నామినేటెడ్ పదవుల కోసం కేటీఆర్ చుట్టూ గులాబీ నేతల ప్రదక్షిణలు!!

నామినేటెడ్ పదవుల భర్తీ కోసం గులాబీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలేవీ లేకపోటంతో కేసీఆర్ పదవులు భర్తీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆశావహులంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కార్పొరేషన్ లు, కమిషన్ లు ఇతర సంస్థలు కలిపి 56 మందికి చైర్మన్ పదవులను కట్టబెట్టింది. అందులో 49 ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి, వీటిలో కొన్ని మూడేళ్ల పదవీకాలం మరి కొన్ని రెండేళ్ల పదవీ కాలంతో నియామకాలు జరిగాయి. వీటి పదవీ కాలం కూడా ముగిసింది, ఇందులో కేవలం టీఎస్ ఐఏసీ చైర్మన్ బాలమల్లు, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పదవీకాలం మాత్రమే రెన్యువల్ అయ్యాయి.

ఈ మధ్య పార్టీలో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. గతంలో పదవీ కాలం ముగిసిన ఛైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెన్యువల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న గత చైర్మన్ లకు ఎదురు చూపులే మిగిలాయి. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవుల కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇదుగో అదుగో అంటూ ఊరించడమే తప్ప ఆచరణలోకి రాలేదన్న ఆవేదనకు పార్టీ నేతలు గురవుతున్నారు. జిల్లా స్థాయి పదవులతో కలిపి దాదాపు 500 వరకూ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని అంచనా. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నలుగురికి పైగా అవకాశం వస్తుంది.

రాష్ట్రస్థాయి లోని కొన్ని కార్పొరేషన్ లు కనీసం ఆరుగురి నుంచి పదిహేను మంది దాకా డైరెక్టర్ లను, సభ్యులను నియమించే అవకాశం ఉంది. ఆ లెక్కన కార్పొరేషన్ చైర్మన్ లను ఏర్పాటు చేసి అనుబంధంగా నామినేటెడ్ పదవులను ఇస్తే సుమారు 500 మందికి పైగా నాయకులకు అవకాశం దక్కనుంది. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యే లకు, ఎమ్మెల్సీ లకు చీఫ్ విప్, విప్ పదవులు దక్కాయి. ఇక పదవులు దక్కని ఎమ్మెల్యేలు చాలామంది కూడా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. ఇక మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల అనుచరులు కూడా నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు ఎన్నికల్లో టిక్కెట్ దక్కక ఏదో ఒక మంచి పదవి ఇస్తానని టీఆర్ఎస్ నుంచి హామీ తీసుకున్నవారు ఇలా చాలా మంది పదవుల కోసం ఆశపడుతున్నారు. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతలు అంతా తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేశారు. ఎన్నికల్లో కష్టపడితే.. పని తీరును పార్టీ ముఖ్య నేతలు గుర్తిస్తారని భావించి పని చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఆశావహులంతా తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి పదవుల విషయం అడుగుతున్నారు. తాజాగా వివిధ మాజీ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు కేటీఆర్ ను కలిసి తమ పదవుల రెన్యువల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ విద్యార్థి విభాగంతో పాటు మొదట్నుంచీ ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్యమంలో పాల్గొన్న నేతలు తమను గుర్తించాలనీ కేటీఆర్ ను కోరుతున్నట్టు తెలుస్తోంది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మహిళా నేతలు కూడా తమకు పదవులు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుతున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. పలుమార్లు ప్రకటిస్తారని ప్రచారం జరిగినా ఏదో ఒక కారణంతో ఆగిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక మున్సిపల్ ఫలితాల జోష్ లో ఉన్న కేసీఆర్ ఓ దఫా నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.