మురళీమోహన్ పై జయప్రద 'సై

 

ఒకనాడు సినిమాలలో కలిసి నటించిన నటీనటులు వివిధ రాజకీయపార్టీలలో చేరడంతో ఒకరినొకరు విమర్శించుకోక తప్పనిసరి పరిస్థితి. ఒకనాడు చిరంజీవితో ఎన్నో సినిమాలలో కలిసి ఆడిపాడిన విజయశాంతి, రోజావంటివారు కేవలం వైరిపక్షంలో ఉన్నందునే ఇప్పుడు ఆయనకు విరోధులుగా మారారు. ఇప్పుడు వారికి మరో అలనాటి అందాలభామ జయప్రద కూడా జత కలిసింది.

 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలలో చక్రం తిప్పిన ఆమె, అక్కడ మారిన రాజకీయ సమీకరణాలవల్ల మళ్ళీ వెనక్కి రాకతప్పలేదు. అయితే, రాష్ట్రంలో కాలుపెట్టి ఇంచుమించు ఏడాది పూర్తవుతున్నపటికీ, ఆమె ఇంతవరకు ఏపార్టీలో చేరాలో తేల్చుకోలేకపోయారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వైపు కొద్ది రోజులక్రితం వరకు చూసినప్పటికీ, అటునుండి తగిన స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మంచిచేసుకొనే పనిలో పడ్డారు.

 

అయితే, స్వేచ్చ,స్వాతంత్రలకు పెట్టింది పేరయిన కాంగ్రెస్ పార్టీని కాదనుకొని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు వెళ్లాలనే ఆమె ప్రయత్నం చూస్తే బహుశః రాబోయే ఎన్నికలలో ఆపార్టీ గెలిచే అవకాశం ఉందని ఆమె అంచనా వేసి ఉండవచ్చును. అందువల్ల, గత కొంత కాలంగా ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.

 

ఆమె ఈరోజు మీడియావారితో మాట్లాడుతూ తానూ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దం అని, తన స్వస్థలమయిన రాజమండ్రీ నుండే తానూ పోటీ చేయలనుకొంటున్నానని చెప్పారు. అయితే, ఏ పార్టీలో చేరుతాననే సంగతిని త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. ప్రజలను కలుసుకోవడానికి, వారి కష్టాలు తెలుసుకొని ఓదార్చడానికి పరిమితమయినంత కాలం పాదయాత్రలు సమర్దించవచ్చును కానీ, అధికారం కోసం చేపడితే మాత్రం సమర్దించలేమన్నారు. ఇది పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబును, షర్మిలను ఉద్దేశించి అన్నమాటలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, ‘ప్రజలను ఓదార్చేందుకు అయితే పరువలేదు’ అనే చిన్నపదం కలడంవల్ల షర్మిల పాదయాత్రకు అనుకూలంగా మాట్లాడినట్లు భావించవచ్చును.

 

అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రీ నుండి పోటీ చేయాలని ఆమె నిర్ణయం తీసేసుకొన్నంత సులువుగా ఆమెకు పార్టీ టికెట్టు దొరకకపోవచ్చును. ఎందుకంటే, ఇప్పటికే, ఆపార్టీలో చాలామంది సీనియర్లు ఆ సీటుకోసం కాసుకొని కూర్చొన్నారు. అందువల్ల ఆమె డిల్లీ నుండి ఎగిరివచ్చి హట్టాతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వాలిపోయి రాజమండ్రి సీటు ఇమ్మనగానే ఇచ్చేసే అవకాశం లేదు.

 

ఒకవేళ ఆమెకు శాసన సభ టికెట్ ఇచ్చినట్లయితే, ఆమె ఒకనాటి తన సాటి నటుడు మురళీమోహన్ (తెలుగుదేశం పార్టీ)ను డీకోనకతప్పదు. ఒకవేళ యం.పీ.సీటు దొరికితే రాజమండ్రీలో మంచి పలుకుబడి, రాజకీయ బలం కలిగిన కాంగ్రెస్ యం.పీ. ఉండవల్లి అరుణ్ కుమార్ ను డీకొనక తప్పదు. రాష్ట్ర రాజకీయాలలో ఏమాత్రం పలుకుబడి, అనుభవం, అవగాహనా లేని జయప్రదకు వారిరువురిలో ఎవరిపైనా కూడా గెలవడం అసాద్యమేనని చెప్పక తప్పదు.

 

అందువల్ల ఆమెకు ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఈయవచ్చునేమో కానీ, పార్టీ టికెట్ ఈయకపోవచ్చును. ఒకవేళ ఇచ్చినా ఆమెకు రాజమండ్రి కాక వేరే ఎక్కడయినా ఈయవచ్చును. రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక, అవి కేవలం గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్స్ కేటాయిస్తాయి తప్ప జయప్రదవంటి వారికి కేటాయించి రిస్క్ తీసుకోకపోవచ్చును. ఇక, ఆమెకు మిగిలిన ఏకయిక మార్గం స్వంతత్ర అభ్యర్ధిగా పోటీ చేసుకోవడమే. ఒకవేళ ఎన్నికలలో గెలిచి తన సత్తా చాటుకొనగతే, అప్పుడు ఆమెకు అన్ని రాజకీయపార్టీలు ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతిస్తాయి. అయితే అదికూడా ఆమె అనుకొనంత అంత వీజీ ఏమి కాదు.