క్షణక్షణముల్ అధికారుల చిత్తముల్...
posted on Sep 8, 2012 7:08PM
పుట్టుకతో వచ్చింది పుడకలతోగానీ పోదని పెద్దవాళ్లు చెబ్తూ ఉంటారు. ఈ మాటల్ని మన అధికారులు అక్షరాలా నిజంచేస్తున్నారు. మిగతా శాఖల్లో పనిచేస్తున్న అధికారులతో పోలిస్తే దేవాదాయశాఖ అధికారులతీరు కాస్త వేరుగానే ఉంటుంది. మా దారి అడ్డాదారి అంటూ అడ్డమైన నిర్ణయాలు తీసుకోవడంలో దేవాదాయశాఖ అధికారులకు సాటిలేని మేటి వేగాన్ని ప్రదర్శిస్తారుకూడా. ప్రజల, భక్తుల మనోభావాలతో వాళ్లకస్సలు పనిలేదు. డోన్ట్ కేర్ .. అన్నట్టుగా ఉండే తీరు మార్చుకునే ప్రసక్తే లేదు. బెజవాడ కనకదుర్గ ఆలయ అధికారుల సంగతైతే అసలు చెప్పాల్సిన పనేలేదు. అమ్మవారికి మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు 10వేల రూపాయల పట్టుచీర తీసుకొస్తే అధికార్లు దాన్నసలు తీసుకోనేలేదు. దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలకోసం భక్తులిచ్చే చీరలు తీసుకోకూడదన్న నిర్ణయమే దీనికి కారణమనికూడా చెబుతున్నారు. ఈ రోజుల్లో మొక్కు తీర్చుకోవాలనే భక్తులు చీరలకు బదులుగా దానికి సరిపడా సొమ్ము ఇవ్వాలని సిబ్బంది సూచన. అధికారుల తీరుకి విసుగెత్తిపోయిన భక్తులు ‘గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా?’. ‘అధికారులకు డబ్బిస్తే, మొక్కుతీరుతుందా?’ అని తిట్టుకుంటున్నారు.