తెలంగాణలో మారుతోన్న రాజకీయ ముఖచిత్రం...

 

తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు జరగబోతోందని అంటున్నారు. మొన్నటివరకూ ఢీ అంటే ఢీ అన్న పార్టీలు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. శత్రువు శత్రువుకు మిత్రుడన్నట్లుగా... ప్రస్తుతం టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఇదే థియరీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకూ రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న ఈ రెండు పార్టీలూ... ఇప్పుడు ఉమ్మడి శత్రువును టార్గెట్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. అమిత్‌షా తెలంగాణ పర్యటన తర్వాత టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య కొద్దిరోజులు మాటల యుద్ధం నడిచినా... రాష్ట్రపతి ఎన్నిక వీరిద్దరినీ దగ్గర చేసిందని చెబుతున్నారు. అంశాల వారీగా కలిసి పనిచేయడం ద్వారా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌‌ను బలహీనపర్చాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది.

 

ప్రధాని మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తోన్న కేసీఆర్‌... తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోడీతో ఉన్న చనువుతోనే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ ధీమాగా ఉన్నారని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమైనా... తెలంగాణలో తీసుకొచ్చిన 12శాతం బీసీ-ఈ రిజర్వేషన్లకు కేంద్రం అనుమతిస్తుందన్న నమ్మకంతో కేసీఆర్‌ ఉన్నారంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో కేసీఆర్‌కి మోడీ హామీ కూడా ఇచ్చారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. మోడీ ఇచ్చిన భరోసాతోనే ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌ ధీమా ఉన్నారని అంటున్నారు.

 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించిన వెంటనే అందరి కంటే ముందుగా కేసీఆర్‌ మద్దతు ప్రకటించడం, ప్రెసిడెంట్‌ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడం, ఢిల్లీ పర్యటనలో మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలవడం, వెంకయ్యకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం, ఇవన్నీ టీఆర్‌ఎస్‌-బీజేపీ నయా దోస్తీకి రుజువు అంటున్నారు. కేసీఆర్‌ రియాక్షన్‌, గులాబీ నేతల సైలెన్స్‌ చూస్తుంటే... రెండు పార్టీలూ కలిసి ట్రావెల్‌ చేయడం ఖాయమంటున్నారు. అంతేకాదు ఎన్నికల వరకూ కలిసి పనిచేస్తూ... అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి... ప్రీ పోల్‌ అలయన్స్‌... లేదా పోస్ట్‌ పోల్‌ అలయన్స్‌ పెట్టుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌తో దోస్తీని తెలంగాణ బీజేపీ వ్యతిరేకిస్తున్నా... భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మౌనం దాల్చుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu