హైదరాబాద్ లో చినుకు పడితే గులాబీ పార్టీకి వణుకు.. 25 వేల కోట్లతో ఏం చేశారు?

చినుకు పడితే ఎవరైనా చిందేస్తారు. కాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాన పడుతుంటే అధికార గులాబీ పార్టీ నేతలు వణికిపోతున్నారు. హైదరాబాద్ ను  డల్లాస్ చేస్తాం, ఓల్డ్ సిటిని ఇస్తాంబుల్ చేస్తామని గతంలో గొప్పగా ప్రకటించారు కేసీఆర్. ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. అయితే  ఇప్పుడు చిన్న పాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ఐదు సెంటిమీటర్ల సరాసరి వర్షానికే సిటీలో రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలన్ని ఏకమవుతున్నాయి. వరద నీటిలో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. విశ్వనగరమో ఏమో కాని టీఆర్ఎస్ పాలనలో ఇంకా సమస్యలు పెరిగిపోయాయని,, గ్రేటర్ హైదరాబాద్ మరింత పూర్ గా మారిందని సిటీ ప్రజలు ఆరోపిస్తున్నారు.

 

ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెబుతున్నారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రోడ్లన్నీ వరదకాలువలను తలపించాయి. సిటీలో రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలన్ని ఏకమయ్యాయి. కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు సైతం కుంగిపోయాయి. గ్రేటర్ పరిధిలో నాలాలు, డ్రైనేజీలు ప్రజల పాలిట శాపంగా మారాయి. ఇంటి నుంచి బయటికి వస్తే ప్రాణాలను హరిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయి సిటీ ప్రజలు విగతజీవులుగా మారుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి 24 గంటల్లోనే నగరంలో ఇద్దరు వరద నీటిలో గల్లంతయ్యారు. నేరెడ్ మెట్ లో సైకిల్ పై రోడ్డుపైకి వచ్చిన బాలిక.. ఓపెన్ నాలాలో పడి కొట్టుకుపోయింది. 20 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలిక డెడ్ బాడీ రెండు కిలోమీటర్ల దూరంలోని చెరువులో దొరికింది. బాలిక చనిపోయిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరొకరు వరద నీటికి బలయ్యాడు. సరూర్ నగర్ తపోవన్ కాలనీలో నవీన్ కుమార్ అనే వ్యక్తి.. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. చివరికి 20 గంటల తర్వాత సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ లో నవీన్ శవాన్ని గుర్తించింది ఎన్డీఆర్ఎఫ్ టీమ్. 
                      

దేశంలో ఎక్కడా లేనట్లుగా హైదరాబాద్ లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ లను ఏర్పాటు చేశామని కేటీఆర్ వెబినార్లలో గొప్పలు చెప్పుకుంటారు. అయితే వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులను 20 గంటలైనా గుర్తించలేకపోయారు. అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన నవీన్ కుమార్ ను గుర్తించడానికి ఒక రోజంతా పట్టిందంటే గ్రేటర్ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తమ బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు చెప్పినా.. అధికారులు స్పందించ లేదని స్థానికులు ఆరోపించారు. వరదలు తమ కాలనీకి ముంచెత్తినా బల్దియా అధికారులెవరు తమకు సాయం చేయలేదని ముంపు బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలో ఇండ్ల నుంచి బయటికి వెళ్లలేక నరకయాతన పడుతున్నా ఎవరూ రాలేదని చెబుతున్నారు. కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో ఊహించుకోవచ్చు. ముంబైలో 24 గంటల్లోనే ఒక్కోసారి 30 నుంచి 40 సెంటిమీటర్ల వర్షం పడుతుంది. అలాంటి వర్షమే హైదరాబాద్ లో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఆరేండ్లలో 25 వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

 

సిటీ రోడ్లు నరక కూపాలుగా మారాయి. వరద నీరు పోయే నాలాలు విస్తరించలేదు, కొత్త కాల్వలకు గతి లేదు.. రోడ్లన్ని గుంతలుగానే ఉన్నాయి. మోకాలిలోతుకు పైగా నీరు నిలవడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు అదుపుతప్పి కిందపడ్డారు. హైదరాబాద్‌ రోడ్లపై గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. ఆ సమయంలోనే ప్రభుత్వంపై ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ లో రోడ్లపై అన్ని గుంతలే ఉండటంతో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఆటాడుకున్నారు నెటిజన్లు. గుంత రోడ్ల ఫోటోలు పెడుతూ కేసీఆర్, కేటీఆర్ ను నిలదీశారు. ఎవరైనా గుంతలు లేని రోడ్డు చూపిస్తే  లక్ష రూపాయలు ఇస్తామని కొందరు కౌంటరిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. రోడ్లపై అన్ని గుంతలే ఉండటంతో నెటిజన్ల ప్రశ్నలకు జవాబు చెప్పలేక సైలెంట్ అయిపోయారు. మరి 25 వేల కోట్లతో ఏం చేశారనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. డల్లాస్ చేయడం కాదు ముందు వరద నీరు పోయే మార్గాలు చూడాలని సీఎం కేసీఆర్ పై ఫైరవుతున్నారు ప్రజలు. 

 

రెండేండ్లలో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. అద్దాల్లా మెరిసే రోడ్లు.. డల్లాస్ నగరంలో ఉన్నటువంటి మోడల్ సౌకర్యాలు.. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాదీల కోసం ఎప్పుడూ చెప్పే మాటలు. కాని అధికారంలోకి వచ్చి ఆరేండ్లనా ఇచ్చిన హామీల్లో ఐదు శాతం కూడా అమలు కాలేదనే ఆరోపణలున్నాయి. డబుల్ బెడ రూమ్ ఇండ్ల హామీ సిటీలో నవ్వుల పాలైంది. ఆరేండ్లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలో రెండు శాతం కూడా పూర్తి చేయలేకపోయింది. లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తైందని ఇటీవల అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పగా.. అలాంటిదేమి లేదంటోంది ప్రతిపక్ష కాంగ్రెస్, నగరంలో నిర్మాణంలో ఉన్న ఇండ్ల పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి బృందం.. ఇప్పటివరకు 3 వేల 428 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయని లెక్కలతో సహా వివరించింది. 

 

నాంపల్లిలో 1824 ఇండ్లు కట్టామని ప్రభుత్వం చెప్పగా... ఆ స్పాట్ ను పరిశీలించింది కాంగ్రెస్ టీమ్. అయితే అక్కడ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 2015లో మంత్రులు చేసిన శంకుస్థాపన శిలాఫలకం కూడా మాయమవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తామన్న ప్రాంతంలోనే 2017లో ఇల్లు కూలి ముగ్గురు చనిపోయారు. 2015లో ప్రారంభించిన ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇస్తే.. గోడ కూలి ముగ్గురు చనిపోయేవారు కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి ఇప్పటికి కూడా ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో 226 ఇండ్లు పూర్తయ్యాయని సర్కార్ లిస్ట్ ఇవ్వగా.. అక్కడ కూడా ఇండ్లేమి కనిపించలేదు భట్టీ బృందానికి. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేశామని టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సర్కార్ ఇచ్చిన ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. GHMC పరిధిలో ప్రభుత్వం ఇంకెప్పుడు 2 లక్షల ఇళ్లు కడుతుందని భట్టి ప్రశ్నించారు. 

 

తెలంగాణలోని జర్నలిస్టులందరికి డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కట్టిస్తామని ఉద్యమ సమయంలో చెప్పారు కేసీఆర్. ముఖ్యమంత్రి అయ్యాకా కూడా ప్రకటించారు. కాని ఆరేండ్లవుతున్నా అది అతిగతీ లేకుండా పోయింది. జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీకి ఇండ్ల స్థలాల కోసం వైఎస్సార్ హయాంలోనే భూమి కేటాయించారు. అయితే దానిపై  కోర్టులో కేసులు వేయడంతో ఆగి పోయింది. ఇప్పటికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లోనే ఉంది. ఆ కేసు వంకతో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అటకెక్కించారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల్లో వంద మంది వరకు చనిపోయారు కూడా. అయినా ఇండ్లకు మాత్రం మోక్షం కలగడం లేదు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం  కోర్టు కేసులతో సంబంధం లేకుండానే జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వొచ్చు. కాని ఇండ్లు ఇవ్వడమే ఇష్టం లేకనే కోర్టు వంకతో తప్పించుకుంటున్నారని జర్నలిస్టులు ఆగ్రహంగా ఉన్నారు. 

 

కేసీఆర్ హామీల అమలు, హైదరాబాద్ నగర దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని మండిపడుతున్నాయి. విశ్వనగరం చేస్తామంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నాయి. డల్లాస్ చేస్తామంటూ సిటిని ఖల్లాస్ చేశారని ఫైరవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉట్టి మాటలు కట్టిపెట్టి హామీల అమలుపై ఫోకస్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే చాలని, లండన్, డల్లాస్ సిటీ తరహా సౌకర్యాలు తమకు అవసరం లేదని చెబుతున్నారు.

 

మరోవైపు సుమేధ, నవీన్ కుమార్ చనిపోయిన ఘటనలు ప్రభుత్వ పరువు తీశాయి. నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన పదకొండేళ్ల సుమేధ ఘటనకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని చిన్నారి తల్లిదండ్రులు కేసు కూడా పెట్టారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. దీంతో తమకు ఇబ్బందిగా మారిందని గ్రహించిన ప్రభుత్వం దిద్దుబాట చర్యలకు దిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం తప్పేనని అంగీకరించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సుమేధ తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతామన్నారు. ఆఫీసర్ల పొరపాటు వల్లే దుర్ఘటన జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌ చెప్పారు.