జగన్‌తో ఢిల్లీ వెళ్లాల్సిన 8 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ బృందంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదు. 44 మంది ఎమ్మెల్యేలు విమానం ఎక్కగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసలు విమానమే ఎక్కలేదు. వీరిలో కిడారి సర్వేశ్వరరావు(అరకు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి),  బుడ్డా రాజశేఖర్ రెడ్డి ( శ్రీశైలం), పోతుల రామారావు (కందుకూరు), అమర్‌నాథ్ రెడ్డి (పలమనేరు), శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), రామచంద్రారెడ్డి ( పీలేరు), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి) ఉన్నారు.

 

వీరిలో అమరనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ బృందంలో కనిపించలేదు.తాత మరణంతో నిన్న ఉదయం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన చెవిరెడ్డి తిరిగి రాత్రికల్లా ఢిల్లీ చేరుకున్నారు. ఇకపోతే కిడారి, గొట్టిపాటి, బుడ్డా. పోతుల కనిపించని వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే నిన్న ఫ్లైట్ ఎక్కలేదని ప్రచారం జరుగుతోంది.