తెలంగాణా విద్యుత్ సమస్యలకు ఎవరు బాధ్యులు?
posted on Oct 7, 2014 9:50AM
.jpg)
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, “రాష్ట్రంలో ప్రస్తుత కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తూ, మరో మూడేళ్ళలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు తీరిపోతాయని హామీ ఇస్తున్నారు. కానీ ఆయన ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి రాగానే రోజుకి 8గంటలు చొప్పున విద్యుత్ ఇస్తామని, మూడేళ్ళ తరువాత రోజుకి 24గంటలు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి మరిచిపోయి, ఇప్పుడు గత ప్రభుత్వాలను నిందిస్తున్నారు. అంటే ఆయనకు ఎన్నికల సమయంలో తెలంగాణాలో విద్యుత్ పరిస్థితి గురించి తెలుసుకోకుండానే హామీలు ఇచ్చేరా? లేక తెలిసీ ఎన్నికలలో గెలవడానికి ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ హామీ ఇచ్చేరా? అనే విషయం ఆయనే వివరించాలి.
నిజానికి చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేప్పట్టే సమయానికి ఆంధ్ర,తెలంగాణా రెండు రాష్ట్రాలలో కూడా తీవ్ర విద్యుత్ సమస్య ఉండేది. కానీ ఈ నాలుగు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సమస్యల నుండి క్రమంగా బయటపడుతుంటే, తెలంగాణా రాష్ట్రం మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. అందుకు తెలంగాణా ప్రభుత్వం వేరేవరినో కాక తనను తానే నిందించుకోక తప్పదు. ఎందువలన అంటే తెలంగాణాలో తీవ్ర విద్యుత్ కొరత ఉందని గ్రహించినప్పుడు, తక్షణమే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఉండి ఉంటే నేడు సమస్య ఇంత తీవ్రం రూపం దాల్చేది కాదు. కానీ కేసీఆర్ పొరుగునున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో, అటు కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చేరు తప్ప ఏనాడు వారి సహకారం తీసుకొని ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయలేదు. కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ ఓ సందర్భంగా మాట్లాడుతూ ‘కేంద్రం తెలంగాణకు సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రప్రభుత్వాన్ని కలిసే ఆలోచనే చేయలేదు’ అనడం గమనిస్తే తెలంగాణా ప్రభుత్వ ప్రయత్నలోపం ఉందని అర్ధమవుతోంది.
అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోగలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి కారణంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టును రాష్ట్రం సాధించుకోగలిగింది. అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా సమస్య కూడా పరిష్కరింపబడటంతో, విద్యుత్ ఉత్పత్తి కూడా మెరుగుపడింది. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాలతో, కేంద్రప్రభుత్వంతో సానుకూల ధోరణి వ్యవహరించి ఉండి ఉంటే, బహుశః పరిస్థితి వేరేలా ఉండేదేమో?