బీహార్లో మాడిపోతోన్న లాలూ ఫ్రై!

బీహార్లో నితీష్ కుమార్, బీజేపి పెద్దల పనుల్ని లాలూ ప్రసాద్ కొడుకే స్వయంగా తేలిక చేసి పెడుతున్నట్టు కనిపిస్తోంది! ఎలాగైనా లాలూ ప్రసాద్ తో తెగదెంపులు చేసుకోవాలని చూస్తోన్న నితీష్ కు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వ్యవహార శైలి మరింత కలిసి వస్తోంది! తాజాగా ఆయన మనుషులు మీడియా వాళ్లని కూడా వదల్లేదు. రిపోర్టర్లు, కెమెరామెన్ ని చితగొట్టారు! తరువాత తీరిగ్గా మీడియా వాళ్లే గందరగోళానికి కారణం అంటూ ఫేస్బుక్ పోస్టు పెట్టాడు తేజస్వీ!

 

లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కూతురు, కొడుకుల ఆస్తుల మీద సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే! కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు నేరుగా బీహార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వున్న తేజస్వీ యాదవ్ పై పడుతోంది. పొత్తులో భాగంగా నితీష్ లాలూ కొడుక్కి డిప్యుటీ సీఎం పదవి ఇచ్చారు. మొదట్లో బీజేపిని కట్టడి చేయటానికి ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు నితీష్. కాని, రాను రాను లాలూ , ఆయన కొడుకుల తీరుతో విసిగిపోయారు. అందుకే, మెల్లగా నోట్ల రద్దును సమర్థించటం లాంటి సంకేతాలతో బీజేపికి దగ్గరయ్యారు. ఇప్పుడు ఇక చివరి అడుగులు వేస్తున్నారు. మోదీ సర్కార్ లాలూ స్థావరాలపై దాడులు చేయిస్తుండటంతో ఇదే అదనుగా నితీష్ పొత్తు నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు!

 

నితీష్ ఇప్పటికే డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ కు నాలుగు రోజుల డెడ్ లైన్ పెట్టాడు. తన మీద వస్తోన్న అవినీతి ఆరోపణలకు వివరణ ఇవ్వాలని కోరాడు. అంటే , ఇన్ డైరెక్ట్ గా రాజీనామా కోరాడన్నమాట. అందుకు లాలూ, అతడి కొడుకు ససేమీరా అంటున్నారు. ఈ గొడవ చివరకు లాలూ, నితీష్ పార్టీల విడాకులకి దారి తీస్తుందని అంతా భావిస్తున్నారు. అంతలోనే లాలూ కొడుకు తన మనుషులతో మీడియా మీద దాడి చేయించాడు!

 

టీవీ కెమెరాల ముందు తేజస్వీ యాదవ్ మనుషులు స్పష్టంగా చేయి చేసుకోవటం కనిపించినా మళ్లీ తమ తప్పు ఏమీ లేదని బుకాయిస్తున్నాడాయన! మరో వైపు మీడియా కూడా దాడిని సీరియస్ గా తీసుకుని బీహార్ డిప్యుటీ సీఎంని ఏకిపారేస్తోంది. మొత్తంగా ఈ గొడవంతా నితీష్ వ్యూహానికి అనుకూలిస్తోంది. ఆయన ఆర్జేడీ నుంచి విడిపోతే జనంలో వచ్చే వ్యతిరేకత అంతకంతకూ తగ్గిపోతోంది. ఇటు బీజేపి కూడా నితీష్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తోంది! సో… లాలూ, బీజేపీల గొడవ నితీష్ కి కలిసి వస్తోందన్నమాట!