చలికాలంలోనే జలుబు ఎందుకు చేస్తుంది?

 

సంక్రాంతి దాటిపోయింది. అయినా చలి ఇంకా వణికిస్తూనే ఉంది. ఎవరిని చూసినా తుమ్ముతూ, దగ్గుతూ కనిపిస్తున్నారు. ఇంతకీ చలికాలంలోనే ఈ జలుబు ఎందుకిలా బాధిస్తుంది... అంటే అబ్బో దానికి చాలా సమాధానాలే చెబుతున్నారు నిపుణులు.

 

ఇంట్లోనే ఉండపోవడం

 

చలిగాలుల్లో బయటతిరగడంకంటే తలుపులన్నీ బిడాయించుకుని నాలుగు గోడల మధ్యే ఉండిపోవడమే ప్రమాదకరం అంటున్నారు. దీని వలన సూక్ష్మక్రిములు ఆ నాలుగు గోడల మధ్యే తిష్ట వేసుకుని ఎప్పుడు మన శరీరంలోకి ప్రవేశిద్దామా అని వేచి చూస్తుంటాయి. ఇదే సమయంలో మనతోపాటుగా ఉండే మరెవరికన్నా జలుబుకి సంబంధించిన వైరస్ సోకితే అది మనకు కూడా చేరే ప్రమాదం ఉంటుంది.

 

ముక్కులో మార్పులు

 

చిత్రంగా తోచినా ఇది జలుబుకి చాలా ముఖ్యమైన కారణం. బయట ఉండే చలిగాలిని పీల్చుకునే సమయంలో మన ముక్కులోని రక్తనాళాలు కొంత కుంచించుకుపోతాయి. ఒంట్లో ఉన్న వేడిని కాపాడుకునేందుకే ఇలా ముక్కులోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. కానీ ఇలా జరగడం వల్ల తెల్ల రక్తకణాలు మన ముక్కులోపలికి ప్రవేశిస్తున్న వైరస్ మీద దాడి చేసే అవకాశం తగ్గిపోతుందట. తద్వారా జబులు వైరస్ దర్జాగా మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది. మనిషి తడిసిపోయి ఉన్నప్పుడు త్వరగా జలుబు చేసే అవకాశానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అంతేకాదు! ముక్కుకి ఏదన్నా మఫ్లర్లాంటి రక్షణ ఉన్నప్పుడు జలుబు సోకకపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చు.

 

రోగనిరోధకశక్తిలో మార్పులు

 

కాలంతో పాటుగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని తేలింది. మన డీఎన్ఏలో మార్పులు రావడం, రోగనిరోధకశక్తి క్షీణించడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. పైగా ఈ సమయంలో సూర్యరశ్మి నుంచి విటమిన్ డి కూడా తక్కువగానే అందుతుంది. విటమిన్ డి లోపం మనలోని రోగనిరోధకశక్తిని మరింతగా క్రుంగతీస్తుంది. ఫలితంగా జలుబుని వ్యాపించే వైరస్లు మనమీద దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 

పొడిబారిన వాతావరణం

 

చలికాలంలో వాతావరణం పొడిబారిపోయి ఉంటుంది. దీని వలన సూక్ష్మక్రిములకు రెండు రకాల లాభాలు కలుగుతాయి. చలి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు వైరస్ల మీద ఓ రక్షణ కవచం ఏర్పడుతుందట. దీని వల్ల అవి వేగంగా, చురుగ్గా వ్యాప్తిచెందుతాయి. ఇక రెండో లాభం ఏమిటంటే... పొడివాతావరణంలో ఎవరన్నా దగ్గినా, తుమ్మినా అందులోని సూక్ష్మక్రిములు చిన్నచిన్న కణాలుగా విడిపోయి గాలిలో రోజుల తరబడి నిలిచి ఉండిపోతాయి.

 

అదీ విషయం! కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో, జలుబు చేయడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. అంతేకానీ చాలామంది అనుకుంటున్నట్లు కేవలం చలి వల్లే జలుబు చేయదు. తగిన వ్యాయామం చేయడం, తరచూ నీరు తాగడం, మంచి పోషకాహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఆ మాయదారి జలుబు నుంచి తప్పించుకోవచ్చు.

- నిర్జర.