరిపై టీడీపీ లోలోపల రగిలిపోతోంది. కానీ బయటకు మాత్రం భాయిభాయి అనుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్ బీజేపీకి దగ్గరవుతున్నారు. ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వదిలి టీడీపీ గూటికి చేరుతుండటంతో సలహా ఇచ్చే నాధుడు లేక కష్టాల్లో ఉన్న జగన్‌ని ఆదుకోవడానికి "మైనింగ్ రాజా" గాలి జనార్థన్ రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలను పార్టీలోకి మారకుండా చేయడంతో పాటు జగన్‌తో బీజేపీ మైత్రిని కుదిర్చే పనిలో గాలి పావులు కదుపుతున్నాడు. ఎందుకంటే గాలి జనార్థన్ రెడ్డి క్రిమినల్ అయినప్పటికి బీజేపీ అథిష్టానం వద్ద ఆయనకు వేయిటేజీ ఉంది. ఆ పలుకుబడితోనే గాలి.. జగన్‌ని కమలానికి దగ్గర చేస్తున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జగన్ భేటీ అయ్యేందుకు గాలి తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

అటు బీజేపీ కూడా బాబు విషయంలో అంత సాఫ్ట్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఇకపై తెలంగాణలో టీడీపీ విషయంలో అంటకాగడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే అంచానికి వచ్చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని పట్టుకుని వేలాడటం వల్ల ఉపయోగం లేదనే భావన కూడా బీజేపీలో పెరిగిపోయింది. అయితే ఇక్కడ బీజేపీతో చంద్రబాబు మైత్రి కోరుకుంటున్నారు..ఆంధ్రప్రదేశ్‌కి మీరేమీ ఇవ్వనక్కర్లేదు-నేను మేనేజ్ చేసుకుంటాను..అని బీజేపీకి, చంద్రబాబు హామి ఇచ్చినట్టుగా ఉంది ముఖ్యమంత్రిగారి పరిస్థితి. దీన్ని బట్టి ఇప్పటికిప్పుడు టీడీపీ-బీజేపీ విడిపోతాయని అనుకోవడానికి వీల్లేదు. అయితే ఏటోచ్చి ఎటు పోయినా సేఫ్ సైడ్‌లో ఉండాలని బీజేపీ ప్లాన్. అందుకే తెలంగాణలో కేసీఆర్‌ను..ఏపీలో జగన్‌ను లైన్‌లో పెట్టుకుంటోంది కమలం.

 

ఇక జగన్ పరిస్థితి చూస్తే అధికారం ఎలాగూ లేదు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. పైగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై ఉన్న పాత కేసులను  చంద్రబాబు మళ్లీ తిరగ తోడుతారేమోనని జగన్ భయపడుతున్నారు. ఆ ప్రమాదాన్ని ముందే ఊహించిన జగన్ అంతకు ముందే బీజేపీ వద్ద మోకరిల్లాలని భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అండ లేకుండా బాబు ఏం చేయలేరు కాబట్టి. మరి బీజేపీ బాబుతో కటీఫ్ చేసుకుంటుందా? లేక జగన్‌తో దోస్తీ కుదుర్చుకుంటుందా అనేది వేచి చూడాలి.