వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకి రంగం సిద్దం

 

వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు క్రమంగా మార్గం సుగమం అవుతోంది. దాని ఏర్పాటు కోసం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఫలించింది. వైజాగ్-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అవసరమయిన ఆర్ధిక సహాయం రుణంగా అందిస్తామని ముందుకు వచ్చిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతం అవ్వడంతో, రాష్ట్ర ప్రభుత్వానికి 900 మిలయన్ అమెరికన్ డాలర్ల ఋణం అందించేందుకు ఏడీబీ అంగీకరించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనకు సూచన ప్రాయంగా ఆమోదం తెలపడంతో వైజాగ్-చెన్నై మధ్య ఈ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లే భావించవచ్చును.

 

ఏడీబీ రాష్ట్ర ప్రభుత్వానికి 900 మిలయన్ డాలర్ల ఋణం అందిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో 100 మిలియన్ డాలర్లను జత చేస్తుంది. ఆ మొత్తంతో వైజాగ్-చెన్నై చెన్నైమధ్య ఈ పారిశ్రామిక కారిడార్ పరిధిలోకి వచ్చే అన్ని నగరాలు, పట్టణాలలో, పల్లెల్లో కొత్తగా అనేక పరిశ్రమలు, వాటి కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు నిర్మాణ దశలో ఉండగా మరికొన్ని సంస్థలు త్వరలోనే ఉత్పత్తి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టబోతున్నాయి. ఇప్పుడు ఏడీబీ ఇస్తున్న ఈ భారీ ఋణంతో రాష్ట్రంలో పారిశ్రామిక, మౌలికవసతుల అభివృద్ధి మరింత వేగవంతం కావచ్చును.

 

రాష్ర్టంలో వేగంగా మౌలికవసతుల అభివృద్ధి జరిగినట్లయితే, పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగం పుంజుకొంటుంది. పారిశ్రామిక అభివృద్ధితో రాష్ర్టంలో ఉపాధి అవకాశాలు, దానితో బాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. పరిశ్రమలు వస్తే రోడ్డు రవాణా, రియల్ ఎస్టేట్, హోటల్, వర్తక వాణిజ్య ఉన్నత విద్యాలయాలు వంటివనేకం అభివృద్ధి చెందుతాయి. కనుక ఏడీబీ ఇవ్వబోతున్న ఈ భారీ ఋణం రాష్ట్రానికి ఒక గొప్పవరం వాటిదేనని భావించవచ్చును.

 

ఏడీబీ నుండి ఈ ఋణం పొందేందుకు కేంద్రం నుండి అవసరమయిన అనుమతులు పొందేందుకు తగిన ప్రతిపాదనలు సిద్దం చేయమని ముఖ్యమంత్రి ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. పనిలోపనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయవలసిందిగా ఆయన ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఏడీబీ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న ఈ ఋణంలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే గ్రాంటుగా మార్చబడుతుంది కనుక రాష్ట్రంపై రుణభారం కూడా ఉండబోదు.

 

గత ఏడాది కాలంగా నానుతున్న ఈ ప్రత్యేక హోదా అంశం గురించి వచ్చే నెలాఖరులోగా తేలిపోతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి నిన్ననే ప్రకటించారు. ఈ భారీ ఋణంతో బాటు ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా మంజూరు అయినట్లయితే ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఈ భారీ అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు రానున్న నాలుగయిదేళ్ళలో స్పష్టంగా కనబడవచ్చును.