ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం!
posted on Oct 3, 2024 12:31PM

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజాధికాలు నిర్వహించారు. అమ్మవారు ఈ రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నేటి నుంచి ఈనెల 12వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ప్రతి రోజు సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. 4 వేల 500 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది.