డమ్మీ ఉరి.. నిర్భయ దోషుల ఉరికి ట్రైల్స్ వేయనున్న తలారి పవన్!

నిర్భయ దోషులు రేపు ( ఫిబ్రవరి 1వ తేదీన ) ఉదయం 6 గంటలకు ఉరికంబం ఎక్కనున్నారు. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి.. ఇవాళ మధ్యాహ్నం డమ్మీ ఊరి వేయనున్నారు తలారి పవన్. నిర్భయ దోషులకు పడిన మరణశిక్షను అమలు చేసేందుకు  ఇప్పటికే తీహార్ జైలుకు చేరుకున్నారు తలారి పవన్. తలారి కోసం తీహార్ జైలు ప్రాంగణంలోనే ప్రత్యేక వసతి గది ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణం లోనే ఉంటూ ఉరితాడు సామర్థ్యంతో పాటు ఇతర విషయాలను పరిశీలిస్తున్నారు. 

కొద్ది రోజుల ముందు నిర్భయ దోషులకు ఉరివేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్ నిర్వహించారు. బక్సర్ నుంచి ఉరితాళ్లను తెప్పించారు. అయితే తమకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా ఆపేందుకు నిర్భయ దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా నిర్భయ దోషి అక్షయ్ కుమార్ వేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దాంతో పాటు ఫిబ్రవరి 1వ తేదీన అమలు కానున్న ఉరిశిక్ష పై స్టే విధించాల్సిందిగా అతడు చేసిన మరో పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరో నిందితుడు వినయ్ శర్మ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది.