చరిత్రలో కలుస్తున్న 135 ఏండ్ల సెంట్రల్ జైలు

హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న సచివాలయం నేలమట్టం అయింది... ఇప్పుడు అదేబాటలో తెలంగాణ రాష్ట్రంలో మరో చరిత్రాత్మక కట్టడం కనుమరుగు కానుంది.135 ఏళ్ల కాలం నాటి వరంగల్ ప్రాంతీయ కారాగారం కథ ముగిసిపోతోంది. సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ సర్కార్... చకాచకా అడుగులు వేస్తోంది. సర్కార్ ఆదేశాలతో జైలును ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బంది ఖైదీలను తరలించే పని మొదలుపెట్టారు. మంగళవారం తొలి రోజు పటిష్ట భద్రత నడుమ 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లికి తరలించారు. అందులో 80 మంది పురుషులు 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. జైలు నుంచి తరలి వెళ్లే సమయంలో పలువురు మహిళా ఖైదీలు కంటతడి పెట్టారు.

జైలులో వెయ్యి మంది ఉండేలా ఏర్పాట్లు ఉండగా, ప్రస్తుతం 27 బ్యార‌క్​లలో 956 మంది జైలులో ఉన్నారు. బ్యార‌క్‌లే కాకుండా అధికారుల‌కు, సిబ్బందికి వ‌స‌తి గృహాలు కూడా లోప‌లే నిర్మించారు. ఖైదీల ఆరోగ్య ప‌రిరక్షణకు 70 ప‌డ‌క‌ల ఆస్పత్రి కూడా ఉంది. వరంగల్ కేంద్ర కారాగారంలోని ఖైదీలను హైదరాబాద్​లోని చర్లపల్లి, చంచల్​గూడాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 నుంచి 20 రోజుల్లోగా వరంగల్ కేంద్ర కారాగారాన్ని పూర్తిగా తరలిస్తామని జైళ్ల శాఖ డీజీ రాజీవ్​త్రివేది  చెప్పారు. 267 మంది జైలు సిబ్బంది ఉండగా, వారి ఇష్టానుసారంగా అనుకూలమైన చోటుకు ట్రాన్స్​ఫర్​ చేస్తామన్నారు. మామునూరు ప్రాంతంలో అత్యాధునిక హంగులతో అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త జైలును రెండేళ్లలోగా నిర్మించనున్నామని తెలిపారు. 

వరంగల్ సెంట్రల్ జైలుకు 135 ఏండ్ల చరిత్ర ఉంది మొత్తం 54.5 ఎక‌రాల్లో విస్తరించి ఉన్న సెంట్రల్​ జైలును 1886 లో నిర్మించారు. వ‌రంగ‌ల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఆటోన‌గ‌ర్‌కు వెళ్లే ర‌హ‌దారిని ఆనుకుని, కేఎంసీ కాంపౌండ్ వాల్ వ‌ర‌కు రోడ్డుపొడ‌వునా కేంద్ర కారాగారం విస్తరించి ఉంది. దాదాపు అర కిలోమీట‌ర్ మేర ర‌హ‌దారి ప్రశాంతంగా క‌నిపిస్తూ ఉంటుంది. 

సెంట్రల్​ జైలులో అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు ఎంతో మంది కాలం గడిపారు. ప్రస్తుత సీనియర్​ రాజకీయ నాయకులు, ఎంతో మంది తెలంగాణ ఉద్యమ నాయకులు కూడా అందులో శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. జైలు అధికారులు కేవ‌లం శిక్ష అనుభవించ‌డానికే కాకుండా ఖైదీల్లో ప‌రివ‌ర్తన తీసుకొచ్చే విధంగా స‌మూల మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఖైదీల‌తో వ్యవసాయం, ఇత‌ర ప‌నులు చేయించ‌డ‌మే కాకుండా వారికి ప్రతిఫలం కూడా అందిస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల పెట్రోల్‌ బంక్ కూడా ఏర్పాటు చేశారు. శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌తోపాటు, విడుద‌లైన వారికి ఈ బంక్‌లో ఉపాధి క‌ల్పిస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో మాస్కులు, శానిటైజ‌ర్లు, ఫినాయిల్ లాంటివి త‌యారు చేయిస్తూ విక్రయిస్తున్నారు. అంతేకాదు దుప్పట్లు, కార్పెట్లు కూడా ప్రత్యే ఔట్‌లెట్ ఏర్పాటు చేసి ఖైదీల చేత విక్రయిస్తుంటారు. 

వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలో వివిధ నేరాల కింద శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకోవ‌డానికి ఇక నుంచి ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. జైలు త‌ర‌లింపు నేప‌థ్యంలో ఖైదీల‌కు ఇత‌ర జిల్లాల్లోని జైళ్లలో ఆవాసం కల్పిస్తారు. ఇక‌మీద‌ట వారిని కుటుంబ సభ్యులు క‌లుసుకోవాలంటే.. ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వ‌నుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu