సెల్ ఫోన్ రీచార్జీ ధరలు తగ్గుతాయా?
posted on Oct 28, 2024 4:19PM

టెలికాం సంస్థలు త్వరలో సెల్ ఫోన్ రీచార్జీ ధరలను తగ్గించే అవకాశాలున్నాయా అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. టెలికాం సంస్థలు సంస్కరణల బాట పట్టాయి. తమ లైసెన్స్ ఫీజులు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వారి డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే సర్వీస్ ప్రొవైడర్లు రీచార్జి ధరలను తగ్గించే అవకాశం ఉంది.
ఎయిర్ టెల్, జియో, వీఐ రీచార్జ్ ప్లన్ లు తగ్గించేందుకు సర్వీస్ ప్రొవైడర్లు సుముఖంగా ఉన్నారు. ఇటీవల రీచార్జ్ ధరలను పెంచడంతో చాలా మంది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు షిప్ట్ అయిపోయారు. ఇదే ఒరవడి ముందు ముందు కొనసాగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో ప్రైవేటు టెలికాం సంస్థలు సంస్కరణల బాట పట్టాయి. అవి కోరినట్లుగా కేంద్రం వాటి లైసెన్సు ఫీజును తగ్గించేందుకు అంగీకరిస్తే రీచార్జ్ ధరలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రైవేటు టెలికాం సంస్థలు చెబుతున్నాయి.
ఇప్పటికే వీటికి ప్రాతినిథ్యం వహిస్తున్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) టెలికాం ఆపరేటర్లపై విధించే లైసెన్స్ ఫీజును తగ్గించాలని అధికారికంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్థూల ఆదాయంలో ఎనిమిది శాతంగా ఉన్న ప్రస్తుత లైసెన్స్ ఫీజును ఒక శాతానికి తగ్గించాలని సీఓఏఐ కేంద్రాన్ని కోరింది. అలా తగ్గిస్తే నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌లు, విస్తరణలు సులభతరం అవుతాయని చెబుతోంది.