డిక్లరేషన్ పై దుమారం

1890లో రాసిన పిక్చరెస్క్ ఇండియాలోపుస్తకంలో ప్రస్తావన

 

కలియుగ దైవంగా ప్రపంచప్రఖ్యాతి గడించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశం కోసం ఇచ్చే డిక్లరేషన్ పై సంచలనాత్మక వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. ఇతర మతస్తులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అన్న అంశంపై వివాదం రోజురోజుకూ పెరుగుతుంది. తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్న వైఎస్ జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలన్న అంశంపై డిక్లరేషన్ చర్చల్లోకి వచ్చింది. ఏ గుడి, మసీదు, చర్చిలో లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకు, ఈ డిక్లరేషన్ విధానాన్ని తీసేయాలంటూ వివాదాలకు తెరతీశాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు , ఎవరిని అడిగి పెట్టారు అన్నదానిపై చర్చజరగాలన్నారు. వేరేమతం వారు సంతకం పెట్టకుండా గుడిలోకి వెళ్లితే అవిత్రమై పోతుందా, ఆచారం అంటే ఏమిటి సంతం పెట్టకుండా పోతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరుగుతుందా అంటూ బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. డిక్లరేషన్ ఎవడికి ఇవ్వాలంటూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ చివరకి డిక్లరేషన్ ఎత్తివేయాలంటూ అసంబద్ధమైన వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. 

 

అయితే ఈ డిక్లరేషన్ అంశంపై ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. 1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకం పిక్చరెస్క్ ఇండియాలో ప్రస్తావన ఉంది. ఇంగ్లడ్‌నుండి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చే బ్రిటీష్ టూరిస్టుల కోసం, రైల్వే రూట్లు, స్టేషన్లు, ఆ దార్లో ఉన్న దర్శనీయస్థలాల గురించి వివరంగా రాసిన 650 పేజీల  పుస్తకంలో 488 -489 పేజీల్లో తిరుమల గురించిన వివరణ ఉంది. దాదాపు 14వేల మంది జనాభా మాత్రమే తిరుపతిలో ఉండేవారని, వెంకన్న కొలవై ఉన్న తిరుమలను 'అప్పర్ తిరుపతి' గా ప్రస్తావిస్తూ దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఎవరైనా ఈ దేవాలయాన్ని దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని విషయాన్ని పేర్కొన్నారు. తమ దేశం నుంచి వచ్చే క్రైస్తవ యాత్రికుల సమాచారం కోసం రాసిన ఈ పుస్తకంలో తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లను, ఆచారవ్యవహారాలు వివరించారు. 

 

బ్రిటిష్ పాలనలోనే తిరుమల ఆచారాలకు ఎంతో విలువనిచ్చేవారని ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తిరుమల దేవాలయంలోని ఆచారాన్ని పాటించకపోవడం అధికార మదమే అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తిరుమలను సందర్శించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ వంటి ప్రముఖులు ఎందరో ఈ దేవాలయం నిబంధనలు గుర్తించి డిక్లరేషన్ ఇచ్చారు. రాజైనా, ప్రధాని అయినా ఎవ్వరైనా సరే దేవాలయ నియమాలు పాటించి తీరాల్సిందే అంటూ హిందువు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

ఓటు బ్యాంకుగా మాత్రమే హిందువులను చూస్తూ దేవాలయ సంప్రదాయాలు, కట్టుబాట్లను కాలరాయాలని చూడటం క్షమించరాని అంశంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రముఖ దేవస్థానాల్లో జరుగుతున్న విధ్యంసాలు హిందువుల మనుగడకు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో వందల ఏండ్ల నుంచి అమలులో ఉన్న తిరుమల తిరుపతి ఆచారాన్ని పాటించాలన్న బాధ్యత లేకుండా  డిక్లరేషన్ తీసివేయాలంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు  క్షమాపణలు చెప్పాలని బిజేపి, తెలుగుదేశం పార్టీల నేతలు, హిందు పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో హిందువుల మనుగడకు భంగం కలిగించేలా నాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం తిరుమల చేరుకోనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా అన్నది చూడాలి.