కేంద్రమే టార్గెట్‌గా తెరాస ప్లీనరీ తీర్మానాలు..

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న తెరాస ప్లీనరీలో, మొత్తం 13 తీర్మానాలు ప్రవేశ పెడుతున్నారు. ఈ తీర్మానాలను మంత్రులు పార్టీ ముఖ్యనేతలు ప్రతిపాదించగా, ఇతర సీనియర్ నాయకులు   బలపరుస్తూ, గంభీర ఉపన్యాసాలు చేస్తున్నారు. అయితే, తెరాస ప్లీనరీలో ప్రవేశ పెడుతున్న తీర్మానాలను గమనిస్తే, తెరాస ప్రభుత్వం సాధించిన అద్భుత విజయాల ప్రస్తావన అంతగా కనిపించలేదని, పార్టీ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. కేంద్ర ప్రభుతం పై కత్తులు దూయడమే ప్లీనరీ లక్ష్యంగా కనిపిస్తోందని, ముఖ్యంగా తీర్మానాలు అన్నీ, కేంద్రం చుట్టూనే తిరుగుతున్నాయని అంటున్నారు.  

యాసంగి ధాన్యం కొనిగోలు వివాదం మొదలు, జాతీయ రాజకీయాల్లో తెరాస కీలక భూమిక పోషించే తీర్మానం వరకు, ఏసీ వర్గీకరణ మొదలు బీసీ జనగణన తీర్మానం దాకా, ధరల పెరుగుదల మొదలు, మహిళా రిజర్వేషన్ బిల్లు వరకు, ప్లీనరీలో ప్రవేశ పెట్టిన ప్రతి తీర్మానాన్ని, తెరాస  కేంద్ర ప్రభుత్వం, బీజేపీల పైనే గురి పెట్టింది. అదే విధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడం చేయాలని ఏకంగా ప్రత్యేక తీర్మానం చేసింది. అంటే, రానున్న రోజుల్లోనూ, తెరాస కేంద్ర ప్రభుత్వం,బీజేపీ లక్ష్యంగానే రాష్ట్ర రాజకీయాలను ముందుకు తీసుకుపోయే అలోచన చేస్తోందని భావించవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, తమ ప్రారంభ ఉపన్యాసంలోనూ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాలలో అమలవుతున్న క‌రెంట్ కోత‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వ నిర్వాకమే కారణమని అన్నారు. అలాగే, దేశంలో ఇటీవల చోటు  చేసుకున్న మత ఘర్షణలు, వివాదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.  ఇటీవ‌లి కాలంలో దేశంలో విప‌రీత‌మైన జాఢ్యాలు, అనారోగ్య‌క‌ర‌మైన‌, అవ‌స‌రం లేవ‌నుట‌వుంటి పెడ ధోర‌ణులు ప్ర‌బలుతున్నాయ‌ని అన్నారు. భార‌త స‌మాజానికి ఇది శ్రేయ‌స్క‌రం కాదని చెప్పుకొచ్చారు. స‌మాజంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ ఆద‌రించాలి. అద్భుత‌మైన ఈ దేశంలో దుర్మార్గ‌మైన విధానాలు దేశ ఉనికినే ప్ర‌శ్నించే స్థాయికి పోతున్నాయని అన్నారు. ఈ విషయంలో ఒక రాజ‌కీయ పార్టీగా తెరాస ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.ఇలా ఏ కోణం నుంచి చూసినా, తెరాస ప్లీనరీలో కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడమే కనిపిస్తోందని పరిసీలాకులు అంటున్నారు. 

అయితే, కేంద్రంతో నిరంతర కయ్యం వలన తెరాసకు రాజకీయ ప్రయోజనం చేకూరినా, చేకురక పోయినా రాష్ట్రం నష్టపోతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. నెలల తరబడి సాగిన యాసంగి వరి వివాదం వలన రాష్ట్ర ప్రభుత్వం, తెరాస సాధించింది ఏమీలేక పోయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగిన వివాదం కారణంగా రాష్ర్  రైతాంగం భారీ మూల్యం చెల్లించిందని గుర్తు చేస్తున్నారు. పంట వేయక కొందరు, వేసిన పంటను ప్రభుత్వం కొనదనే భయంతో కొందరు మిల్లర్లు తక్కువ ధరకు విక్రయించి ఇంకొందరు రైతులు నష్ట పోయారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. రాజకీయాలను, పరిపాలనా సంబంధాలను వేరువేరుగా చూడవలసిన అవసరం ఉందని, అలా కాకుండా అయిన దానికీ, కాని దానికీ కయ్యానికి కాలు దువ్వితే చివరకు నష్ట పోయేది, మూల్యం చెల్లించేది ప్రజలే అని, ఆ పరిస్థితి రాకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కట్టుబాటు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే, ప్లీనరీ తీర్మానాల తీరు చూస్తే, ముందు  ముందు  రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలే కనిపిస్తున్నాయే, కానీ, తగ్గే సూచనలు అయితే అసలు కనిపించడం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu