మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు
posted on Oct 3, 2024 12:31PM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది. అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.
హెచ్ సీఏ అధ్యక్షుడిగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగిన సమయంలో టికెట్ల విక్రయాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే హెచ్ సీఏ నిధుల వినియోగంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఆ దర్యాప్తులో భాగంగానే అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
అజహర్ పై దాదాపు 20కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు, తదితరాల సేకరణలో రూ. 20 కోట్లు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అజారుద్దీన్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి సుప్రీంకోర్టు తప్పించింది. సంస్థ పనితీరును పరిశీలించేందుకు రిటైర్డ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు.