రాజుగారి కోటలో గంటా దూకుడు... ఆధిపత్య పోరులో అశోక్‌ సతమతం !

 

శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని ఎలా అంటామో విజయనగరం జిల్లా టీడీపీలో అశోక్ ఆజ్ఞ లేనిదే కనీసం కార్పొరేటర్ కూడా కాలేరంటారు. అందుకే రాజుగారి దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడతారు. ఆయన చెప్పినదే వేదవాక్కు అంటూ చేతులు కట్టుకుని మరీ వినయంగా వింటారు. అటు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున ఒక పదవి రావాలన్నా... నామినేటెడ్ పదవులు దక్కాలన్నా.... చివరికి ఎమ్మెల్యే సీటు దక్కాలన్నా అశోక్ సంప్రదింపులు లేకుండా అధిష్టానం సైతం ఎంపిక చేయదనే పేరుంది. అందుకే విజయనగరం జిల్లా టీడీపీ నాయకులకు అశోక్ గజపతిరాజు అంటే అంత హడల్. అందుకే అశోక్ ప్రసన్నం కోసం ఆయన బంగ్లా చుట్టూ చక్కెర్లు కొడతారు. రాజుగారి చూపు తనపై ఎప్పుడు పడుతుందా అంటూ వేచి చూస్తారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అశోక్‌ మాటకు అధిక విలువ ఇస్తారంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. శాసించడం... ఆదేశించడం తప్ప... తన మాటకు ఎదురేలేని కేంద్ర మంత్రి అశోక్ కోటలో ఆధిపత్య పోరు మెుదలైంది. తెలుగుదేశం పార్టీకే పెద్దదిక్కుగా ఉంటూ ఉత్తరాంధ్రలో చక్రం తిప్పే ఆయన స్పీడ్‌కు బ్రేకులు పడుతున్నాయి. విజయనగరంలో రాజుగారి సైకిల్‌ స్పీడ్‌కు ఇన్‌ఛార్జ్‌ మంత్రి బ్రేకులు వేస్తున్నారు. అదే సమయంలో అధిష్టానం దగ్గర రాజుగారి పరపతి తగ్గిందనే ప్రచారం జరుగుతోంది.  టీడీపీలో అశోక్‌కు ప్రత్యేక స్థానమున్నా... పార్టీ అవసరాల దృష్ట్యా రాజుగారి మాటను పక్కనబెడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును టీడీపీలోకి తీసుకోవడమే కాకుండా, మంత్రి పదవి కట్టబెట్టడంలోనూ అశోక్‌ అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాదు టీడీపీ పార్లమెంటరీ భేటీల్లోనూ అశోక్‌ గజపతిరాజుకి గతంలో దక్కిన గౌరవం... ఇప్పుడు దక్కడం లేదనే మాట వినిపిస్తోంది.

 

అయితే విజయనగరం జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న అశోక్ సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త విధానాలు అనుసరిస్తూ ఆయన ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజుగారి అనుచరులు మండిపడుతున్నారు. ముఖ‌్యంగా జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి గంటా చేష్టలు అశోక్‌ గజపతిరాజుకి విసుగుపుట్టిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల గంటాకి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మరోవైపు సుజయ్‌కృష్ణ, శత్రుచర్ల విషయంలో తన అభ్యంతరాలను అధిష్టానం పట్టించుకోకపోవడంతో... కంగుతిన్న అశోక్‌ గజపతిరాజు... చేసేది లేక కిమ్మనకుండా ఉంటున్నారని, కానీ ఇది విజయనగరం జిల్లాలో పార్టీకి చేటు చేస్తుందని రాజుగారి అభిమానులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu