పామ్ ఆయిల్ మంత్రి
posted on Jul 13, 2025 5:24PM

రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వంటి శాఖల మంత్రులను మనం ఇప్పటి వరకు చూశాం.. కాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా పామ్ ఆయిల్ మంత్రి వచ్చారు..జిల్లాలో ఆయన పామ్ ఆయిల్ సాగుపై దృష్టి సారించారు. ఏ కార్యక్రమాని హాజరైనా పామ్ ఆయిల్ సాగుపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. దీంతో ఆయనను జిల్లా రైతులు ముద్దుగా పామ్ ఆయిల్ మంత్రి గా పిలుచుకుంటున్నారు.. ఆయన ఎవరో కాదు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… స్వతహాగా రైతు అయిన తుమ్మలకు వ్యవసాయ రంగంలో మంచి పట్టుంది. గతంలో కూడా ఆయన ఏ శాఖ మంత్రిగా పనిచేసినా జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ పైనే ఎక్కువగా శ్రద్ధ చూపేవారు.
తన స్వగ్రామం గండుగుల పల్లిలో వందల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగుచేస్తున్నారు. మిర్చి, పత్తి వంటి సాంప్రదాయక పంటలను వదిలేసి పామ్ ఆయిల్ , కొబ్బరి, వక్క, మిరియాలు, కోకో సాగు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఎంత తీరికలేని పనులు ఉన్నా ఏ మాత్రం సమయం దొరికినా స్వగ్రామం వైపు పరుగులు తీస్తారు. అర్ధరాత్రి సమయంలో కూడా గ్రామానికి చేరుకుని ఉదయాన్నే పంట పొలాల్లో ప్రత్యక్షం అవుతారు. అక్కడ పొలం పనిచేసే కార్మికులకు సలహాలు సూచనలు ఇస్తారు. ఈ రకంగా వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇదే ఒరవడిని జిల్లాలో రైతాంగం కూడా అలవర్చుకోవాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. జిల్లాలో పత్తి, మిర్చి పంటలు సాగుచేసే ఆరుగాలం కష్టపడినా పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు అప్పుల పాలు అవుతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి గా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆయన పామ్ ఆయిల్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా రైతులు పామ్ ఆయిల్ సాగుచేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు పామ్ ఆయిల్ సాగుచేస్తున్నారు. ఈ జిల్లాలో మరో 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికే 4,500 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు.. మరో 3000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికార్లను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలో తాను పాల్గనే ఏ కార్యక్రమం అయినా ఓ ఐదు నిమిషాలు పామ్ ఆయిల్ సాగు గురించి మాట్లాడటం ఆనవాయితీ మార్చుకున్నారు. దీంతో ఆయను ఇప్పటి వరకు ఇరిగేషన్ మంత్రిగా, ఆర్ అండ్ బీ మంత్రిగా పిలుచుకున్న అభిమానులు ఇప్పుడు పామ్ అయిల్ మంత్రిగా నామకరణం చేశారు