టీడీపీ ఆవిర్భావానికి అసలు రీజన్ ఇదేనా..?

దేశానికి కాంగ్రెస్ తప్ప మరో దిక్కులేదనుకునే రోజులు.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుగొడిని చిన్న చూపు చూస్తోన్న రోజులవి.. హస్తిన నుంచి ఆదేశాలు అందితే తప్ప పాలన కూడా నడవని పరిస్థితి. తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్నాళ్లు ఢిల్లీ నడివీధుల్లో తాకట్టుపెట్టాలి.. హస్తానికి ప్రత్యామ్నాయం లేదా.. అని ప్రజలు ఎదురుచూస్తోన్న సమయంలో తెలుగువారి అభ్యున్నతి కోసం.. కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలించే లక్ష్యంతో.. అప్పటి వరకు సూపర్‌స్టార్‌గా నీరాజనాలందుకున్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చైతన్యరథం ఎక్కి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు.. ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ అన్నగారు చేసిన ప్రసంగాలకు ఆకర్షితులైన ప్రజానీకం.. టీడీపీకి తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు.

 

అలా ఢిల్లీ పెద్దలకు తెలుగువారి వాడిని వేడిని రుచి చూపించారు ఎన్టీఆర్. అసలు టీడీపీ స్థాపన వెనుకున్న ముఖ్యోద్ధేశం తెలుగువాడి ఆత్మగౌరవం, కాంగ్రెస్ విముక్త భారతదేశం. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టడానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్. అప్పట్లో నెల్లూరుకు చెందిన కొందరు అభిమానులు ఎన్టీఆర్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మద్రాస్ నుంచి కారులో వచ్చారు రామారావు గారు.. దానికి చీఫ్ గెస్ట్ నేదురుమల్లి జనార్థన్ రెడ్డి. ప్రయాణ బడలికతో అలసిపోయి ఉన్న ఎన్టీఆర్ ముఖం కడుక్కుందామని బాత్‌రూమ్‌కి వెళ్లారు. అది చూసిన నేదురుమల్లికి కోపం వచ్చింది. నాకు ఇచ్చిన గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లడానికి ఈ సినిమావాడికి ఎంత ధైర్యం అంటూ ఆవేశంతో తన అనుచరులతో అన్నారట.

 

ఆ మాటలు అన్నగారు వినడంతో ఆయన ముభావంగా సన్మానం చేయించుకొని.. ఏమీ తినకుండానే మద్రాస్ వెళ్లిపోయారు. తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్టీఆర్ కాంగ్రెస్ అనే కంచుకోటను బద్దలుకొట్టారు. అయితే ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా.. పార్టీ పెట్టడానికి ముందు జరిగిన మంతనాల్లోనూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారాయన. మరి శివప్రసాద్ గారి వ్యాసంలో వాస్తవమెంత అన్నది అన్నగారి అంతరంగికులకే తెలియాలి. ఎందుకోసం పెట్టినా.. ఏ ఉద్దేశ్యంతో పెట్టినా.. తెలుగువారికి రాజకీయ చైతన్యాన్ని, ఎందరికో రాజకీయ బిక్షను పెట్టి, ప్రజారంజక పాలనను అందించిన అన్నగారు నిజంగా అభినందనీయులు.