తెలంగాణపై వాయలార్ రవి దోశ కథ

 

ఒకప్పుడు తెలంగాణావాదులను చూస్తే పులిని చూసినట్లు ఉలికులికిపడిన కాంగ్రెస్ అధిష్టానం, గులాంనబీ ఆజాద్ నెలరోజుల గడువును అలవోకగా తీసి పక్కన పడేసినప్పటి నుండీ గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకొన్నట్లు ఊపిరి పీల్చుకొన్నారు. ఆ తరువాత కొద్ది రోజులు చర్చలంటూ గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కొంత హడావుడి చేసినా, తెలంగాణా వాదులు కొంచెం చల్లబడినట్లు గుర్తించి, క్రమంగా తమ హడావుడిని కూడా తగ్గించుకొంటూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం మెల్లగా వేరే వ్యాపకాలతో బిజీ అయిపోయింది. మరో వైపు తెరాస కూడా ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టే ప్రయత్నంలో పడటంతో, ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణా అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది.

 

తెలంగాణా సంగతేమిటయిందని తెలంగాణావాదులు అడగకపోయినా డిల్లీలో ఉన్న తెలుగు మీడియా వారు మాత్రం, కనబడిన కాంగ్రెస్ నేతలను అడగడం మానలేదు. ఈ రోజు ఏఐసీసీ సభ్యుడు మరియు కేంద్ర మంత్రి వాయలార్ రవి కనబడినప్పుడు మీడియా మళ్ళీ అదే ప్రశ్న వేయడంతో ఆయన కొంచెం అసహనానికి గురయ్యారు. తెలంగాణా అంటే దోశె వేసినంత సులువు కాదు. అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం కోసం చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. దానికి నిర్ణీత గడువంటూ ఏమి లేదు. మీరు ఇలాగ ఎపుడుపడితే అప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని వేదించకండి అని కొంచెం ఖటువుగా సమాధానం ఇచ్చేసరికి మీడియా వారు ఆశ్చర్యపోయారు. అయితే, ఆయన దైర్యానికి కారణం రాష్ట్రంలో తెలంగాణా వేడి చల్లారడమే అని చెప్పవచ్చును.

 

ఇదేమాట ఆయన ఉద్యమం తీవ్రంగా సాగుతున్నపుడు చేసిఉంటే దాని పర్యవసానం వేరేగా ఉండేది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తనకు తీరికయినప్పుడు తెలంగాణా సంగతి మాట్లాడుదామని చెప్పగలుగుతోందంటే అందుకు కారణం మాత్రం తెరాస, తెలంగాణా జేయేసీల ధోరణిలో వచ్చిన మార్పేనని చెప్పవచ్చును. అందువల్ల, ఇక 2014 ఎన్నికల వరకు తెలంగాణా గురించి ఆలోచించనవసరం లేదు.